తాడేపల్లిగూడెం : కేంద్ర ఉన్నత విద్యాసంస్థలు జిల్లాకు రానట్టేనా.. ప్రస్తుతం జిల్లా ప్రజల్లో మెదలుతున్న ప్రశ్న ఇది. ఎందుకంటే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఇది నిజమేనని తెలుస్తోంది. తాడేపల్లిగూడెంలో నిట్ ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఆ వెంటనే కేంద్ర బృందాలు రంగంలోకి దిగి భూముల వివరాలు సేకరించడంతో పాటు భవనాల నిర్మాణాలకు ప్లాన్లు సైతం రూపొందించేశాయి. గూడెంలో నిట్ ఏర్పాటుకు అన్నీ అనుకూలతలేనంటూ ప్రకటనలు కూడా ఇచ్చేశారు. వచ్చే ఏడాది తాత్కాలికంగా తరగతులు ప్రారంభించేందుకు స్థానిక విద్యాసంస్థలతో సైతం మాట్లాడేశారు. త్వరలోనే గూడెంలో నిట్ ఏర్పాటు పనులు ప్రారంభమవుతాయన్న తరుణంలో చంద్రబాబు జిల్లాపై మరోసారి చిన్నచూపు చూపించి తన నైజాన్ని ప్రదర్శించారు. నిట్‌ను కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు నిట్ తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయడం లేదు కాబట్టి ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించారు.
కర్నూలుకు ట్రిపుల్ ఐటీ
అంతలోనే కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ట్రిపుల్ ఐటీ ఏర్పాటుకు కర్నూలు జిల్లా అనుకూలంగా ఉందంటూ స్వయంగా పేర్కొన్నారు. అక్కడి భూములను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో గూడెంకు అనుకున్న ట్రిపుల్ ఐటీ కూడా తరలిపోయినట్టే. మరి జిల్లాకు ఏం ఇస్తారు అంటే.. తెలి యని పరిస్థితి. ఇంతకీ నిట్ తాడేపల్లిగూడెంలో ఎందుకు ఏర్పాటు చేయడం లేదంటూ కొందరు జిల్లా ఉన్నతాధికారులు కేంద్ర అధికారులను ప్రశ్నిస్తే.. గూడెంలోని భూముల నైసర్గిక స్వరూపం నిట్ ప్రమాణాలకు అనుకూలంగా లేదట. ఇది విన్న జిల్లా అధికారులు సైతం షాక్ తిన్నారు. కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటుకు ప్రధానంగా చూసేవి దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కనెక్టివిటీ ఎలా ఉంది? రైళ్లు, రోడ్, ఎయిర్‌వే ఉందా లేదా అనే విషయాలు మాత్రమే. అవన్నీ గూడెంకు అనుకూలంగా ఉన్నాయని కేంద్ర అధికారుల బృందాలు పరిశీలించి స్పష్టం చేశారు. తీరా కృష్ణా జిల్లాకు తరలించేందుకు సిద్ధం కావడంతో ఏదో ఒక కారణం చెప్పాలి కాబట్టి వారు నైసర్గిక స్వరూపం అంటూ చెబుతున్నారని అధికారులే తెలిపారు. అసలు విషయం ఓ సామాజిక వర్గం లాబీయింగే కారణమని తెలిసిందే.
కేంద్ర సంస్థల రాక హుళక్కేనా ?
Published Sun, Dec 21 2014 12:30 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM
Advertisement