Neena Gupta: అందమైన అంకెల లోకంలో అపురూప విజేత ఆమె
National Mathematics Day 2022: చిన్నప్పుడు బొమ్మలతో కాదు లెక్కలతో ఆడుకుంది నీనాగుప్తా. జటిలమైన గణిత సమస్యల పరిష్కారంలో తనదైన ప్రతిభ చూపి యువతరానికి ఆదర్శంగా నిలుస్తుంది. ‘గణితంలో నైపుణ్యం సాధించడానికి ఒక జీవితకాలం చాలదు’ అంటున్న నీనాగుప్తా గణితంపై ఆసక్తి, పరిశోధనలనే తన జీవనవిధానంగా మార్చుకుంది...
చాలామంది పిల్లల మాదిరిగా చిన్నప్పుడు లెక్కలు అంటే భయపడేది కాదు నీనాగుప్తా. లెక్కలతోనే ఆడుకునేది. పాడుకునేది. తల్లిదండ్రులకు గణితం అంటే ఇష్టం. నీనాకు చిన్నవయసులోనే గణితంలో మెలకువలు నేర్పించి, ఆ సబ్జెక్ట్ అంటే ఇష్టమయ్యేలా చేశారు. స్కూల్లో మ్యాథ్స్‌లో ఎప్పుడూ తానే మొదటి స్థానంలో నిలిచేది.
గణితశాస్త్రవేత్త ఆస్కార్ జరిస్కి లెక్క ఒకటి 65 సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా ఉంది. ఈ సమస్యను పరిష్కరించి 2014లో ‘యంగ్ సైంటిస్ట్’ అవార్డ్ అందుకుంది నీనా. 2019లో ‘శాంతిస్వరూప్ భట్నాగర్’ అవార్డ్ అందుకుంది. గత సంవత్సరం అత్యున్నత పురస్కారం అయిన ‘రామానుజన్ ప్రైజ్’ కు ఎంపికైంది.
‘నీనాగుప్తా పరిశోధనలు బీజగణితానికి సంబంధించి ఆమె నైపుణ్యానికి అద్దం పడతాయి. భావితరాలకు ఉపయోగపడతాయి’ అని గుప్తాను కొనియాడింది రామానుజన్ అవార్డ్ కమిటీ. ‘మ్యాథ్స్‌లో ఒక సవాలు మనకు స్వాగతం పలుకుతుంది. ఆ సవాలును స్వీకరించి విజయం సాధించినప్పుడు వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిది’ అంటుంది నీనా.
‘చదివించింది చాలు. పెద్ద చదువులు ఎందుకు’ అని నీనా గురించి ఇరుగు,పొరుగు మాటలను తల్లి లెక్క చేయలేదు. కూతురుకు అన్ని విధాలుగా అండగా నిలబడింది.
‘ఒక మహిళకు మరో మహిళ అండగా ఉంటే, ధైర్యం ఇస్తే ఎన్నో విజయాలు సాధించవచ్చు’ అని తల్లిని ఉద్దేశించి అంటుంది నీనా.
‘నీనా పనితీరును పదిహేను సంవత్సరాలుగా గమనిస్తున్నాను. ఎప్పటికప్పుడు తన ప్రతిభను మరింతగా మెరుగుపరుచుకుంటూనే ఉంది. ఆమెకు గణితమే ప్రపంచం’ అన్నారు ఐఎస్ఐ, కోల్‌కతా ప్రొఫెసర్ అమర్త్య కుమార్ గుప్తా.
‘అభిరుచిగా మొదలైన గణితం ఇప్పుడు నా జీవనవిధానంగా మారింది’ అంటున్న 38 సంవత్సరాల నీనాగుప్తా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ), కోల్‌కతాలో ప్రొఫెసర్‌గా పనిచేస్తుంది.
తాజాగా ఫోర్బ్స్ ఇండియా ఉమెన్–పవర్ (సెల్ఫ్‌మేడ్ ఉమెన్–2022) జాబితాలో చోటు సంపాదించింది. ‘ఈ గుర్తింపు నా బాధ్యతను మరింత పెంచింది’ అంటున్న నీనాగుప్తా గణింతపై భయాలను తొలిగించి, అందరికీ చేరువ చేయడానికి అవసరమైన భవిష్యత్ ప్రణాళికకు రూపకల్పన చేసుకుంది.
చదవండి: క్రిస్మస్ వేళ.. మమ్మీ.. శాంటా ఏమిచ్చాడో చూడు..
Sudheera Valluri: మన వృత్తే మన గుర్తింపు