ఎనిమిదేళ్లుగా ఆగుతూ....సాగుతూ
గజ్వేల్, న్యూస్‌లైన్: గజ్వేల్ నియోజకవర్గ ప్రజానీకానికి వరప్రదాయినిగా భావిస్తున్న ‘మంజీర’ పథకం ఎక్కడవేసిన గొంగళి అక్కడేనన్న చందంగా మారింది. ఇక్కడి ప్రజల దాహార్తిని శాశ్వతంగా తీర్చడానికి ఎనిమిదేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పంతో రూపుదిద్దుకున్న ఈ పథకం, ఆయన మరణానంతరం ముందుకు సాగడం లేదు. ఈ పథకానికి గత ఏడాదిన్నర క్రితం ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ (నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రాం) పథకం కింద రూ.40 కోట్లు మంజూరైతే, అందులో రూ.10 కోట్లకు సంబంధించిన పనులు గతంలో ప్రారంభమయ్యాయి. కానీ రూ.30 కోట్ల నిధుల వినియోగంపై మాత్రం సదిగ్ధం నెలకొంది.
టెండర్ పూర్తయి..రెండున్నర నెలల కిందట పనులకు శంకుస్థాపన చేసినా, ఎన్నికలను సాకుగా చూపి అధికారులు పనులు నిలిపివేశారు.
గజ్వేల్‌తోపాటు జిల్లాలోని నర్సాపూర్, దుబ్బాక, మెదక్(పాత రామాయంపేట నియోజకవర్గం) నియోజకవర్గాల్లో 20 వుండలాల పరిధిలోని 960 గ్రావూలకు నీరందించే లక్ష్యంతో చేపట్టిన ‘మంజీర’ పథకానికి 2006 మే నెలలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలో శంకుస్థాపన చేశారు. వెంటనే పనులు ప్రారంభమయా యి. సాలీనా వుంజీరా నది నుండి 0.7 టీఎంసీల నీరు ను ఈ పథకం కోసం వాడుకోవాలని నిర్ణయించారు. ఆ తర్వాతదీన్ని 0.77కి పెంచారు. వెంటనే పనులు కూడా ప్రారంభం కావడంతో గజ్వేల్ నియోజకవర్గంలో ‘మంజీర’ పథకం పనులు 50 శాతం వరకు జరిగాయి.
తూప్రాన్, వర్గల్ మండలం మజీద్‌పల్లి గ్రామాల్లో సంప్‌హౌస్‌ల నిర్మాణం చేపట్టిన అధికారులు తూప్రాన్, వర్గల్, గజ్వేల్ మండలాల్లోని కొన్ని గ్రామాలకు ప్రస్తుతం పాక్షికంగా నీరందిస్తున్నారు. ఈ పథకాన్ని పూర్తి చేయడానికి ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ పథకం ద్వారా ఏడాదిన్నర క్రితం రూ. 40 కోట్లు మంజూరు కాగా ఈ నిధులతో నియోజకవర్గంలోని తూప్రాన్, వర్గల్, ములుగు, గజ్వేల్, జగదేవ్‌పూర్ మండలాల్లోని 80కిపైగా గ్రామాల్లో పైప్‌లైన్ విస్తరణ పనులు చేపట్టాల్సి ఉంది. అంతేగాకుండా పలుచోట్ల ఓహెచ్‌బీఆర్ ట్యాంకుల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కానీ కొత్త నిబంధనల ప్రకారం స్టేట్ టెక్నికల్ కమిటీ అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉండగా, ఈ ప్రక్రియలో నెలల తరబడి జాప్యం నెలకొంది.
ఫలితంగా ప్రభుత్వం మంజూరుచేసిన రూ.40 కోట్లల్లో కేవలం రూ.10 కోట్లకు సంబంధించిన పనులే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఎట్టకేలకు రెండు నెలల కిందట రూ.30 కోట్ల పనులకు కూడా అధికారులు శంకుస్థాపన చేశారు. దీంతో జనమంతా సంబరపడ్డారు. త్వరలోనే మంజీర నీరు తమ లోగిళ్లలోకి వస్తుందనుకున్నారు. కానీ అధికారులు ఉన్నట్టుండి పైప్‌లైన్ విస్తరణ పనులను నిలిపివేశారు. రోడ్ల పక్కన పైప్లైన్ల కోసం కాల్వలు తవ్వితే, వాటి ద్వారా వివిధ టెలీ కమ్యూనికేషన్ వైర్లు దెబ్బతి ంటాయని అదే జరిగే ఎన్నికల సమయంలో ఇ బ్బందులుంటాయని అధికారులు చెప్పుకొచ్చారు.
కొండపాక మండలంపై నీలినీడలు
గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, వర్గల్, ములుగు, జగదేవ్‌పూర్ మండలాలకు ఈ పథకం అడపాదడపా వర్తించే అవకాశముండగా, కొండపాక మండలంపై మాత్రం నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ మండలంలోని గ్రామాలకు మంచినీటిని అందించి దాహార్తిని తీర్చాలంటే సుమారు రూ. 20 కోట్ల నుంచి రూ. 30 కోట్ల వరకు నిధులు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు పంపినా,మంజూరుపై ఇప్పటివరకు స్పష్టతలేకపోవడంతో పరిస్థితి ఇబ్బందిగా మారింది. ఈ వ్యవహారంపై గజ్వేల్ ఆర్డబ్ల్యూఎస్ ఇన్చార్జి, డిప్యూటీఈఈ మోహన్‌రెడ్డిని వివరణ కోరగా, కొండపాక మండలానికి నిధులు రాబట్టేం దుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రూ.30 కోట్ల మంజీర పథకం పనులు ఎన్నికల ఫలితాల తర్వాత వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు.