national rural drinking water scheme
-
‘ఛీ’కోడ్!
పాపన్నపేట: చుట్టూరా మంజీర ఉన్నా.. తాగునీరు కరువై పల్లె ప్రజలు అల్లాడుతున్నారు. ప్రభుత్వం రూ.4.60 కోట్లతో తాగునీటి పథకాన్ని మంజూరు చేసినా, పనులు ముందుకు సాగడం లేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం వెరసి చీకోడ్ తాగునీటి పథకానికి గ్రహణంగా మారింది. పాపన్నపేట మండలం చుట్టూరా మంజీర నది సుమారు 34 కిలో మీటర్ల మేర ప్రవహిస్తోంది. ప్రతి పల్లెకు మంజీర రక్షిత మంచినీటిని అందించాలని మండలంలో ఇప్పటికే కొత్తపల్లి, పొడిచన్పల్లి, కొడుపాక తాగునీటి పథకాలను ఏర్పాటు చేశారు. మిగిలిపోయిన మరో 14 గ్రామాలకు తాగునీరు నీరందించాలన్న ఉద్దేశంతో.. జాతీయ గ్రామీణ తాగునీటి పథకం కింద 2013లో చీకోడ్ తాగు నీటి పథకం మంజూరైంది. ఇందుకు రూ. 4.60 కోట్లు విడుదలయ్యాయి. ఈ పథకం కింద చీకోడ్, కొత్తలింగాయపల్లి, అమ్రియా తండా, మల్లంపేట, రామతీర్థం, ముద్దాపూర్, కొత్తపల్లి(మధిర), మొదల్లకుంట తండాలోని సుమారు 6,176 జనాభాకు ర క్షిత మంజీర నీటిని అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. వీటితో పాటు అవసరమైతే మరో 6 గ్రామాలకు తాగునీరందించాలని నిర్ణయించారు. ఇందుకు కుర్తివాడ వద్ద మంజీర నదిలో ఇన్‌టేక్‌వెల్ నిర్మించి, సమీపంలోని మిన్పూర్ గుట్టపై ఓవర్ హెడ్ రిజర్వాయర్ ఏర్పాటు చేసి, పైపులెన్ల ద్వారా తాగు నీటిని పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ పనిని యేడాదికాలంలో పూర్తి చేయాలని నిర్ణయించారు. కాని ఆరు నెలల గడిచినా పనులు ఊపందుకోలేదు. ఇప్పటివరకు నదిలో ఇన్‌టేక్‌వెల్‌కు సంబంధించి పనులు ప్రారంభించలేదు. కేవలం మిన్పూర్ గుట్టపై ఓవర్‌హెడ్ రిజర్వాయర్ కోసం వారం రోజుల క్రితం మొక్కుబడిగా పనులు ప్రారంభించారు. కుర్తివాడ సమీపంలో కొన్ని పైపులు ఉంచారు. పనులు సకాలంలో ప్రారంభించకపోవడంతో తాగునీటికి అనేక అవస్థలు పడుతున్నామని చీకోడ్,లింగాయపల్లి,అమ్రియా తండా, మధిర కొత్తపల్లి, మొదల్లకుంట తండావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టుగా తమ పరిస్థితి ఉందని వాపోయారు. -
వెంపలో భారీ మంచినీటి ప్రాజెక్టు
వెంప (భీమవరం రూరల్), న్యూస్‌లైన్: భీమవరం మండలం వెంప గ్రామంలో భారీ మంచినీటి ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో 7 గ్రామాల ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తీరనున్నాయి. జాతీయ గ్రామీణ మంచినీటి పథకం కింద ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 12 కోట్ల నిధులు విడుదలయ్యాయి. దీంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులకు శ్రీకారం చుట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాజెక్టు కోసం వెంప సమీపంలోని శ్రీరామపురం గ్రామంలో రైతుల వద్ద నుంచి 18 ఎకరాల భూసేకరణ చేశారు. భూమిలో మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షల నిమిత్తం పంపించారు. మొదటి విడతగా ఎనిమిది కోట్లు, రెండో విడతగా నాలుగు కోట్లు నిధులు మంజూరు కానున్నాయి. ఈ నిధులతో మంచినీటి చెరువును తవ్వి దగ్గరలోని పంట కాలువ నుంచి నీటితో చెరువును నింపుతారు. అక్కడ శుద్ధి చేసి పంపింగ్ ద్వారా ఆయా గ్రామాలకు సరఫరా చేస్తారు. తీరనున్న తాగునీటి కష్టాలు వెంపలో భారీ మంచినీటి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే మండలంలోని వెంప, శ్రీరామపురం, పెదగరువు, తుందుర్రు, జొన్నలగరువు, బేతపూడి, తాడేరు గ్రామాల్లోని సుమారు 20 వేల జనాభాకు తాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఇప్పటివరకు ఆయా గ్రామాల్లో వేసవి కాలంలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మంచినీటి ప్రాజెక్టు పూర్తయితే ఆయా గ్రామాల ప్రజలకు తాగునీటి దాహర్తి తీరనుంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం వెంప, శ్రీరామపురం, పెదగరువు గ్రామ పంచాయతీల పాలకవర్గాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. త్వరలో పనులు చేపడతాం: ఆర్డబ్ల్యూఎస్ డీఈ గిరి వెంప మంచినీటి ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని భీమవరం ఆర్డబ్ల్యూఎస్ డీఈ జి.వెంకటగిరి తెలిపారు. రూ.12 కోట్లతో ఈ పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ముందుగా రైతుల వద్ద సేకరించిన భూమిలో భూసార పరీక్షలకు మట్టి నమూనాలను పంపడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తిచేసి 7 గ్రామాల ప్రజల తాగునీటి కష్టాలను తీర్చుతామన్నారు.