వెంప (భీమవరం రూరల్), న్యూస్‌లైన్: భీమవరం మండలం వెంప గ్రామంలో భారీ మంచినీటి ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో 7 గ్రామాల ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తీరనున్నాయి. జాతీయ గ్రామీణ మంచినీటి పథకం కింద ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 12 కోట్ల నిధులు విడుదలయ్యాయి. దీంతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులకు శ్రీకారం చుట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాజెక్టు కోసం వెంప సమీపంలోని శ్రీరామపురం గ్రామంలో రైతుల వద్ద నుంచి 18 ఎకరాల భూసేకరణ చేశారు. భూమిలో మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షల నిమిత్తం పంపించారు. మొదటి విడతగా ఎనిమిది కోట్లు, రెండో విడతగా నాలుగు కోట్లు నిధులు మంజూరు కానున్నాయి. ఈ నిధులతో మంచినీటి చెరువును తవ్వి దగ్గరలోని పంట కాలువ నుంచి నీటితో చెరువును నింపుతారు. అక్కడ శుద్ధి చేసి పంపింగ్ ద్వారా ఆయా గ్రామాలకు సరఫరా చేస్తారు.
తీరనున్న తాగునీటి కష్టాలు
వెంపలో భారీ మంచినీటి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే మండలంలోని వెంప, శ్రీరామపురం, పెదగరువు, తుందుర్రు, జొన్నలగరువు, బేతపూడి, తాడేరు గ్రామాల్లోని సుమారు 20 వేల జనాభాకు తాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఇప్పటివరకు ఆయా గ్రామాల్లో వేసవి కాలంలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మంచినీటి ప్రాజెక్టు పూర్తయితే ఆయా గ్రామాల ప్రజలకు తాగునీటి దాహర్తి తీరనుంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం వెంప, శ్రీరామపురం, పెదగరువు గ్రామ పంచాయతీల పాలకవర్గాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
త్వరలో పనులు చేపడతాం: ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ గిరి
వెంప మంచినీటి ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని భీమవరం ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ జి.వెంకటగిరి తెలిపారు. రూ.12 కోట్లతో ఈ పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ముందుగా రైతుల వద్ద సేకరించిన భూమిలో భూసార పరీక్షలకు మట్టి నమూనాలను పంపడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తిచేసి 7 గ్రామాల ప్రజల తాగునీటి కష్టాలను తీర్చుతామన్నారు.
వెంపలో భారీ మంచినీటి ప్రాజెక్టు
Published Tue, Dec 24 2013 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM
Advertisement