రహదారి భద్రతపై జాతీయ శిక్షణ శిబిరం
19, 20 తేదీల్లో నిర్వహణకు సన్నాహాలు
హాజరుకానున్న విదేశీ ప్రతినిధులు
మర్రిపాలెం : విశాఖ నగరంలో రహదారి భద్రత జాతీయ శిక్షణ శిబిరం నిర్వహణకు సన్నాహాలు ఊపందుకున్నాయి. ఈ నెల 19, 20 తేదీల్లో హోటల్ నోవాటెల్ జరగబోయే ఈ శిబిరంలో విదేశీ ప్రతినిధులు పాల్గొనుండడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే రవాణా శాఖాధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ శిబిరం విజయవంతం కావడానికి ఆ శాఖ కమిషనర్ ఎన్.సుబ్రహ్మణ్యం రంగంలోకి దిగారు. సంబంధిత అధికారులకు ఆయా బాధ్యతలు అప్పగించారు.
‘రహదారి భద్రత’ అంశాలపై తీర్మానాలు?
ఇటీవల పార్లమెంట్లో ‘రహదారి భద్రత’ బిల్లు ఆమోదం పొందడం తెలిసిందే. ఈ క్రమంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడంతో అందరి చూపు విశాఖపై పడింది. శిబిరంలో ‘రహదారి భద్రత’పై పలు అంశాలు తీర్మానించే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా అమలు చేయబోయే పాలనా సంస్కరణలు, మోటార్ వాహనాల చట్టంలో మార్పుల గురించి చర్చించనున్నారు. ఈ శిబిరంలో ముఖ్య అతిథులుగా కేంద్ర రవాణా, హైవే, షిప్పింగ్ శాఖల మంత్రి నితిన్ గడ్కారీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు చీఫ్ సెక్రటరీ ఎస్.పి.టక్కర్ హాజరు కానున్నారు. ప్రపంచ బ్యాంక్ నిపుణులు, గ్లోబల్ లీడ్ రోడ్ సేఫ్టీ, గ్లోబల్ రోడ్ సేఫ్టీ ప్రతినిధులు, సౌత్ ఆసియా ట్రాన్స్పోర్ట్ ప్రతినిధులు, న్యూజిలాండ్ పోలీస్ విభాగం అధికారులు, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఇండియా, హైవేల ఉన్నతాధికారులు, సుప్రీంకోర్టు నియమించిన రోడ్ సేఫ్టీ ప్రతినిధులు ఈ శిబిరంలో పాల్గొంటారు. ఇంకా మేఘాలయ, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రవాణా, పోలీస్ శాఖల ఉన్నతాధికారులు విచ్చేయనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ జాతీయ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సన్నాహాలు చేపడుతున్నామని డీటీసీ ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. ‘రహదారి భద్రత’పై దృష్టిసారించడంతో ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని స్పష్టం చేశారు.