National War Memorial Center
-
రక్షణ శాఖ కార్యదర్శిగా రాజేశ్ కుమార్ సింగ్
సాక్షి, న్యూఢిల్లీ: రక్షణ కార్యదర్శిగా నియమితులైన రాజేశ్ కుమార్ సింగ్ ఢిల్లీ సౌత్ బ్లాకులో శుక్రవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. కేరళ కేడర్ 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన ఆర్కే సింగ్ ఈ ఏడాది ఆగస్టు 20న రక్షణశాఖలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (రక్షణ కార్యదర్శి పదవిలో)గా బాధ్యతలు చేపట్టారు. కాగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించే కంటే ముందు ఆర్కే సింగ్ నేషనల్ వార్ మెమోరియల్‌కు వెళ్లి, అమరులైన జవానులకు నివాళులు సమర్పించారు. ‘మాతృభూమికి సేవ చేయడంలో అత్యున్నత త్యాగానికి వెనుదీయని మన శూర జవానులకు ఈ దేశ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు. అమర జవానుల అసాధారణ ధైర్య సాహసాలు, వారి త్యాగాలు భారత్‌ను ఒక సురక్షిత, సమృద్ధ దేశంగా తీర్చిదిద్దడానికి మనకందరికీ శక్తిని, ప్రేరణను అందిస్తూనే ఉంటాయి’అని రాజేశ్ కుమార్ సింగ్ అన్నారు. అంతకు ముందు, ఆయన 2023 ఏప్రిల్ 24 నుంచి 2024 ఆగస్టు 20 మధ్య కాలంలో వాణిజ్య, పరిశ్రమ శాఖలోని అంతర్గత వాణిజ్యం–పరిశ్రమల ప్రోత్సాహక విభాగం కార్యదర్శిగా సేవలు అందించారు. కాగా రక్షణ కార్యదర్శిగా గురువారం పదవీ విరమణ చేసిన ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి గిరిధర్ అరమానే స్థానంలో ఆ పదవిని ఆర్కే సింగ్ చేపట్టారు. -
నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించిన ఏపీ గవర్నర్
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నేషనల్ వార్ మెమోరియల్‌ను గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా అమరవీరులకు ఆయన నివాళులర్పించారు. సోమవారం.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో గవర్నర్ భేటీ కానున్నారు. మంగళవారం విజయవాడ రాజ్‌భవన్‌కు గవర్నర్ చేరుకోనున్నారు. కాగా, గవర్నర్ బిశ్వభూషణ్.. శనివారం ఢిల్లీలో ప్రధాని మోదీతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. చదవండి👉: మనసు ‘దోశ’కున్న మంత్రి వేణు -
కెనడా పార్లమెంటుపై ఉగ్ర దాడి?
గన్‌తో భవనంలోకి దూసుకెళ్లిన దుండగుడు ఐఎస్, అల్‌కాయిదా పాత్రపై అధికారుల అనుమానం టొరంటో: కెనడా పార్లమెంట్ భవనం బుధవారం కాల్పుల శబ్దాలతో దద్దరిల్లింది. కెనడా రాజధాని ఒట్టావాలో ఉన్న పార్లమెంట్ భవనంలోకి గన్‌తో దూసుకెళ్లి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన ఒక దుండగుడిని అక్కడి భద్రతాబలగాలు కాల్చి చంపాయి. అంతకుముందు ఆ దుండగుడు పార్లమెంట్ భవనానికి అతి సమీపంలో ఉన్న ‘జాతీయ యుద్ధ స్మారక కేంద్రం’ వద్ద విధుల్లో ఉన్న ఒక సైనికుడిపై కాల్పులు జరిపడంతో.. ఆ సైనికుడు చనిపోయాడు. అనంతరం ఆ దుండగుడు పార్లమెంటు భవనంలోకి పరిగెత్తడంతో అక్కడ భద్రత బలగాలు, ఆ వ్యక్తికి మధ్య పెద్ద ఎత్తున కాల్పులు చోటు చేసుకున్నాయి. పార్లమెంట్ లోపల కూడా కాల్పులు జరిగినట్లు ప్రత్యక్షసాక్షులైన పలువురు ఎంపీలు తెలిపారు. యుద్ధ స్మారక కేంద్రం, పార్లమెంట్ భవనంలోపల ఉన్న సెంటర్ బ్లాక్, రిడొ సెంటర్.. ఈ మూడుచోట్ల కాల్పులు జరిగాయని, ఒకరి కన్నా ఎక్కువమందే ఈ దుశ్చర్యలో పాలుపంచుకుని ఉండొచ్చని పోలీసు వర్గాలు తెలిపాయని కెనడియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ వెల్లడించింది. ఈ ఘటనలో క్షతగాత్రులు కూడా ఒకరి కన్నా ఎక్కువగానే ఉండొచ్చని పేర్కొంది. అనుమానితుల కోసం పార్లమెంటు ప్రాంగణాన్ని భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయని తెలిపింది. ప్రధాని స్టీఫెన్ హార్పర్ సహా ముఖ్యమైన నేతలంతా క్షేమమేనని అధికార వర్గాలు తెలిపాయి. ఇస్లామిక్ స్టేట్ లేదా అల్‌కాయిదా ఉగ్రవాద సంస్థ హస్తం ఇందులో ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కాల్పుల నేపథ్యంలో అక్కడి అమెరికా ఎంబసీ సహా పలు విదేశీ, స్వదేశీ కార్యాలయాలను మూసేశారు. కెనడా పార్లమెంట్‌పై దాడిని భారత ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు.