కెనడా పార్లమెంటుపై ఉగ్ర దాడి?
గన్‌తో భవనంలోకి దూసుకెళ్లిన దుండగుడు
ఐఎస్, అల్‌కాయిదా పాత్రపై అధికారుల అనుమానం
టొరంటో: కెనడా పార్లమెంట్ భవనం బుధవారం కాల్పుల శబ్దాలతో దద్దరిల్లింది. కెనడా రాజధాని ఒట్టావాలో ఉన్న పార్లమెంట్ భవనంలోకి గన్‌తో దూసుకెళ్లి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన ఒక దుండగుడిని అక్కడి భద్రతాబలగాలు కాల్చి చంపాయి. అంతకుముందు ఆ దుండగుడు పార్లమెంట్ భవనానికి అతి సమీపంలో ఉన్న ‘జాతీయ యుద్ధ స్మారక కేంద్రం’ వద్ద విధుల్లో ఉన్న ఒక సైనికుడిపై కాల్పులు జరిపడంతో.. ఆ సైనికుడు చనిపోయాడు. అనంతరం ఆ దుండగుడు పార్లమెంటు భవనంలోకి పరిగెత్తడంతో అక్కడ భద్రత బలగాలు, ఆ వ్యక్తికి మధ్య పెద్ద ఎత్తున కాల్పులు చోటు చేసుకున్నాయి. పార్లమెంట్ లోపల కూడా కాల్పులు జరిగినట్లు ప్రత్యక్షసాక్షులైన పలువురు ఎంపీలు తెలిపారు. యుద్ధ స్మారక కేంద్రం, పార్లమెంట్ భవనంలోపల ఉన్న సెంటర్ బ్లాక్, రిడొ సెంటర్.. ఈ మూడుచోట్ల కాల్పులు జరిగాయని, ఒకరి కన్నా ఎక్కువమందే ఈ దుశ్చర్యలో పాలుపంచుకుని ఉండొచ్చని పోలీసు వర్గాలు తెలిపాయని కెనడియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ వెల్లడించింది. ఈ ఘటనలో క్షతగాత్రులు కూడా ఒకరి కన్నా ఎక్కువగానే ఉండొచ్చని పేర్కొంది. అనుమానితుల కోసం పార్లమెంటు ప్రాంగణాన్ని భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయని తెలిపింది.
ప్రధాని స్టీఫెన్ హార్పర్ సహా ముఖ్యమైన నేతలంతా క్షేమమేనని అధికార వర్గాలు తెలిపాయి. ఇస్లామిక్ స్టేట్ లేదా అల్‌కాయిదా ఉగ్రవాద సంస్థ హస్తం ఇందులో ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కాల్పుల నేపథ్యంలో అక్కడి అమెరికా ఎంబసీ సహా పలు విదేశీ, స్వదేశీ కార్యాలయాలను మూసేశారు. కెనడా పార్లమెంట్‌పై దాడిని భారత ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు.