నేషనల్ వార్ మెమోరియల్‌లో నివాళులు అర్పించి బాధ్యతలు స్వీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: రక్షణ కార్యదర్శిగా నియమితులైన రాజేశ్ కుమార్ సింగ్ ఢిల్లీ సౌత్ బ్లాకులో శుక్రవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. కేరళ కేడర్ 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన ఆర్‌కే సింగ్ ఈ ఏడాది ఆగస్టు 20న రక్షణశాఖలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (రక్షణ కార్యదర్శి పదవిలో)గా బాధ్యతలు చేపట్టారు. కాగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించే కంటే ముందు ఆర్‌కే సింగ్ నేషనల్ వార్ మెమోరియల్‌కు వెళ్లి, అమరులైన జవానులకు నివాళులు సమర్పించారు.
‘మాతృభూమికి సేవ చేయడంలో అత్యున్నత త్యాగానికి వెనుదీయని మన శూర జవానులకు ఈ దేశ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు. అమర జవానుల అసాధారణ ధైర్య సాహసాలు, వారి త్యాగాలు భారత్‌ను ఒక సురక్షిత, సమృద్ధ దేశంగా తీర్చిదిద్దడానికి మనకందరికీ శక్తిని, ప్రేరణను అందిస్తూనే ఉంటాయి’అని రాజేశ్ కుమార్ సింగ్ అన్నారు. అంతకు ముందు, ఆయన 2023 ఏప్రిల్ 24 నుంచి 2024 ఆగస్టు 20 మధ్య కాలంలో వాణిజ్య, పరిశ్రమ శాఖలోని అంతర్గత వాణిజ్యం–పరిశ్రమల ప్రోత్సాహక విభాగం కార్యదర్శిగా సేవలు అందించారు. కాగా రక్షణ కార్యదర్శిగా గురువారం పదవీ విరమణ చేసిన ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి గిరిధర్ అరమానే స్థానంలో ఆ పదవిని ఆర్‌కే సింగ్ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment