పాక్ ఉగ్రవాది నవేద్‌కు ‘లై’ టెస్ట్
న్యూఢిల్లీ: పొంతనలేని సమాధానాలు చెబు తున్న పాకిస్తాన్ ఉగ్రవాది నవేద్ యాకూబ్‌కు మంగళవారం సత్య శోధన(లై డిటెక్టర్ టెస్ట్) పరీక్ష నిర్వహించారు. గట్టి భద్రత మధ్య నవేద్‌ను ఢిల్లీలోని సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి తీసుకువచ్చి, కాసేపు ఏకాంతంగా ఉంచారు. తర్వాత పరీక్ష జరిపారు. ఎన్ఐఏ, ఐబీ తదితర దర్యాప్తు, నిఘా సంస్థల ఉన్నతాధికారుల సమక్షంలో పరీక్ష జరిగింది.
‘భారత్‌లోకి ఎవరెవరు, ఏయే మార్గాల్లో వచ్చారు? భారత్‌లో ఎక్కడెక్కడ తలదాచుకున్నారు? మీకు ఇక్కడ సహకరించినవారెవరు?’ వంటి ప్రశ్నలను అధికారులు అడిగినట్లు సమాచారం. కాగా, నవేద్‌తో పాటు జమ్ముకశ్మీర్‌లోని గుల్మర్గ్ సెక్టార్లో భారత్‌లోకి చొరబడిన ఇద్దరు జర్గా అలియాస్ మొహమ్మద్ భాయి(40), అబూ ఒకాశ(18)ల ఊహాచిత్రాలను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విడుదల చేసింది. వారి వివరాలు తెలిపిన వారికి రూ. 5 లక్షల నగదు బహుమతిగా ఇస్తామని ప్రకటించింది.