Naxal violence
-
మావోయిస్టు ఉద్యమం.. ఆసక్తికర సమాచారం
న్యూఢిల్లీ : దేశంలో వామపక్ష తీవ్రవాదానికి సంబంధించి ఇటీవల వెల్లడైన సమాచారం చర్చనీయాంశమైంది. మావోయిస్టు ఉద్యమకారులకు గట్టి పట్టున్న ‘రెడ్ కారిడార్’ క్రమంగా కుచించుకుపోతున్నదని, ఒకప్పుడు 100కుపైగా జిల్లాలను ప్రభావితం చేసిన ఉద్యమం.. నేడు 58 జిల్లాలకు మాత్రమే పరిమితమైందని సీఆర్పీఎఫ్ ధృవీకరించిన నివేదికలో తేలింది. డ్రోన్ల వంటి ఆధునిక పరికరాలు, రియల్‌టైమ్ ఇంటెలిజెన్స్‌తో చేపట్టే ప్రతివ్యూహాలు, పగలూ, రాత్రి తేడాలేకుండా సాగించిన ఆపరేషన్లు, ఇన్ఫార్మర్ వ్యవస్థను బలోపేతం చేసుకుంటూ టాప్ లీడర్లను టార్గెట్ చేయడం.. తదితర వ్యూహాలతో బలగాలు సమిష్టిగా పనిచేస్తున్నందునే తీవ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికలోని అంశాలపై సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రాయ్ భట్నాగర్ మీడియాతో మాట్లాడారు. డౌన్ ఫాల్.. : ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, బిహార్‌లలోని అతికొద్ది జిల్లాల్లో మాత్రమే మావోయిస్టుల ప్రభావం ఉందని, హింసకు సంబంధించి నమోదయ్యే కేసుల్లో 90 శాతం ఆ రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని రిపోర్టులో తెలిపారు. 2015నాటికి 75 జిల్లాల్లో బలంగా ఉండిన మావోయిస్టులు.. 2016 వచ్చేసరికి 67 జిల్లాలకు కుచించుకుపోగా, 2017 చివరినాటికి ఆ సంఖ్య 58 జిల్లాలకు పడిపోయింది. ఉద్యమాన్ని అణిచివేయడంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైన నేపథ్యంలో దశాబ్ధాల కిందటే కేంద్ర బలగాలు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. నక్సల్స్ ఏరివేత ఆపరేషన్లలో ప్రస్తుతం సీఆర్పీఎఫ్, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ బలగాలు పాలుపంచుకుంటున్నాయని, ఆయా శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నాయని, అదే సమయంలో ప్రభుత్వాలు.. రోడ్ల నిర్మాణం, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, మారుమూల ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ల ఏర్పాటు తదితర పనులను శరవేగంగా చేపడుతున్నాయిన, అందుకే తీవ్రవాదం క్రమక్రమంగా బలహీనపడుతున్నదని సీఆర్పీఎఫ్ డీజీ భట్నాగర్ చెప్పుకొచ్చారు. ఆ మూడు ప్రాంతాలు.. : మావోయిస్టు ఉద్యమాన్ని పారదోలే క్రమంలో కేంద్ర బలగాలకు తోడు రాష్ట్రాల పోలీసులు కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయని, బయటి నుంచి ఆయుధాలు చేరకుండా అడ్డుకోగలుగుతున్నామని, నిధుల ప్రవాహం కూడా దాదాపు క్షీణించిందని రిపోర్టులో వెల్లడైంది. ‘‘తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్లకు సంబంధించి 2017లో మేం చాలా సాధించగలిగాం. నక్సల్స్ స్థావరాల్లోకి చొచ్చుకుపోగలిగాం. ప్రస్తుతం మా దృష్టంగా మావోయిస్టు అగ్రనాయకత్వంపైనే ఉంది. 1200 చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న బస్తర్-సుక్మా రీజియన్, 2000చ.కి.మీల ఆంధ్ర-ఒడిశా బోర్డర్(ఏవోబీ), దాదాపు 4500 చ.కి.మీల అబూజ్మడ్ అడవులు.. ఈ మూడు ప్రాంతాల్లో మాత్రమే మావోయిస్టులు మనగలుగుతున్నారని, భద్రతాపరమైన సమస్యల కారణంగా ప్రభుత్వ సిబ్బంది అక్కడికి వెళ్లలేకపోతున్నారు’’ అని భట్నాగర్ తెలిపారు. యాక్షన్ ప్లాన్ 2017-2022? : గత ఏడాది కేంద్ర బలగాలు నిర్వహించిన ఆపరేషన్లలో సుమారు 150 మంది మావోయిస్టులు మరణించారు. వారిలో 30 మంది మహిళలు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టుల వ్యూహాలకు సంబంధించి ‘2017-2022 యాక్షన్ ప్లాన్’ పేరుతోఉన్న కీలక పత్రాలు లభ్యమైనట్లు తెలిసింది. -
వంశపాలనకు స్వస్తి చెప్పండి
జార్ఖండ్ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు దాల్తన్‌గంజ్/చందువా(జార్ఖండ్): జార్ఖండ్ అభివృద్ధి బాట పట్టాలంటే రాష్ట్రాన్ని వంశపారంపర్య పాలన, అవినీతి నుంచి విముక్తం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి ప్రజలకు పిలుపునిచ్చారు. నక్సల్స్ హింసను వీడి దేశ నిర్మాణంలో భాగం కావాలని కోరారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోదీ శుక్రవారం తొలిసారి పాల్గొని దాల్తన్‌గంజ్, చందువాల్లో జరిగిన సభలో ప్రసంగించారు. ‘రాష్ట్రాన్ని వంశపాలన నుంచి విముక్తం చేయకపోతే వాళ్ల కుటుంబాలు మరింత మరింత సంపాదించుకుంటాయి, ప్రజలకు ఎలాంటి మేలూ జరగదు. రాష్ట్రం పురోగతి సాధించి, యువతకు ఉద్యోగాలు దొరకాలంటే తండ్రీ-కొడుకు, తమ్ముడువంటి రాజకీయాలకు స్వస్తి పలకాలి’ అని అన్నారు. జేఎంఎం చీఫ్ శిబూ సొరేన్, ఆయన కుమారుడు, సీఎం హేమంత్ సొరేన్‌లను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్‌లో అవినీతి పేరుకుపోయిందని రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బీజేపీకి ఓటేసి రాష్ట్రానికి సేవచేసే అవకాశమివ్వాలని కోరారు. ఇటీవల తన ఆస్ట్రేలియా పర్యటనను ప్రస్తావిస్తూ.. ‘జార్ఖండ్‌కు, ఆస్ట్రేలియాకు సహజవనరులు, జనాభా వంటి అంశాల్లో ఎన్నో పోలికలు ఉన్నాయి. ఆ దేశం అభివృద్ధి చెందగా, రాష్ట్రం మాత్రం పేదగానే మిగిలింది’ అని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని ఓ యూనివర్సిటీకి వెళ్లినప్పుడు భారత రైతుల పంటల దిగుబడి పెంపుపై చర్చించానని తెలిపారు. కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వస్తే తమ అక్రమాలు బయటపడతాయనే జేఎంఎం ప్రభుత్వం వారిని రాష్ట్రానికి రానివ్వబోమని చెప్పిందని మోదీ మండిపడ్డారు. ‘నాకు ముందు చాలామంది ప్రధానులు ఇక్కడికొచ్చి పెద్దపెద్ద హామీలు ఇచ్చారు. నేను పెద్దపెద్ద కబుర్లు చెప్పే ప్రధాని కాను. తల్లులు, అక్కచెల్లెళ్ల కోసం మరుగుదొడ్ల నిర్మాణం వంటి చిన్న అంశాలపై మాట్లాడతా’ అని అన్నారు. గాంధీ జన్మించిన దేశంలో హింసకు తావులేదు. హింస ఎవరికీ మంచిది కాదు. తుపాకులు పట్టుకున్న వాళ్లు వాటిని వదిలేసి నాగళ్లు పట్టుకోవాలని కోరుతున్నానని అన్నారు. కాగా, ప్రపంచ శాంతి, సమైక్యతలను దెబ్బతీయగల శక్తి నల్లధనానికి ఉందని, ప్రజాస్వామ్య దేశాలన్నీ ఏకమై ఆ శత్రువుపై పోరాడాల్సిన అవసరముందని ప్రధాని నరేంద్ర మోదీ తన బ్లాగులో పేర్కొన్నారు. -
20 ఏళ్లలో 12 వేల మందిని చంపిన నక్సల్స్
న్యూఢిల్లీ: గత 20 ఏళ్ల కాలంలో మావోయిస్టులు దేశవ్యాప్తంగా 12 వేలకు మందికి పైగా చంపారని కేంద్ర హోం శాఖ వర్గాలు తెలిపాయి. హతుల్లో భద్రత సిబ్బంది సహా సాధారణ పౌరులు, రాజకీయ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. వీరిలో 9471 మంది పౌరులు, 2712 మంది కేంద్ర, రాష్ట్ర భద్రత సిబ్బంది ఉన్నారు. సమాచార హక్కు చట్టం కింద ఓ కార్యకర్త దరఖాస్తు మేరకు కేంద్ర హోం శాఖ ఈ వివరాలను వెల్లడించింది. తొమ్మిది రాష్ట్రాల్లో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందని పేర్కొంది. బాధిత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, బీహార్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేవ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. నక్సల్స్ 2010లో అత్యధికంగా 1005 మందిని చంపారు.