వంశపాలనకు స్వస్తి చెప్పండి
- జార్ఖండ్ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
దాల్తన్‌గంజ్/చందువా(జార్ఖండ్): జార్ఖండ్ అభివృద్ధి బాట పట్టాలంటే రాష్ట్రాన్ని వంశపారంపర్య పాలన, అవినీతి నుంచి విముక్తం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి ప్రజలకు పిలుపునిచ్చారు. నక్సల్స్ హింసను వీడి దేశ నిర్మాణంలో భాగం కావాలని కోరారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోదీ శుక్రవారం తొలిసారి పాల్గొని దాల్తన్‌గంజ్, చందువాల్లో జరిగిన సభలో ప్రసంగించారు.
‘రాష్ట్రాన్ని వంశపాలన నుంచి విముక్తం చేయకపోతే వాళ్ల కుటుంబాలు మరింత మరింత సంపాదించుకుంటాయి, ప్రజలకు ఎలాంటి మేలూ జరగదు. రాష్ట్రం పురోగతి సాధించి, యువతకు ఉద్యోగాలు దొరకాలంటే తండ్రీ-కొడుకు, తమ్ముడువంటి రాజకీయాలకు స్వస్తి పలకాలి’ అని అన్నారు. జేఎంఎం చీఫ్ శిబూ సొరేన్, ఆయన కుమారుడు, సీఎం హేమంత్ సొరేన్‌లను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్‌లో అవినీతి పేరుకుపోయిందని రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
బీజేపీకి ఓటేసి రాష్ట్రానికి సేవచేసే అవకాశమివ్వాలని కోరారు. ఇటీవల తన ఆస్ట్రేలియా పర్యటనను ప్రస్తావిస్తూ.. ‘జార్ఖండ్‌కు, ఆస్ట్రేలియాకు సహజవనరులు, జనాభా వంటి అంశాల్లో ఎన్నో పోలికలు ఉన్నాయి. ఆ దేశం అభివృద్ధి చెందగా, రాష్ట్రం మాత్రం పేదగానే మిగిలింది’ అని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని ఓ యూనివర్సిటీకి వెళ్లినప్పుడు భారత రైతుల పంటల దిగుబడి పెంపుపై చర్చించానని తెలిపారు.
కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వస్తే తమ అక్రమాలు బయటపడతాయనే జేఎంఎం ప్రభుత్వం వారిని రాష్ట్రానికి రానివ్వబోమని చెప్పిందని మోదీ మండిపడ్డారు. ‘నాకు ముందు చాలామంది ప్రధానులు ఇక్కడికొచ్చి పెద్దపెద్ద హామీలు ఇచ్చారు. నేను పెద్దపెద్ద కబుర్లు చెప్పే ప్రధాని కాను. తల్లులు, అక్కచెల్లెళ్ల కోసం మరుగుదొడ్ల నిర్మాణం వంటి చిన్న అంశాలపై మాట్లాడతా’ అని అన్నారు.
గాంధీ జన్మించిన దేశంలో హింసకు తావులేదు. హింస ఎవరికీ మంచిది కాదు. తుపాకులు పట్టుకున్న వాళ్లు వాటిని వదిలేసి నాగళ్లు పట్టుకోవాలని కోరుతున్నానని అన్నారు. కాగా, ప్రపంచ శాంతి, సమైక్యతలను దెబ్బతీయగల శక్తి నల్లధనానికి ఉందని, ప్రజాస్వామ్య దేశాలన్నీ ఏకమై ఆ శత్రువుపై పోరాడాల్సిన అవసరముందని ప్రధాని నరేంద్ర మోదీ తన బ్లాగులో పేర్కొన్నారు.