రైళ్లలో చోరీలు.. కి‘లేడీ’ అరెస్ట్
సికింద్రాబాద్: రైళ్లలో మహిళా ప్రయాణికుల నగలు ఎత్తుకెళ్తున్న ఓ కి‘లేడీ’ని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్కు తరలించారు. నిందితురాలి నుంచి రూ.1.65 లక్షల విలుల చేసే బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ అర్బన్ రైల్వే డీఎస్పీ పీవీ.మురళీధర్, ఇన్స్పెక్టర్ అంబటి ఆంజనేయులు కథనం ప్రకారం...గుంటూరు జిల్లా కొత్తపేట నాజ్సెంటర్కు చెందిన రమాదేవి అలియాస్ నాయుడమ్మ (40) ఉపాధి కోసం నగరానికి వచ్చింది.
సరైన పని దొరక్కపోవడంతో రైల్వేస్టేషన్లు, రైళ్లలో చోరీలకు పాల్పడుతోంది. స్టేషన్ల ఆవరణలోను, రైళ్లలోనూ ప్రయాణికురాలిగా తిరుగుతూ ప్రయాణికుల నగలు కాజేస్తోంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కారు పార్కింగ్ ప్రదేశంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న రమాదేవిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా రైళ్లలో చోరీ చేస్తున్నట్టు ఒప్పుకుంది. నిందితురాలి నుంచి 16.5 తులాల బంగారు నగలు రికవరీ చేశారు. అనంతరం ఆమెను రిమాండ్కు తరలించారు.