చేతులెత్తేస్తున్నారు..!
నవ్యాంధ్ర రాజధాని నగరంలోని టీచింగ్ ఇనిస్టిట్యూట్‌కు అనుబంధంగా ఉన్న పెద్దాస్పత్రి.. వెయ్యికి పైగా పడకలు.. స్పెషాలిటీ.. çసూపర్ స్పెషాలిటీ విభాగాల్లో 200 మందికిపైగా నిపుణులైన వైద్యులు.. మరో 200 మందికి పైగా పోస్టు గ్రాడ్యుయేట్లు.. సీనియర్ రెసిడెంట్లు నిత్యం అందుబాటులో ఉంటారు. కానీ ఫుడ్ పాయిజనింగ్ లాంటి సింపుల్ కేసులకు కూడా వైద్యం చేయలేక కార్పొరేట్ ఆస్పత్రులకు తరలించేయడం ఇక్కడి డొల్లతనాన్ని వేలెత్తి చూపుతోంది.
లబ్బీపేట (విజయవాడ తూర్పు) : విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వస్తే మెరుగైన వైద్యం అందుతుందనే భావనతో మచిలీపట్నం, ఏలూరులోని జిల్లా ఆస్పత్రులతో పాటు, ఏరియా ఆస్పత్రుల నుంచి నిత్యం పదుల సంఖ్యలో రిఫరల్ రోగులు వస్తుంటారు. కానీ ఇక్కడకు నేరుగా వచ్చిన ఫుడ్ పాయిజనింగ్ కేసులను మాత్రం ప్రయివేటు ఆస్పత్రులకు తరలించడంలో ఆంతర్యం ఏమిటనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నిపుణులైన వైద్యులు ఉన్నా..
ప్రభుత్వ గురుకుల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలకు చెందిన 20 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజనింగ్‌కు గురై సోమవారం సాయంత్రం ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. అంత మంది ఒకేసారి రావడంతో తొలుత కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. వారికి వైద్యం చేసేందుకు జనరల్ మెడిసిన్ విభాగంలో నిపుణులైన వైద్యులు 20 మంది వరకూ అందుబాటులో ఉన్నారు. అంతేకాకుండా గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం కూడా అందుబాటులో ఉంది. కానీ గంటలోపే పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ ఆరుగురిని కార్పొరేట్ ఆస్పత్రులకు తరలించడం.. ప్రభుత్వ వైద్యంపై ఉన్నతాధికారులకు నమ్మకం లేదనే భావన వెల్లడవుతోంది. సాధారణంగా ఫుడ్ పాయిజనింగ్ కేసులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం వైద్యం చేస్తుంటారు. అలాంటిది ఒక టీచింగ్ ఇనిస్టిట్యూట్‌కు వచ్చిన వారిని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించడం ఏమిటనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ వైద్యంపైనమ్మకం లేకనా..
జిల్లా ఉన్నతాధికారులకు సైతం ప్రభుత్వాస్పత్రిల్లో వైద్యంపై నమ్మకం ఉండటం లేదు. దీంతో ఏ చిన్న ఘటన జరిగినా ఇక్కడకు వచ్చిన క్షతగాత్రులను వెంటనే ప్రయివేటు ఆస్పత్రులకు తరలించేస్తున్నారు. వారి చర్యల ద్వారా ప్రభుత్వాస్పత్రిలో లోపాలు వెలుగు చూస్తున్నాయి. రోగులకు తక్షణమే వ్యాధి నిర్థారణ పరీక్షలు చేసేం దుకు సిబ్బంది అందుబాటులో ఉండరు. ఏవైనా అత్యవసరంగా మందులు కొనుగోలు చేయడానికి కుదరదు. ఇలాంటి అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉండటం వలనే ఏదైనా ఘటనలో గాయపడిన, అనారోగ్యానికి గురైనా.. కార్పొరేట్ ఆస్పత్రులకు తరలించేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
నాసిరకం మందులు కారణమేనా..
ప్రభుత్వం సరఫరా చేసే మందులు నాణ్యమైనవి ఉండవని, వాటితో రికవరీ సత్వరమే ఉండదనే వాదన వినిపిస్తోంది. అత్యవసర సమయంలో రోగికి మందులు పని చేయకుండా పెనుముప్పు ఏర్పడుతుందనే భావనతో కార్పొరేట్ ఆస్పత్రులకు తరలించేస్తున్నట్లు ఓ సీనియర్ వైద్యుడు ‘సాక్షి’తో చెప్పారు. ప్రయివేటు ఆస్పత్రిలో అయితే నాణ్యమైన మందులు ఉంటాయనేది వారి వాదన. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రభుత్వాస్పత్రిల్లో క్వాలిటీ మందులు సరఫరా చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఉన్నతాధికారుల సందర్శన
మధురానగర్ (విజయవాడ సెంట్రల్) / లబ్బీపేట (విజయవాడ ఈస్ట్) : కాగా, సంబంధిత కళాశాలను మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ విజయకృష్ణన్, సోషల్ వెల్ఫేర్ జేడీ టీఎస్ఏ ప్రసాద్, బీసీ వెల్పేర్ అధికారి ఆర్ యుగంధర్ తదితరులు సందర్శించారు. ఆహారం ఎక్కడ నుంచి వచ్చింది, ఎలా వచ్చింది తదితర వివరాలపై ఆరా తీశారు. ఈ నేపథ్యంలో కళాశాల విద్యార్థినులకు బుధవారం నుంచి ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం, ర్రాతికి భోజనాన్ని అక్షయపాత్ర ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించారు. అలాగే, ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను సీపీఎం రాజధాని ప్రాంత కార్యదర్శి సీహెచ్ బాబూరావు, సీపీఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్, ఎస్ఎఫ్ఐ సెంట్రల్ సిటీ కార్యదర్శి సుమంత్, విష్ణువర్దన్ తదితరులు పరామర్శించారు.
డొల్లతనం బయటపడింది..
అది చేశాం.. ఇది చేశాం.. ప్రభుత్వాస్పత్రి ఓపీని పెంచాం.. అంటూ మంత్రులు నిత్యం గొప్పలు చెప్పుకోవడం కాదు, ఫుడ్ పాయిజనింగ్తో వచ్చిన వారికి కూడా వైద్యం చేయలేక కార్పొరేట్ ఆస్పత్రికి తరలించేశారు. ఈ ఘటనతో ప్రభుత్వాస్పత్రి డొల్లతనం బయటపడింది. ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు సౌకర్యాలు కల్పించాలి. కమీషన్లకు కక్కుర్తి పడి నాసిరకం మందులు కొనుగోలు చేయకుండా నాణ్యమైనవి కొనాలి. – డాక్టర్ మెహబూబ్ షేక్,జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ వైద్య విభాగం