ఇందిర అద్భుతమైన వ్యక్తి
భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ అద్భుతమైన వ్యక్తి అని ప్రముఖ ఎన్నారై పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ అభివర్ణించారు. ఆమెను చూసి భారత్ గర్వపడుతుందని తెలిపారు. అలాగే భారతీయుల గౌరవానికి ఇందిర ప్రతీక అని పేర్కొన్నారు. ఆమె వ్యక్తిత్వం ఆమోఘమని కొనియాడారు.
రాబోయే రోజుల్లో అలాంటి స్త్రీమూర్తి కనిపించకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఇందిరాగాంధీ 96వ జయంతి సందర్భంగా మంగళవారం లండన్‌లోని నెహ్రూ సెంటర్లో ఏర్పాటు చేసిన ఆమె ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఇందిర గాంధీతో తమకు గల అనుబంధాన్ని ఆయన ఈ సందర్బంగా వివరించారు.
ఆ క్రమంలో పాల్ భార్య అరుణ పాల్ మాట్లాడుతూ... ఇందిరాగాంధీ హత్య జరిగినప్పుడు తాను స్వయంగా సోనియాను కలశానని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో సోనియా తనకు అందజేసిన శాలువా నేటిని తన వద్ద భద్రంగా ఉందని అరుణ వెల్లడించారు. తన వద్ద ఉన్న అత్యంత అరుదైన వాటిలో ఆ శాలువా ఒకటని లార్డ్ స్వరాజ్ పాల్ భార్య అరుణ పాల్ వెల్లడించారు. 1971లో భారత్, పాక్ దేశాల మధ్య యుద్ద సమయంలో ఇందిరపై మేరిలిన్ స్టాఫర్డ్ తీసిన ఫోటోలతోపాటు ఇందిర, రాజీవ్,సోనియా, సంజయ్ గాంధీల ఫోటోలను ఆ ప్రదర్శనలో ఉంచారు.