నోరెత్తొద్దు..
చెప్పింది విని.. ఇచ్చింది తీసుకెళ్లండి
ప్లాట్ల పంపిణీ వద్ద అంతా మనోళ్లే ఉండాలి
నేలపాడును ఎంచుకోవడానికి కారణం ఇదే
రైతులకు టీడీపీ నేతల ఆదేశాలు!
నేడు ప్లాట్ల పంపిణీ కార్యక్రమానికి సీఎం రాక!
అమరావతి : ‘రాజధానికి భూములు ఇచ్చిన వారికి ప్లాట్లు ఇస్తున్నారు. ఎటువంటి తప్పులున్నా నోరెత్తకుండా ఉండాలి. ప్లాట్ల పంపిణీ కార్యక్రమంలో అంతా మనోళ్లే ఉండాలి. ఎటువంటి పరిస్థితిలోనూ నిలదీసేవారిని పిలవద్దు. అధికారులు చెప్పింది విని.. ఇచ్చింది తీసుకెళ్లండి. ఏదైనా ఉంటే మేం చూసుకుంటాం. మీకు ఎటువంటి నష్టం రాకుండా చేస్తాం. మీ మీద నమ్మకంతో ప్లాట్ల పంపిణీకి నేలపాడు గ్రామాన్ని ఎంపిక చేశాం...’ ఇవీ రైతులకు టీడీపీ నాయకులు ఇచ్చిన ఆదేశాలు.
రాజధాని రైతులకు ప్లాట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం సోమవారం ్ఠతుళ్లూరు మండలం నేలపాడులో ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యే అవకాశం ఉంది. ఆ మేరకు అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయని విశ్వసనీయ సమాచారం. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం చంద్రబాబు సోమవారం పర్యటించనున్నారు. ఆ కార్యక్రమాన్ని త్వరగా పూర్తిచేసుకుని నేరుగా నేలపాడుకు రావాలనే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. ప్లాట్ల పంపిణీలో రైతుల నుంచి ఎటువంటి నిరసనలూ వ్యక్తం కాకుండా ఉండేందుకు టీడీపీ నేతలు ముందస్తు చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగా నేలపాడులో ఆదివారం రహస్య సమావేశం నిర్వహించారని తెలిసింది. ఈ సమావేశానికి పార్టీ నాయకుల బంధువులు, అనుచరులను మాత్రమే పిలిచారు. ప్లాట్ల పంపిణీ కార్యక్రమంలో ఎటువంటి గొడవలూ జరక్కుండా ఉండాలనిఆదేశాలిచ్చారని సమాచారం.
నేలపాడునే ఎందుకు ఎంచుకున్నారంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాలకు చెందిన 22 వేల మంది రైతుల నుంచి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములను సమీకరించింది. భూములిచ్చిన జరీబు రైతులకు ఎకరానికి వెయ్యి గజాల నివాస ప్లాటు, 450 గజాల వాణిజ్య ప్లాటు, మెట్ట రైతులకు వెయ్యి గజాల నివాస ప్లాటు, 200 గజాల వాణిజ్య ప్లాటు ఇస్తామని ప్రకటించింది. మెట్ట రైతులకు అదనంగా 50 గజాలు ఇస్తామని ఇటీవల ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ ప్లాట్ల పంపిణీ వాయిదా వేసుకుంటూ వచ్చింది. దీంతో ప్రభుత్వం తీరుపై 29 గ్రామాల రైతుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్లాట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇదే రీతిన వాయిదా వేసుకుంటూ పోతే రైతుల నుంచి తిరుగుబాటు మొదలవుతుందని భావించిన ప్రభుత్వం.. ఈ ప్రక్రియ ప్రారంభించామని చెప్పుకునేందుకే నేటి నుంచి ప్లాట్లు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. ఇందుకు నేలపాడు గ్రామాన్ని ఎంచుకోవటం వెనుక రహస్యం దాగి ఉందని సమాచారం. గ్రామంలో అయితే రైతులను భయపెట్టి కార్యక్రమాన్ని సజావుగా ముగించవచ్చని పథకం వేసినట్లు తెలిసింది. అందులో భాగంగానే నేలపాడులో ఆదివారం టీడీపీ నేతలు రహస్యంగా సమావేశమై రైతులు కొందరికి హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ఎవ్వరూ నోరెత్తకుండా ఉండాలని గట్టిగా హెచ్చరించి వెళ్లినట్లు సమాచారం.
వర్షాలు పడుతున్నాయంటూ వాయిదా వేయొచ్చని...
నేలపాడులో సోమవారం పంపిణీ చేయనున్న ప్లాట్లు కాగితాల్లో మాత్రమే చూపిస్తారని, క్షేత్రస్థాయిలో చూపించే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. రాజధాని ప్రాంతంలో భూములను చదును చేయకపోవటమే ఇందుకు నిదర్శనం. రైతులకు ప్లాట్లు కేటాయించాలంటే భూములు చదునుచేసి లేవుట్లు వేయాలి. అయితే ఇప్పటి వరకు 10 శాతం కూడా చదునుచేసిన పాపాన పోలేదు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ప్లాట్లు కేటాయింపును మార్చి నెలకే పూర్తిచేయాల్సి ఉంది. వర్షాలు ప్రారంభమయ్యాక ప్లాట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టటం వెనుకా రహస్యం దాగి ఉంది. రైతులు అడిగితే.. వర్షాలు పడుతున్నాయి.. ఇప్పుడు భూములు చదునుచేయటం వీలుకాలేదని చెప్పి తప్పించుకోవచ్చని ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. అలా మరో మూడునెలల పాటు ప్లాట్ల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేయవచ్చనే ఆలోచనతో నేటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి.