Neolithic
-
కొత్తరాతి యుగానికి చెందిన మట్టిబొమ్మ
సాక్షి, హైదరాబాద్: కొత్త రాతి యుగానికి చెందిన అరుదైన మట్టిబొమ్మ సిద్దిపేటలో దొరికింది. నంగునూరు మండలంలోని నర్మెట్ట గ్రామ శివారు పాటిగడ్డలో కొలిపాక శ్రీనివాస్ ఈ బొమ్మను గుర్తించారు. ఆదిమానవులకు సంబంధించిన అనేక ఆధారాలను అందించిన నర్మెట్టలోనే ఇదీ దొరకటం విశేషం. క్రీ.పూ.6500 నుంచి క్రీ.పూ.1800 మధ్య కాలానికి చెందినదిగా భావిస్తున్న ఈ మట్టి బొమ్మ కొంతమేర విరిగి ఉంది. 6సెం.మీ. పొడవున్న ఈ బొమ్మకు ఎంతో ప్రాధాన్యం ఉందని అంతర్జాతీయ పురావస్తు పరిశోధకులు కర్ణాటకకు చెందిన రవి కొరిసెట్టర్ చెప్పారని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కనీ్వనర్ శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉన్న మెహర్ఘర్ ప్రాంతంలో గతంలో జరిపిన తవ్వకాల్లో దొరికిన బొమ్మలను ఇది పోలి ఉందన్నారు. నంగునూరు–నర్మెట్ట మధ్య 6కి.మీ. పరిధిలో ఆదిమానవుల మనుగడను రూఢీ చేసే ఆధారాలు విస్తారంగా వెలుగు చూస్తున్నాయని, ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. చదవండి: వచ్చేస్తున్నాయ్.. కల్యాణ ఘడియలు -
అంతుచిక్కని కట్టడం.. గుర్తు తెలియని దేవుడికి బలులు
రియాద్: సౌదీ అరేబియాలో పురావస్తుశాఖ వారు అద్భుతమైన నియోలితిక్(నవీన శిలా యుగము) క్రీ.పూ.10000-5000) కాలానికి సంబంధించిన కట్టడాలను కనుగొన్నారు. ఈ కట్టడాలు ఈజిప్టులోని పిరమిడ్స్ కంటే చాలా పురాతనమైనవని పురావస్తుశాఖ వారు అంచనా వేస్తున్నారు. వాయువ్య అరేబియాలో 7,000 సంవత్సరాల పురాతన దీర్ఘచతురస్రాకార రాతి నిర్మాణాలపై పురావస్తు శాఖ చేస్తున్న సర్వేలో పురాతన కాలానికి చెందిన భారీ కట్టడాలను కనుగొన్నారు. ముస్టాటిల్స్ గా పిలుస్తున్న ఈ కట్టడాలను మత విశ్వాసాల కారణంగా నిర్మించారని పురావస్తు శాఖ వారు పేర్కొన్నారు. ఈ కట్టడాలు తొలిసారిగా 1970లో వెలుగులోకి వచ్చినప్పటీకి, ఈ నిర్మాణాలు కొన్ని దశాబ్ధాల పాటు అంతు చిక్కని రహస్యంగా ఉండిపోయాయి. దీర్ఘచతురస్రంగా పిలిచే అరబిక్ పదానికి ముస్టాటిల్స్ గా పేరుపెట్టారు. వీటి నిర్మాణంలో ప్రతి చివర ఒక వేదికను కలిగి ఉన్నాయి. ఇవి సుమారు 20 నుంచి 620 మీటర్ల వరకు భారీ రాతి నిర్మాణాలను కలిగి ఉన్నాయి. ఈ భారీ రాతి కట్టడాలు సౌదీ అరేబియాలోని అలులా , ఖైబర్ కౌంటీ ప్రాంతాలలో అధిక భాగం ఉన్నాయి.వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం ఈ ప్రాంతంపై సర్వే నిర్వహించింది. ఈ ప్రాంతంపై ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద పురావస్తు అధ్యయనం. ఈ పరిశోధనకు రాయల్ కమిషన్ ఫర్ అలులా (ఆర్సియు) నిధులు సమకూర్చింది. ఈ బృందం క్రమబద్ధమైన రిమోట్ సెన్సింగ్ ద్వారా 641 ముస్టాటిల్స్ ను కనుగొన్నారు, ఈ పరిశోధనలను సుమారు 350 వైమానిక సర్వేలను నిర్వహించారు. రెండు లక్షల కిలోమీటర్ల పరిధిలో సుమారు 1,000 కంటే ఎక్కువ ముస్టాటిల్స్ ను కనుగొన్నారు. గతంలో ఉనికిలోకి వచ్చిన వాటికంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ.ఈ కట్టడాల్లో ప్రత్యేకమైన ప్రవేశ మార్గాలు, వ్యవస్థీకృత గదులు, పొడవాటి ప్రాంగణ నిర్మాణాలు ఉన్నాయి. ఈ స్మారక కట్టడాలను నిర్మించడానికి ఈ ప్రాంతంలో నివసించిన పూర్వ సమాజాల భాగస్వామ్య నమ్మకాలు వీటిని నిర్మించిడానికి దోహదంపడ్డాయని పరిశోధకులు తెలిపారు. ఈ కట్టడాలపై రేడియోకార్బన్ పరీక్షలు నిర్వహించిన తరువాత , అవి నియోలిథిక్ కాలంకు చెందినవని కనుగొన్నారు.అంతేకాకుండా ఈ ప్రాంతంలో నిర్వహించిన తవ్వకాల్లో భారీ ఎత్తున పశువుల ఎముకలు లభించాయి. గుర్తు తెలియని దేవుళ్లకు భారీ ఎత్తున పశువుల బలులు జరిగి ఉండవచ్చునని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. నార్త్-వెస్ట్ అరేబియాకు చెందిన ఈ ముస్టాటిల్స్ ప్రపంచంలోనే మొట్టమొదటి అతి పెద్ద స్మారక కట్టడాలుగా నిలుస్తాయని ప్రాజెక్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ మెలిస్సా కెన్నెడీ తెలిపారు. ముస్టాటిల్స్ నియోలిథిక్ కాలానికి చెందిన వారి పూర్వీకుల గురించి తెలియజేయడానికి ప్రాదేశిక గుర్తులుగా కూడా పనిచేసి ఉండవచ్చునని పరిశోధకులు భావిస్తున్నారు. చదవండి: స్వదేశానికి వస్తే ఐదేళ్ల జైలు శిక్ష..! -
వెల్కటూరులో కొత్త రాతియుగం ఆనవాళ్లు
సిద్దిపేట: సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూరు గ్రామంలో మానవ సాంస్కృతిక వికాసాలను ప్రతిబింబించే కొత్తరాతియుగం నాటి శిల్పాలు లభించాయి. ఇంత వరకు గ్రామస్తులకు మాత్రమే తెలిసిన ఈ చరిత్రను బయటి ప్రపంచానికి తెలియజేస్తున్నట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. గతంలో ఇక్కడ చారిత్రక పూర్వయుగం, కొత్తరాతియుగం ఆనవాళ్లు లభించినట్టు తెలిపారు. అందులో 10 నాగశిల్పాలు, రెండు వీరగల్లులు, రెండు జైన శిల్పాలు ఉన్నాయి. జైన ద్వారపాలకుల శిల్పాలు అత్యంత శిల్ప సౌందర్యంగా ఉన్నట్టు తెలిపారు. వీరు జంధ్యాలు కుడి వైపు ధరించి ఉన్నట్టు తెలిపారు. వీరశైవ భక్తుల ప్రతిమ లక్షణాలను కలిగిన రెండు విగ్రహాలు ఆత్మాహుతి చేసుకుంటున్న దృశ్యాన్ని చూపే విధంగా ఉన్నట్టు తెలిపారు. వీరశైవుల వీరభక్తికి సాక్ష్యాలుగా ఈ విగ్రహాలు ఉన్నట్టు తెలిపారు. ఇలా మరుగున పడిన చారిత్రక విశేషాలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా పరిశోధన చేస్తున్నట్టు తెలిపారు. -
8 వేల ఏళ్ల నాటి ముత్యం
అబుధాబి: యూఏఈలోని మరవాహ్ ద్వీపంలో జరిపిన తవ్వకాల్లో అత్యంత ప్రాచీన ముత్యం బయల్పడింది. ఇది 8 వేల ఏళ్ల నాటి నియోలిథిక్ కాలానికి చెందిందని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అక్టోబర్ 30 నుంచి ప్రారంభం కానున్న లౌవ్రె అబుధాబి ఎగ్జిబిషన్లో ఈ ముత్యాన్ని ప్రదర్శించనున్నారు. ముత్యపు పొరలపై జరిపిన కార్బన్ డేటింగ్లో ఇది క్రీ.పూ 5800–5600 కాలానికి సంబంధించిందిగా తేలినట్లు అధికారులు వెల్లడించారు. యూఏఈలో దొరికిన అత్యంత ప్రాచీన వస్తువు కూడా ఇదే కావడం గమనార్హం. -
7 వేల ఏళ్ల కిందటే నది కలుషితం
టొరాంటో: ప్రపంచంలోనే తొలిసారిగా కలుషితమైన నదిని శాస్త్రవేత్తలు గుర్తించారు. అది దాదాపు 7 వేల ఏళ్ల కిందట నియోలిథిక్ యుగానికి చెందిన మానవులు రాగి లోహాన్ని ఉత్పత్తి చేసే క్రమంలో ఈ నది కలుషితమైందని భావిస్తున్నారు. దక్షిణ జోర్డాన్లో వడీ ఫేనాన్ ప్రాంతంలో ప్రస్తుతం ఎండిపోయిన నదీ భూతలంలో ఇది చోటు చేసుకుందని కెనడాలోని వాటర్లూ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రస్సెల్ ఆడమ్స్ పరిశోధనల్లో తేలింది. రాగిని విచక్షణారహితంగా కరిగించడం వల్ల నదీ వ్యవస్థ కలుషితమైందని ఆయన చెబుతున్నారు. రాతి యుగం చివరి దశ లేదా కాంస్య యుగం తొలి దశల్లో ఆదిమ మానవులు పనిముట్లను తయారు చేసినట్లు ఈ పరిశోధనలు మరోసారి రుజువు చేస్తున్నాయి. ‘అప్పటి మానవులు నిప్పు, కుండలు, గనుల నుంచి తవ్వి తీసిన ముడి రాగి ద్వారా తొలిసారిగా రాగి లోహాన్ని తయారు చేశారు’ అని ఆడమ్స్ పేర్కొన్నారు.