లొంగిపోలేదు.. భారతదేశానికే వెళ్తా: ఛోటా రాజన్
దాదాపు రెండు దశాబ్దాల పాటు నిఘా ఏజెన్సీలకు, పోలీసు వర్గాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన మాఫియా డాన్ ఛోటా రాజన్ విషయంలో రోజుకో సరికొత్త కథనం బయటకు వస్తోంది. ఇండోనేషియా పోలీసుల విచారణలో అతడు చెప్పిన మాటలు ఒక్కో రోజు ఒక్కో రకంగా ఉంటున్నాయి. నిన్నటివరకు తాను జింబాబ్వే వెళ్లాలనుకుంటున్నానని, భారత దేశానికి పంపొద్దని రాజన్ కోరినట్లు చెప్పగా.. తాజాగా తాను భారత దేశానికే వెళ్తానని అన్నట్లు చెబుతున్నారు. అలాగే, ఛోటారాజన్‌ను పోలీసులు అరెస్టు చేయలేదని, అతడి ఆరోగ్యం బాగోని కారణంగా తనంతట తానే లొంగిపోయాడని కూడా తొలుత చెప్పారు. కానీ, తాను లొంగిపోలేదని, అలాంటి ప్రసక్తే లేదని ఇప్పుడు అతడు అంటున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఒకప్పుడు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు కుడి భుజంలా ఉండే ఛోటా రాజన్, ఆ తర్వాత దావూద్‌కు ఎదురుతిరిగి ప్రత్యేకంగా సొంత గ్యాంగు పెట్టుకున్నాడు. ఎట్టకేలకు రాజన్ లొంగిపోవడంతో, అతడి తర్వాత ఆ సామ్రాజ్య పగ్గాలు అతడి నమ్మిన బంటు విక్కీ మల్హోత్రా చేతికి వెళ్తున్నాయి.