ప్రారంభానికి సిద్ధం..
తీరనున్న 30 ఏండ్ల అద్దె తిప్పలు
ఎట్టకేలకు సొంతభవనం పూర్తి..
త్వరలో నూతన భవనంలోకి తహసీల్దార్ కార్యాలయం
సైదాపూర్: 30 ఏళ్ల అద్దె భవనం ఇక్కట్లు త్వరలో గట్టెక్కనున్నాయి. రెండు గ్రామాల నడుమ తలెత్తిన వివాదం ఎట్టకేలకు తెరపడనుంది. స్థానిక ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ చొరవతో మండలకేంద్రంలో ఇటీవల అన్ని హంగులతో పూర్తయిన తహసీల్దార్ కార్యాలయ సొంత భవనం ప్రారంభానికి సిద్ధమైంది.
వెన్కెపల్లి–సైదాపూర్ తహసీల్దార్ కార్యాలయం మండల వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి దాదాపు 30 ఏళ్లుగా అద్దె భవనంలోనే కొనసాగుతోంది. అరకొర వసతులతో పెంకుటింట్లో నిర్వహిస్తున్న ఈ కార్యాలయం వర్షానికి ఉరుస్తుంది. వేసవిలో గాలి ఆడదు. పైకప్పు నుంచి మట్టి రాలుతోంది. రికార్డులుసైతం దుమ్ము, వర్షానికి ఉరిసిన నీటితో తడిసి చెరిగిపోతున్నాయి. రైతుల భూముల రికార్డులు ఉండే కార్యాలయానికి భద్రత కరువైంది. ఇలా మూడు దశాబ్దాలుగా అవస్థలు పడుతున్నారు కార్యాలయ సిబ్బంది, మండల ప్రజలు.
జంట గ్రామాల ఆదిపత్యం..
వెన్కెపల్లి–సైదాపూర్ రెండు జంట గ్రామాలు. వీటితోనే మండలకేంద్రంగా ఏర్పడ్డాయి. మండల వ్యవస్థ ఏర్పడినప్పుడు తహసీల్దార్, మండల పరిషత్, పోలీస్‌స్టేషన్ కార్యాలయాలు సైదాపూర్‌లో అద్దె భవనాల్లో కొనసాగాయి. పాలన సౌలభ్యం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించేందుకు వెన్కెపల్లిలో స్థలం కేటాయించారు. మొదట పోలీస్‌స్టేషన్ కార్యాలయం పూర్తయింది. అనంతరం మండల పరిషత్, తహసీల్ కార్యాలయాలను రేకులతో నిర్మించారు. ఇందులో మండల పరిషత్ కార్యాలయాన్ని తరలించారు. తహసీల్ కార్యాలయం కూడా తరలించాల్సి ఉండగా అధికారులు సమ్మతించలేదు. కార్యాలయం ఊరు చివరన ఉన్నందున రక్షణ లేకుండా ఉంటుందని ఉన్నతాధికారులకు నివేదించారు. స్థానిక నాయకులు కూడా తమ గ్రామం నుంచి వెన్కెపల్లికి తరలించకూడదని అడ్డుకునే యత్నాలు చేశారు. ఈ సమస్య రెండు గ్రామాల మధ్య కొంత కాలం వివాదానికి దారితీసింది.
సైదాపూర్‌లో స్థల విరాళం..
సైదాపూర్‌లోనే తహసీల్ కార్యాలయం నిర్మించాలని అందుకు కొత్త బస్టాండ్ సమీపంలో ఓ ప్రై వేట్ స్థలాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అక్కడే తహసీల్దార్ కార్యాలయం ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. పాలనసౌలభ్యం దష్ట్యా ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండాలనే మెజార్టీ ప్రజాప్రతినిధులు అభిప్రాయానికి వచ్చారు. ఈ క్రమంలో అప్పటి ఎంపీపీ వీరేశం అధ్యక్షతన జరిగిన మండల సభలో అప్పటి ఎంపీ పొన్నం ప్రభాకర్,ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి ఎదుట తహసీల్దార్ కార్యాలయం మండల కాంప్లెక్స్‌లోనే ఉండాలని సభ్యులు బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో గతంలో నిర్మించిన రేకుల షెడ్‌నే మరమ్మతు చేయించారు. అయినా అక్కడికి వెళ్లేందుకు రెవెన్యూ అధికారులు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వం పక్కా భవనం నిర్మించేందుకు నిధులు మంజూరు చేసింది. టెండర్ పిలిచి పనులు చేపట్టారు. ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేయగా నిర్మాణ పనులు సైతం పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. నూతన భవనం ప్రారంభం విషయమై తహసీల్దార్ కె. సురేఖను వివరణ కోరగా.. విషయాన్ని ఆర్డీవోకు శనివారం నివేదించామని తెలిపారు. ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ కూడా త్వరగా రికార్డులు షిఫ్టు చేయాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఆర్డీవో అనుమతి కోసం ప్రస్తుతం వేచి చూస్తున్నామని, వారంలోపు నూతన కార్యాలయం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు ఆమె వివరించారు.