new education system
-
యూజీ ఆనర్స్.. ఇక జాబ్ ఈజీ
గుణదల(విజయవాడ తూర్పు): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంలో భాగంగా యూజీ ఆనర్స్ (నాలుగేళ్ల డిగ్రీ) కోర్సుకు రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు మెండుగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు దేశ, విదేశాల్లో విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రూపొందించిన యూజీ ఆనర్స్ కోర్సును ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశపెట్టేందుకు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు సిద్ధమయ్యాయి. దీనిలో భాగంగా ఉన్న త విద్యా మండలి మార్గదర్శకాల ప్రకారం యూజీ ఆనర్స్ కోర్సుపై ఈ నెల మొదటి వారం నుంచే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు పెద్ద ఎత్తున విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాయి. నాలుగేళ్ల డిగ్రీ వల్ల కలిగే ప్రయోజనాలను విద్యావేత్తలు, మేధావులు వివరిస్తున్నారు. దేశంలో ఎక్కడైనా ఉన్నత విద్య అభ్యసించవచ్చని, విదేశాల్లో సైతం ఉపాధి అవకాశాలు సులభంగా లభిస్తాయని చెబుతున్నారు. దీంతో యూజీ ఆనర్స్‌పై విద్యార్థులకు ఆసక్తి పెరుగుతోంది. కోర్సులు ఇలా... బీఏ ఆనర్స్ : హిస్టరీ, టూరిజం మేనేజ్మెంట్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, స్పెషల్ ఇంగ్లిష్, స్పెషల్ తెలుగు ఒక మేజర్ సబ్జెక్ట్‌గా ఉంటాయి. ఈ కోర్సులోనే మైనర్ సబ్జెక్టులుగా సోషియాలజీ, ఫిలాసఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ ఉంటాయి. బీఎస్సీ ఆనర్స్: కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎల్రక్టానిక్స్, నానో టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, మాథమేటిక్స్, స్టాటిస్టిక్స్, బోటనీ, హారి్టక ల్చర్, జువాలజీ, అగ్రికల్చర్, మైక్రో బయాలజీ, బయోకెమిస్ట్రీ మేజర్ సబ్జెక్టులుగా ఉంటాయి. మైనర్ సబ్జెక్టులుగా ఫుడ్ టెక్నాలజీతోపాటు ఎంపిక చేసుకున్న కోర్సుకు ఆధారంగా మరికొన్ని సబ్జెక్టులు ఉంటాయి. బి.కాం ఆనర్స్: బి.కాం జనరల్, కంప్యూటర్ అప్లికేషన్స్, బీబీఏ జనరల్, బీబీఏ డిజిటల్ మార్కెటింగ్, బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ ఫైనాన్సియల్ సరీ్వసెస్, అకౌంట్స్ అండ్ టాక్సెస్ మేజర్ సబ్జెక్టులుగా ఉంటాయి. యూజీ ఆనర్స్ మొదటి ఏడాది పూర్తి చేస్తే సర్టిఫికెట్ ఇస్తారు. రెండో ఏడాది పూర్తి చేసిన వారికి డిప్లొమా వస్తుంది. మూడేళ్లు పూర్తి చేస్తే డిగ్రీ, నాలుగో ఏడాది ఉత్తీర్ణులైతే ఆనర్స్ పట్టా పొందుతారు. నాలుగేళ్లు ఆనర్స్ పూర్తి చేసిన తర్వాత పీజీ ఏడాది చదివితే నేరుగా పీహెచ్డీ చేసే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగ, ఉన్నత విద్యా అవకాశాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ విద్యా విధానం విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు, ఉద్యోగాలు పొందేందుకు అవకాశాలు లభిస్తాయి. యువత ఉన్నత భవిష్యత్తుకు నూతన కోర్సులు బంగారు బాటలు వేస్తాయి. – డాక్టర్ భాగ్యలక్ష్మి, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్, విజయవాడ -
ఆంగ్ల బానిసత్వం మనకొద్దు
అదాలజ్/గాంధీనగర్: ఆంగ్ల భాష పట్ల బానిస మనస్తత్వం నుంచి నూతన విద్యా విధానంతో దేశం బయట పడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. 5జీ టెలికాం సేవలు విద్యా వ్యవస్థను మరో స్థాయికి తీసుకెళ్తాయన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో స్మార్ట్ సదుపాయాలు, స్మార్ట్ తరగతి గదులు, స్మార్ట్ బోధనా రీతులు అందుబాటులోకి వస్తాయన్నారు. గుజరాత్లో గాంధీనగర్ జిల్లాలోని అదాలజ్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ను మోదీ బుధవారం ప్రారంభించారు. ‘‘ఇంగ్లిష్ కేవలం ఒక భావప్రసార మాధ్యమమే. అయినా ఆ భాషలో పరిజ్ఞానముంటేనే మేధావులుగా పరిగణించే పరిస్థితి ఉంది. ప్రతిభావంతులైన గ్రామీణ యువత ఇంగ్లిష్‌లో నైపుణ్యం లేదన్న కారణంతో డాక్లర్లు, ఇంజనీర్లు కాలేకపోతున్నారు’’అని వాపోయారు. ఇతర భాషల్లోనూ ఉన్నత చదువులు చదువుకొనే అవకాశం ఇప్పుడుందన్నారు. గ్రామీణ విద్యార్థులకు లబ్ధి తన స్వరాష్ట్రం గుజరాత్లో విద్యారంగంలో గత రెండు దశాబ్దాల్లో ఎనలేని మార్పులు వచ్చాయని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. 1.25 లక్షల కొత్త తరగతి గదులు నిర్మించారని, 2 లక్షల మంది టీచర్లను నియమించారని ప్రశంసించారు. స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద మరో 50,000 క్లాస్‌రూమ్‌లు నిర్మించనున్నట్లు తెలిపారు. లక్ష క్లాస్‌రూమ్‌లను 5జీ టెక్నాలజీతో స్మార్ట్ తరగతి గదులుగా మార్చబోతున్నట్లు చెప్పారు. ఆన్లైన్లో పాఠాలు వినొచ్చని, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఎంతగానో లబ్ధి పొందుతారని వివరించారు. విద్యార్థులు చిన్న వయసు నుంచే పోటీ పరీక్షల కోసం సన్నద్ధం కావొచ్చని, రోబోటిక్స్ వంటి కొత్త సబ్జెక్టులు నేర్చుకోవచ్చని సూచించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మార్చడానికి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘శాల ప్రవేశోత్సవ్, గుణోత్సవ్’ వంటి కార్యక్రమాలు ప్రారంభించానని గుర్తుచేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మోదీ సంభాషించారు. రక్షణ స్వావలంబన గర్వకారణం ఇకపై దేశీయంగా ఉత్పత్తి అయిన రక్షణ పరికరాలనే కొనుగోలు చేయాలని మన రక్షణ దళాలు నిర్ణయించుకోవడం సంతోషకరమని మోదీ చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్‌కు ఇది నిదర్శనమన్నారు. గుజరాత్లో ‘డిఫెన్స్ ఎక్స్పో–2022ను ప్రధాని మోదీ ప్రారంభించారు. 2021–22లో 13,000 కోట్ల రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేశామని, రూ.40,000 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. భారత్–పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో బనస్కాంతా జిల్లా దీసాలో వైమానిక స్థావరం నిర్మాణానికి మోదీ పునాదిరాయి వేశారు. -
నూతన విద్యా విధానంతో ఉజ్వల భవిష్యత్తు
బంగారుపాళెం: నూతన విద్యా విధానంతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు, రిటైర్డ్ సీఎస్ అజేయ కల్లం అన్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలంలోని నల్లంగాడు, తుంబకుప్పం గ్రామ సచివాలయాలను గురువారం ఆయన సందర్శించారు. సంక్షేమ పథకాల అమలు తీరుపై అక్కడి సిబ్బందిని ఆరా తీశారు. గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా.. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం ద్వారా పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు అడిగిన ప్రశ్నకు అజేయ కల్లం సమాధానం ఇస్తూ.. గతంలో 2, 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలకు వెళ్లి చదువులు సాగించిన విషయాన్ని గుర్తుచేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులందరూ కలిసి చదువుకోవడం వల్ల తెలివితేటలు బాగా ఉండేవని, పిల్లల్లో స్నేహపూర్వక వాతావరణం నెలకొని ఉండేదని తెలిపారు. ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న విద్యావిధానం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తోందని చెప్పారు. అజేయ కల్లంను జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రామచంద్రారెడ్డి, ఎంపీపీ అమరావతి, వైస్ ఎంపీపీ శిరీష్‌రెడ్డి, సర్పంచులు ధనంజయరావు, లీలావతమ్మ, రంజిత్‌కుమార్‌రెడ్డి, తహసీల్దార్ బెన్రాజ్, ఇన్చార్జి ఎంపీడీవో సందీప్ మర్యాద పూర్వకంగా కలిశారు. -
నూతన విద్యావిధానం అమలులో ఏపీ భేష్
గుంటూరు ఎడ్యుకేషన్/గుంటూరు మెడికల్/మంగళగిరి: కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యా విధానాన్ని ఏపీ ప్రభుత్వం అద్భుతంగా అమలు చేస్తోందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభినందించారు. ఏపీ ప్రభుత్వం మాదిరిగా ప్రతి రాష్ట్రమూ నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని సూచించారు. మంగళవారం గుంటూరు జిల్లా ఆత్మకూరులో రామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన గురు సన్మానం, 2020–2021 విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రామినేని ఫౌండేషన్ మాతృభూమికి చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. కరోనా సమయంలోనూ విద్యా వ్యవస్థను కొనసాగించేందుకు ఉపాధ్యాయులు శ్రమించిన తీరు అభినందనీయమన్నారు. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగారాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేసి, ప్రతి ఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. అనంతరం ప్రముఖ రచయిత వేదాంతం శరశ్చంద్రబాబు రచించిన నీతి కథల సమాహారం ‘కథాసూక్తమ్’ అనే పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి ఆవిష్కరించారు. ప్రజల కోసం జీవిస్తే చరిత్రలో నిలిచిపోతారు.. సమాజ హితాన్ని కోరి.. ప్రజల కోసం జీవిస్తే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. మంగళవారం గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల వజ్రోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. దేశంలో కొందరు కుల, మత, వర్గ విభేదాలతో సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని, ఇది దేశాభివృద్ధికి విఘాతం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్వ విద్యార్థి, నాబార్డు చైర్మన్ చింతల గోవిందరాజులు మాట్లాడుతూ పాటిబండ్ల సీతారామయ్య పాఠశాల విలువలు, క్రమశిక్షణతో కూడిన విద్యనందించి.. తన జీవితాన్ని తీర్చిదిద్దిందని చెప్పారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ ఎంపీలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, డాక్టర్ యలమంచిలి శివాజీ పాల్గొన్నారు. రంగరాజు ఇంటికి ఉప రాష్ట్రపతి.. గుంటూరు రైలుపేటలోని బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ జూపూడి రంగరాజు గృహాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మంగళవారం సందర్శించి.. వారి కుటుంబంతో అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. జనసంఘ్ వ్యవస్థాపకుల్లో రంగరాజు తండ్రి జూపూడి యజ్ఞనారాయణ ఒకరు. -
ఇక ఇబ్బంది లేకుండా స్కూళ్ల మ్యాపింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నూతన విద్యావిధానం అమల్లో భాగంగా చేపట్టిన స్కూళ్ల మ్యాపింగ్‌లో అక్కడక్కడ ఎదురవుతున్న ఇబ్బందులకు పరిష్కారం చూపుతూ పాఠశాల విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఎస్.సురేష్‌కుమార్ మంగళవారం రాత్రి పొద్దుపోయాక అన్ని జిల్లాల విద్యాధికారులు, ప్రాంతీయ సంచాలకులకు సవివర సర్క్యులర్ జారీచేశారు. పాఠశాల విద్యలో ఉత్తమ అభ్యసన ఫలితాల కోసం విద్యాశాఖలోని మానవవనరులను, మౌలిక సదుపాయాలను సాధ్యమైనంత సమర్థ వినియోగానికి చేపట్టిన సంస్కరణలలో విధివిధానాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే మాదిరి అమలు చేయడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను ఒకే ఆవరణలో, లేదా 250 మీటర్లలోపు హైస్కూళ్లకు అనుసంధానం చేసేందుకు ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు కొన్ని ప్రాంతాల్లో మ్యాపింగ్ కూడా పూర్తిచేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన నిబంధలున్నా.. కొన్ని ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఇబ్బందులు వచ్చాయి. వాటిని పరిష్కరిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేతీరున ఉండేలా కొత్తగా సమగ్రమైన మార్గదర్శకాలను విడుదల చేశారు. సర్క్యులర్ ప్రకారం మ్యాపింగ్‌లో చేపట్టాల్సిన అంశాలు ఇలా ఉన్నాయి.... ► ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులు హైస్కూళ్లకు అనుసంధానం తరువాత మిగిలిన 1, 2 తరగతుల్లో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 1:30 వరకు ఉంటుంది. ► 3, 4, 5 తరగతుల విద్యార్థులను హైస్కూళ్లకు అనుసంధానం చేసిన అనంతరం ఫౌండేషనల్ స్కూళ్లలోని 1, 2 తరగతుల బోధనకు ప్రాథమిక పాఠశాలలోని సెకండరీ గ్రేడ్ టీచర్లలో సర్వీసు పరంగా అందరికన్నా జూనియర్‌ను నియమించాలి. ► మిగతా హెడ్మాస్టర్, ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్లతో సహా ఇతర టీచర్లను మ్యాపింగ్ అయిన హైస్కూళ్లకు అనుసంధానించాలి. ► మ్యాపింగ్ అనంతరం 3 నుంచి 10వ తరగతి వరకు ఉండే ఈ హైస్కూళ్లలో వర్క్‌లోడ్, తరగతుల వారీగా టైమ్‌టేబుల్ అనుసరించి స్టాఫ్‌ప్యాట్రన్ ఒక హెడ్మాస్టర్, ఒక పీఈటీ లేదా ఒక స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్)తో 9 మంది టీచర్లుంటారు. వీరిలో సబ్జెక్టు టీచర్లు ఉంటారు. స్కూల్ అసిస్టెంట్లు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు, ఎస్జీటీలు ఉంటారు. ► ఆయా హైస్కూళ్లలో అదనపు సెక్షన్లు ఉంటే అవసరమైన అదనపు సిబ్బంది ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. ► అదనపు సిబ్బంది అవసరమైన హైస్కూళ్లకు సమీపంలో మ్యాపింగ్ అయిన ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లలో అదనంగా ఉన్న సిబ్బందిని నియమించాలి. సమీపంలో అలాంటి స్కూళ్లు లేకుంటే ఆ మండలంలో ఏ స్కూలులో అదనపు సిబ్బంది ఉన్నా వారిని నియమించవచ్చు. మండల పరిధిలో కూడా లేనిపక్షంలో జిల్లాలోని ఏ స్కూలు నుంచైనా సర్దుబాటు చేయవచ్చు. ► హైస్కూళ్లలోని టీచర్లను వినియోగించుకోవడంలో హెడ్మాస్టర్కు అధికారముంటుంది. అకడమిక్ క్యాలెండర్‌లోని సూచనలను అనుసరించి ఆయా టీచర్ల అర్హతలను పరిగణనలోకి తీసుకొని హెడ్మాస్టర్ సబ్జెక్టుల వారీగా బాధ్యతలు అప్పగించవచ్చు. ► ఆయా సబ్జెక్టులకు సంబంధిత సబ్జెక్టు టీచర్లు, లేదా క్వాలిఫైడ్ టీచర్లనే నియమించాలి. ► మిగతా టీచర్లకు రెమిడియల్ తరగతులు, లైబ్రరీ, ఆర్ట్, డ్రాయింగ్ తదితర అంశాల బాధ్యతలు అప్పగించాలి. ► పాఠశాలల మ్యాపింగ్ సమయంలో తల్లిదండ్రుల కమిటీ తీర్మానం మేరకు ఒకే కాంపౌండ్‌లో 1 నుంచి 10వ తరగతి వరకు మిశ్రమ పాఠశాలగా కొనసాగించవచ్చు. ► మ్యాపింగ్ హైస్కూళ్లలో వసతి సరిపడా లేనిపక్షంలో 3, 4, 5 తరగతుల విద్యార్థులను ప్రాథమిక పాఠశాలలోనే కొనసాగించవచ్చు. హైస్కూళ్లలోని టీచర్లతో ఈ తరగతుల విద్యార్థుల బోధనను కొనసాగించాల్సి ఉంటుంది. హైస్కూల్ హెడ్మాస్టర్ ఈ బాధ్యతలు చూస్తారు. ► మ్యాపింగ్ స్కూళ్ల క్యాడర్ స్ట్రెంగ్త్, వారి వేతనాలు, అమలు తదితర అంశాలకు సంబంధించి డీఈవోలు చర్యలు చేపట్టాలి. మధ్యాహ్న భోజనం అందించడానికి వీలుగా ఎండీఎం డైరెక్టర్ ఐఎంఎంఎస్ అప్లికేషన్లలో తగిన మార్పులు చేయాలి. -
Andhra Pradesh: సంస్కరణలకు శుభారంభం
సాక్షి, అమరావతి: రానున్న విద్యా సంవత్సరంలో నూతన విద్యావిధానం అమలు చేయడానికి అవసరమైన చోట్ల అదనపు తరగతి గదుల నిర్మాణంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. కార్యాచరణ పూర్తిచేసి వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తం ప్రక్రియ పూర్తయ్యేనాటికి అవసరమైన టీచర్ల సంఖ్యను కూడా గుర్తించాలని సూచించారు. విద్యారంగంలో తెచ్చిన సంస్కరణలు, నూతన విద్యా విధానంపై సీఎం జగన్ బుధవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా టీచర్లను నియమించడంతోపాటు సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులతో బోధనే లక్ష్యంగా నూతన విద్యా విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న విషయం తెలిసిందే. టీచర్లకు అత్యుత్తమ శిక్షణ టీచర్లకు శిక్షణ ఇచ్చే డైట్ సంస్థల సమర్థత పెంచాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. టీచర్లకు అత్యంత నాణ్యమైన శిక్షణ అందాలని, ఈ కార్యక్రమాలపై వచ్చే సమావేశంలో వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. స్కూళ్లలో సమస్యలపై కాల్‌సెంటర్ పాఠశాలల్లో సదుపాయాలకు సంబంధించి ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే వెంటనే కాల్ చేసేలా ఒక నంబర్ అందుబాటులోకి తేవాలని సీఎం ఆదేశించారు. ప్రతి స్కూల్లో అందరికీ కనిపించేలా ఈ నంబర్‌ను ప్రదర్శించాలని సూచించారు. ఈ కాల్‌సెంటర్‌ను అధికారులు పర్యవేక్షణ చేసిన వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని, తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇంగ్లీషుపై ప్రత్యేక శ్రద్ధ ఇంగ్లీషు ఉచ్ఛారణ, భాష, వ్యాకరణాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా పాఠ్య ప్రణాళికపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. విద్యార్థులకు ఇప్పటికే ఇచ్చిన డిక్షనరీలను వినియోగించుకోవాలన్నారు. ప్రతి రోజూ కనీసం మూడు కొత్త పదాలు నేర్పించి వాటిని సాధన చేసేలా పిల్లలకు మెళకువలు నేర్పాలని సూచించారు. మరుగుదొడ్లు నిర్వహణ ఇంట్లో మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలని ఎలా కోరుకుంటామో విద్యార్థులు చదివే పాఠశాలల్లో కూడా అలాగే ఉండాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. నాణ్యమైన సదుపాయాలు అందరి లక్ష్యం కావాలన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల స్థితిగతులపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఆదేశించారు. టాయిలెట్స్‌లో ట్యాప్‌లు పనిచేయక, నీళ్లు రాక దుర్గంధంతో ఎవరూ వినియోగించని పరిస్థితులు గతంలో చూశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అలాంటి దుస్థితిని నాడు – నేడు ద్వారా సమూలంగా మార్చామని ముఖ్యమంత్రి తెలిపారు. క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ పిల్లలకు మంచి వాతావరణం అందుబాటులో ఉంచాలని సూచించారు. విద్యారంగంపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హెడ్మాస్టర్లే కుటుంబ పెద్దలు పాఠశాలలకు హెడ్ మాస్టర్లే కుటుంబ పెద్దలని సీఎం జగన్ పేర్కొన్నారు. మెరుగైన రీతిలో బోధన దగ్గర నుంచి నాణ్యమైన భోజనం, సదుపాయాలు, మౌలిక వసతులపై తనిఖీలు నిర్వహిస్తూ అంతా సవ్యంగా ఉండేలా హెడ్మాస్టర్లను చైతన్యం చేయాలని సూచించారు. వీటిపై ప్రతిరోజూ పర్యవేక్షణ జరగాలని స్పష్టం చేశారు. గోరుముద్దపై ఫీడ్ బ్యాక్ గోరుముద్దపై క్రమం తప్పకుండా ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. పిల్లలు, తల్లుల నుంచి తప్పకుండా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా, సమస్య తలెత్తినా వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు, జేసీలు, అధికారులు తప్పనిసరిగా గోరుముద్ద అమలును పర్యవేక్షించాలని, స్వయంగా భోజనం చేసి నాణ్యతను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. లెర్న్ టు లెర్న్ కాన్సెప్ట్ లెర్న్ టు లెర్న్ కాన్సెప్ట్‌ను పాఠ్యప్రణాళికలో తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఇంటర్నెట్, ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా వివిధ అంశాలను నేర్చుకోవడం, ఇతరులకు తెలియచేయడం లాంటి కాన్సెప్ట్‌ను పిల్లలకు నేర్పాలని అధికారులకు సూచించారు. 1,092 స్కూళ్లకు సీబీఎస్ఈ అఫిలియేషన్ సీబీఎస్ఈ అఫిలియేషన్‌పై కూడా ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. 1,092 స్కూళ్లలో 2021–22 విద్యా సంవత్సరంలో సీబీఎస్ఈ అఫిలియేషన్ జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. దేశంలో ఒకే ఏడాది 1092 స్కూళ్లకు సీబీఎస్ఈ అఫిలియేషన్ ఇవ్వడం రికార్డని చెప్పారు. ఈ విద్యార్థులు 2024–25 నాటికి పదో తరగతి పరీక్షలు రాస్తారని తెలిపారు. అంతర్జాతీయంగా 24 వేల స్కూళ్లకు మాత్రమే సీబీఎస్ఈ అఫిలియేషన్ ఉందని వివరించారు. మూడు దశలుగా మూడేళ్లలో... శాటిలైట్ ఫౌండేషనల్ స్కూల్స్, ఫౌండేషనల్ స్కూల్స్, ఫౌండేషనల్ ప్లస్ స్కూల్స్, ప్రీ హైస్కూల్స్, హైస్కూల్స్, హైస్కూల్ ప్లస్ స్కూళ్లపై సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందచేశారు. 2021–22 నుంచి 2023–24 వరకూ మూడు విద్యా సంవత్సరాల్లో మూడు దశలుగా నూతన విద్యా విధానం పూర్తిగా అమలు కానుంది. ఇందులో భాగంగా 25,396 ప్రైమరీ పాఠశాలలను యూపీ (అప్పర్ ప్రైమరీ) స్కూళ్లు, హైస్కూళ్లలో విలీనం చేస్తారు. తొలిదశ కింద ఈ విద్యా సంవత్సరంలో 2,663 స్కూళ్లను విలీనం చేసినట్లు అధికారులు తెలిపారు. 2,05,071 మంది విద్యార్థులు నూతన విద్యా విధానాన్ని అనుసరించి విలీనమైనట్లు చెప్పారు. మొత్తంగా ఈ ప్రక్రియలో 9.5 లక్షల మంది విద్యార్థులకు నూతన విద్యావిధానం ఈ సంవత్సరమే అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు. సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ.ఆర్.అనురాధ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ (ఎండీఎం అండ్ శానిటేషన్) బి.ఎం.దివాన్, మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కృతికా శుక్లా, సర్వశిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రిసెల్వి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.చినవీరభద్రుడు, ఏపీఆర్ఈఐఎస్ సెక్రటరీ వి.రాములు తదితరులు పాల్గొన్నారు. ఎయిడెడ్‌పై బలవంతం లేదు ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వానికి అప్పగించడం అన్నది పూర్తిగా స్వచ్ఛందమని ముఖ్యమంత్రి జగన్ మరోసారి స్పష్టం చేశారు. వివిధ కారణాలతో నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రభుత్వం ఒక అవకాశం మాత్రమే కల్పిస్తుందని చెప్పారు. ఇష్టం ఉన్నవారు స్వచ్ఛందంగా ప్రభుత్వంలో విలీనం చేయవచ్చని లేదంటే యథాప్రకారం నడుపుకోవచ్చన్నారు. విలీనం చేస్తే వారి పేర్లు కొనసాగిస్తామన్నారు. తొలుత విలీనానికి అంగీకరించిన వారు నిర్ణయం మార్చుకుని తామే నిర్వహించుకుంటామంటే నిరభ్యంతరంగా వెనక్కి తీసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులకు మంచి సదుపాయాలు, నాణ్యమైన విద్య అందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. ఈ ప్రక్రియలో ఎక్కడా బలవంతం లేదని, అపోహలకు గురి కావద్దని, ఇందులో రాజకీయాలు తగవని సూచించారు. -
విద్యాలయాల్లో ‘సెల్ఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్’ కోర్సులు
సాక్షి, అమరావతి: కరోనా ప్రభావంతో భయం, ఒత్తిడితో యువత మానసిక ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమైంది. ఈ నేపథ్యంలో వారి చదువులు ముందుకు సాగించేందుకు వీలుగా సామాజిక భావోద్వేగాలకు అనుగుణంగా అభ్యసన విధానాలను విద్యా వ్యవస్థలోకి తీసుకొచ్చేలా యూజీసీ కొత్త కోర్సుల అమలుకు అన్ని యూనివర్సిటీలు, విద్యాసంస్థలకు సూచనలు జారీచేసింది. యూఎస్ఏలోని లైఫ్ యూనివర్సిటీ, యునెస్కో పరిధిలోని మహాత్మా గాంధీ ఇనిస్టిట్యూట్ ఫర్ పీస్ అండ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ (ఎంజీఐఈపీ) రూపొందించిన ‘కాంప్రహెన్సివ్ ఇంటెగ్రిటీ ట్రయినింగ్ సెల్ఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్(సీఐటీ–ఎస్డీఎల్) కోర్సులు అమలుపై పరిశీలన చేయాలని ఆయా విద్యాసంస్థలకు సూచించింది. జాతీయ నూతన విద్యావిధానం–2020లో పేర్కొన్న విధంగా 2021 శతాబ్దపు ‘ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్’ను ఈ కోర్సులు పెంపొందిస్తాయని తెలిపింది. యువత తమ భవిష్యత్తును విజయవంతంగా తీర్చిదిద్దుకునేందుకు ఇవి ఉపకరిస్తాయంది. సీఐటీ–ఎస్డీఎల్ కోర్సులకు సంబంధించి ఇతర అంశాలకు యునెస్కో ఎంజీఐఈపీ సీనియర్ ప్రాజెక్టు ఆఫీసర్‌ను ఈ మెయిల్ (ఎ.సీఏఐఎన్‌ఈఎట్‌దరేట్‌యునెస్కో.ఓఆర్జీ) ద్వారా సంప్రదించాలని సూచించింది. -
Andhra Pradesh: ఇక నుంచి నూతన విద్యా విధానం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నూతన విద్యావిధానాన్ని అమలు చేసేందుకు వీలుగా పాఠశాల విద్యాశాఖ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతమున్న 10+2 విధానం స్థానంలో 5+3+3+4 విధానం అమల్లోకి రానుంది. జాతీయ నూతన విద్యా విధానాన్ని అనుసరించి రాష్ట్ర పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఉత్తర్వులు విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్నిస్థాయిల కార్యనిర్వాహక అధికారులు ప్రస్తుతమున్న విధానం నుంచి నూతన విద్యావిధానంలోకి ప్రస్తుతం ఉన్న పాఠశాలలను ఎలా మ్యాపింగ్ చేయాలనే దానిపై కసరత్తు చేసి జూన్ 2వ తేదీలోగా నివేదికలను ఆన్లైన్లో సమర్పించాలని అన్ని జిల్లాల డీఈవోలకు ఆదేశాలు ఇచ్చారు. నూతన విధానంపై మార్గదర్శకాలను కూడా పొందుపరిచారు. నూతన విధానంలో ఇలా.. ► ఈ విధానంలో మూడు రకాల విద్యాసంస్థలు ఉంటాయి. ప్రాథమిక పాఠశాలల్లో ఇకనుంచి ప్రీ ప్రైమరీ–1, ప్రీ ప్రైమరీ–2, ప్రిపరేటరీ ఫస్ట్‌క్లాస్, 1వ తరగతి, 2వ తరగతితో ఉంటాయి. వీటిని ఫౌండేషన్ స్కూళ్లుగా పిలుస్తారు. ► ఆ తరువాత ప్రిలిమినరీ స్కూళ్లు (3, 4, 5 తరగతులు) ఉంటాయి. అనంతరం మిడిల్ స్కూళ్లు (6–8 తరగతులు), ఆపై సెకండరీ స్కూళ్లు (9నుంచి 12 తరగతులు) ఉంటాయి. అన్ని అంగన్వాడీ కేంద్రాలు ఇకపై వైఎస్సార్ ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా పనిచేస్తాయి. ► సాధ్యమైనంత వరకు అంగన్వాడీ కేంద్రాలను స్కూళ్లలో అనుసంధానమయ్యేలా చేయాలి. అలా ఒకే ప్రాంగణం లేదా ఒకే భవనంలో ఇవి ఉండేలా చేసి.. వాటిని ఫౌండేషన్ స్కూళ్లుగా పరిగణించాలి. ► ప్రతి ఫౌండేషన్ స్కూల్లో ఒక ఎస్జీటీ టీచర్ ఉంటారు. 1, 2 తరగతులకు బోధన చేస్తారు. ప్రిపరేటరీ–1 క్లాస్‌కు బోధనా సిబ్బందిని వేరేగా ఏర్పాటు చేస్తారు. ► ప్రస్తుత ప్రాథమిక స్కూళ్లలో ఉండే 3, 4, 5 తరగతుల విద్యార్థులను సమీపంలోని యూపీ స్కూల్ లేదా హైస్కూళ్లకు తరలిస్తారు. 3 కిలోమీటర్ల పరిధిలోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల విద్యార్థులనే ఇలా తరలింపు చేయాలి. ► ఈ విద్యార్థులను తరలించేప్పుడు ఆ యూపీ, హైస్కూళ్లలో తరగతి గదులు లేకుంటే అదనపు తరగతి గదులు ఎన్ని నిర్మించాల్సి ఉంటుందో కసరత్తు చేసి వాటిని నాడు–నేడు కింద నిర్మింపచేస్తారు. ► ఇలా 3–5 విద్యార్థులు అదనంగా చేరినప్పుడు యూపీ స్కూలులో 150 మందికి మించి విద్యార్థుల సంఖ్య పెరిగితే దాన్ని హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ చేస్తారు. ► 5 కిలోమీటర్ల సమీపంలోని సెకండరీ స్కూళ్లలో ఆయా మాధ్యమాల విద్యార్థుల సంఖ్యను అనుసరించి తెలుగు, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా కొనసాగిస్తారు. ► విద్యార్థుల సంఖ్య, మౌలిక వసతులను అనుసరించి సెకండరీ స్కూళ్లలో ఇంటర్మీడియెట్ తరగతులను ఏర్పాటు చేస్తారు. అక్కడ 12వ తరగతి వరకు ఉంటుంది. ఇలాంటి స్కూళ్లను గుర్తించాలి. ఇటువంటివి మండలానికి ఒకటి లేదా రెండు చొప్పున ఏర్పాటవుతాయి. ► ప్రీ ప్రైమరీ, ఫౌండేషనల్, సెకండరీ స్కూళ్లను మ్యాపింగ్ చేసి స్కూల్ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేస్తారు. ► పిల్లల ఇంటికి సమీపంలో ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఉండాలి. ఫౌండేషన్ స్కూలు ఒక కిలోమీటర్ పరిధిలో, సెకండరీ స్కూలు 3 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి. ► టీచర్, విద్యార్థుల నిష్పత్తి ప్రాథమిక స్థాయిలో 1:30, మాధ్యమిక స్థాయిలో 1:35, సెకండరీ స్థాయిలో 1:40 ఉండేలా చూడాలి. ► ఈ విధానంలో ఎక్కడా ఒక్క అంగన్వాడీ కేంద్రంగానీ, స్కూలు గానీ మూతపడకూడదు. ► విద్యార్థులను 3 కిలోమీటర్ల పైబడి తరలింపు చేయకూడదు. ► ఈ మార్గదర్శకాలను అనుసరించి డీఈవోలు, ఇతర అధికారులు నూతన విద్యావిధానం ప్రకారం స్కూళ్ల ఏర్పాటుకు మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాలి. అలాగే ఎంతమంది పిల్లలు యూపీ, హైస్కూళ్లకు తరలింపు చేయాల్సి ఉంటుంది, అక్కడ అదనపు తరగతి గదులు ఎన్ని అవసరమో నిర్ణయించాలి. వీటిని 2022–23, 2023–24 సంవత్సరాల్లో నిర్మించేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందించాలి. ► సెకండరీ స్కూళ్లకు సంబంధించి మండలానికి 2 చొప్పున 9నుంచి 12వ తరగతి ఉండేలా ప్రణాళిక రూపొందించి అదనపు తరగతి గదుల నిర్మాణం ఏ మేరకు అవసరమో నిర్ణయించాలి. ► ఈ కసరత్తు పూర్తిచేసి జూన్ 2వ తేదీకల్లా వివరాలను గూగుల్ లింక్, ఆన్లైన్ ద్వారా సమర్పించాలి. -
మార్కుల షీట్లు కావు.. ప్రెజర్ షీట్లు
న్యూఢిల్లీ : దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న విద్యా విధానంలో మార్కుల ఒత్తిళ్లు విద్యార్థులపై అత్యధికంగా ఉన్నాయని, వాటిని తొలగిస్తామని ప్రధాని మోదీ చెప్పారు. మార్కుల షీట్లు విద్యార్థులకు ఒత్తిడి షీట్లు అని, తల్లిదండ్రులకు అవే ప్రెస్టేజ్ షీట్లు అని వ్యాఖ్యానించారు. జాతీయ విద్యావి«ధానం 2020లో భాగంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ‘21వ శతాబ్దంలో పాఠశాల విద్య’ అనే అంశంపై శుక్రవారం ఏర్పాటు చేసిన సదస్సులో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు. కొత్త దిశా నిర్దేశం జాతీయ విద్యా విధానం దేశానికి కొత్త దిశానిర్దేశం ఇచ్చేలా నిలుస్తుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. యువతపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని వారిలో సృజనాత్మక ఆలోచనలు పెరిగేలా విద్యా బోధన జరగాలని అన్నారు. అందుకు అనుగుణంగానే సిలబస్‌ను తగ్గించి మానసిక పరిణితి పెంచేలా కొత్త తరహాలో బోధనా పద్ధతులు ఉంటాయన్నారు. విమర్శనాత్మకమైన ఆలోచనలు, సృజనాత్మకత, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆసక్తి వంటివి విద్యార్థుల్లో పెంపొందేలా కొత్త సిలబస్ ఉంటుందని చెప్పారు. ఎన్ఈపీపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి విద్యా శాఖ వెబ్‌సైట్‌కి ఇప్పటికే 15 లక్షల సూచనలు వచ్చాయని ప్రధాని మోదీ వెల్లడించారు. అయిదో తరగతి వరకు మాతృభాషలో విద్యా బోధన అత్యంత అవసరమని మోదీ చెప్పారు. -
తెలంగాణలో నూతన విద్యావిధానం
న్యూఢిల్లీ: ప్రస్తుత విద్యావిధానం పూర్తి లోపభూయిష్టంగా ఉందని, పర్యవేక్షణా లోపం, తల్లిదండ్రుల భాగస్వామ్యం లేకపోవడం, కొద్ది మంది టీచర్లలో అంకితభావం కరవడటమే ఇందుకు కారణాలని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. విద్యావిధానంలో చేపట్టవలసిన మార్పులపై అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం ఆయన ఢిల్లీ వచ్చారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం పాఠశాల, కళాశాల, సాంకేతిక విద్యాసంస్థల్లో నెలకొన్న లోపాలను అధిగమించి.. తెలంగాణలో నూతన విద్యావిధానాన్ని అమలుచేయనున్నట్లు శ్రీహరి చెప్పారు. ఇందుకోసం వివిధ వర్గాలనుంచి సలహాలు సూచనలు స్వీకరిస్తున్నామన్నారు. 5వ తరగతి నుంచి 12 తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తామన్నా ఆయన.. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో 1190 గురుకుల పాఠశాలలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. పాఠశాల విద్యావిధానంపై జాతీయస్థాయి సంస్థలైన ఎన్సీఈఆర్టీ, ఎస్సీఈఆర్టీలు సరైన దృష్టిసారించడంలేదన్నారు. -
వచ్చే ఏడాది కొత్త విద్యా విధానం: కేంద్రం
కొచ్చి: కొత్త విద్యా విధానంపై వచ్చే ఏడాది కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభమవుతుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. చర్చలు వచ్చే ఏడాది ప్రారంభమవుతామని, వాటిపై ఒక విధానాన్ని తీసుకురావాల్సి ఉందని శనివారమిక్కడ సీబీఎస్ఈ సహోదయ సదస్సులో చెప్పారు. కొత్త విద్యావిధానం రావడానికి ఏడు నెలల నుంచి మూడేళ్లు పడుతుందన్నారు. ప్రస్తుతం దీని రూపకల్పనలో రాజకీయ నాయకులు, అధికారులు, నిపుణులు ఉన్నారని, అయితే ప్రిన్సిపాళ్లకు, టీచర్లకు, విద్యార్థులకు కూడా చోటు కల్పించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దేశ విదేశాల్లో ఉన్న సీబీఎస్ఈ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, టీచర్లు పాల్గొన్నారు.