తెలంగాణలో నూతన విద్యావిధానం
న్యూఢిల్లీ: ప్రస్తుత విద్యావిధానం పూర్తి లోపభూయిష్టంగా ఉందని, పర్యవేక్షణా లోపం, తల్లిదండ్రుల భాగస్వామ్యం లేకపోవడం, కొద్ది మంది టీచర్లలో అంకితభావం కరవడటమే ఇందుకు కారణాలని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. విద్యావిధానంలో చేపట్టవలసిన మార్పులపై అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం ఆయన ఢిల్లీ వచ్చారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు.
ప్రస్తుతం పాఠశాల, కళాశాల, సాంకేతిక విద్యాసంస్థల్లో నెలకొన్న లోపాలను అధిగమించి.. తెలంగాణలో నూతన విద్యావిధానాన్ని అమలుచేయనున్నట్లు శ్రీహరి చెప్పారు. ఇందుకోసం వివిధ వర్గాలనుంచి సలహాలు సూచనలు స్వీకరిస్తున్నామన్నారు. 5వ తరగతి నుంచి 12 తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తామన్నా ఆయన.. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో 1190 గురుకుల పాఠశాలలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. పాఠశాల విద్యావిధానంపై జాతీయస్థాయి సంస్థలైన ఎన్సీఈఆర్టీ, ఎస్సీఈఆర్టీలు సరైన దృష్టిసారించడంలేదన్నారు.