ఎల్ఐసీ నుంచి కొత్త ఎండోమెంట్ పాలసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) కొత్త ఎండోమెంట్ పాలసీని ప్రవేశపెట్టింది. ‘లిమిటెడ్ పీరియడ్ ఎండోమెంట్ ప్లాన్’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకానికి పరిమిత కాలానికి ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఈ పాలసీ 12, 16, 21 ఏళ్ల కాలపరిమితిలో లభిస్తోంది. పాలసీదారుని అవసరానికి అనుగుణంగా ఇందులో ఒక కాలపరిమితిని ఎంచుకుంటే ప్రీమియంను 8 లేదా 9 ఏళ్లలో చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం చెల్లించే కాలపరిమితిని పాలసీదారుడే నిర్ణయించుకోవచ్చు. కనీస బీమా మొత్తాన్ని రూ. 3 లక్షలుగా నిర్ణయించారు. ఆపైన రూ. 10,000 గుణిజాల్లో గరిష్టంగా ఎంత మొత్తమైనా తీసుకోవచ్చు. 18 ఏళ్ల నుంచి 62 ఏళ్లలోపు వారు ఈ పాలసీ తీసుకోవచ్చు.
ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి 21 ఏళ్లకు పాలసీ తీసుకొని ప్రీమియం చెల్లించే కాలపరిమితిని 8 ఏళ్లుగా ఎంచుకుంటే రూ. 3 లక్షల పాలసీకి రూ. 23,865, అదే తొమ్మిదేళ్లు ఎంచుకుంటే రూ.21,795లు చెల్లించాల్సి ఉంటుంది. తొమ్మిదేళ్లలో సుమారు రూ. 1.96 లక్షలు ప్రీమియం కింద చెల్లిస్తే పాలసీ కాలపరిమితి తర్వాత కనిష్టంగా నాలుగు శాతం రాబడి ప్రకారం చూస్తే సుమారుగా రూ. 3 లక్షలు, అదే గరిష్టంగా 8 శాతం రాబడి ప్రకారం చూస్తే రూ. 5.30 లక్షలు వచ్చే అవకాశం ఉంది. తక్కువ కాలం ప్రీమియం చెల్లించి దీర్ఘకాలం బీమా రక్షణ కావాలనుకునే వారికి ఈ పాలసీ అనువుగా ఉంటుందని ఎల్ఐసీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రధాన పాలసీకి కొంత అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా యాక్సిడెంటల్ బెనిఫిట్, టర్మ్ అష్యూరెన్స్ రైడర్లను పొందవచ్చు.