పరిశ్రమలపైనే ఆశలు
- కొత్త ఫ్యాక్టరీల కోసం ఎదురుచూపులు
- జిల్లాలో ఏర్పాటుకు కేంద్రం అనుమతి
- 4 లక్షల మందికిపైగా ఉపాధికి అవకాశం
- అరకొర పరిశ్రమల స్థాపనతో అందని ఉపాధి
ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో కొత్త పరిశ్రమల ఏర్పాటు కోసం వేలాది మంది నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నిమ్జ్ (నేషనల్ ఇన్విస్ట్మెంట్ జోన్స్) జాతీయ ఉత్పాదక మండలి ద్వారా ఏర్పాటుకు కేంద్రం అనుమతించిన మూడు జిల్లాల్లో ప్రకాశం జిల్లాకు ఇటీవల చోటు దక్కింది. మెదక్, చిత్తూరు జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాను ఎంపిక చేస్తూ గత కేంద్ర మంత్రివర్గం 2013 డిసెంబర్లో ఆమోదించింది.
కనిగిరి, లింగసముద్రం, పామూరు, సీఎస్‌పురం, వీవీపాలెం మండలాల్లో ఐదు వేల హెక్టార్లలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. జాతీయ ఉత్పాదక పెట్టుబడుల మండలి ద్వారా జోన్‌కు రూ.43,500 కోట్లు పెట్టుబడుల రూపంలో తరలివస్తున్నట్లు అంచనా. ఈ పరిశ్రమల ద్వారా జిల్లాలో 2.05 లక్షల మంది ప్రత్యక్షంగా..మరో 2 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి దొరకనుందని తెలియడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. భూములు కూడా సేకరిస్తున్నట్లు వార్తలొచ్చాయి.
అనంతరం వెంటనే ఎన్నికలొచ్చాయి. కేంద్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. అయితే గత ప్రభుత్వం అమలు చేయాలనుకున్న పరిశ్రమల ఏర్పాటుపై యువతలో సందిగ్ధత నెలకొంది. వచ్చిన ప్రభుత్వం నిమ్జ్ ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేస్తుందా లేదా అన్న సందేహం నిరుద్యోగులు వ్యక్తం చేస్తున్నారు.
- జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 33.97 లక్షల మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 18 సంవత్సరాలు పైబడిన యువకులు 15 లక్షల మంది ఉన్నారు. 40 సంవత్సరాలు పైబడిన వారు 10 లక్షల మంది ఉన్నారు.
- జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిశ్రమల కేంద్రం ద్వారా ఏర్పాటు చేసిన 67 భారీ పరిశ్రమలు అంతంత మాత్రంగానే పనిచేస్తున్నాయి. వీటి ద్వారా కేవలం 16,235 మంది మాత్రమే తాత్కాలిక ఉపాధి పొందుతున్నారు. 6,470 చిన్న పరిశ్రమల్లో మరో 25 వేల మందికిపైగా కూలీలు అరకొరగా జీవనం సాగిస్తున్నారు.
- జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్లో 54,629 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. రాజీవ్ యువకిరణాలు పథకం కింద 80,173 మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరుగాక ఏటా వేలాది మంది యువత చదువులు పూర్తయి కళాశాలల నుంచి బయటకు వస్తున్నారు. వీరంతా ఉద్యోగాలు, ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు.
- ఏపీఐఐసీ ద్వారా పట్టణాలకు దగ్గరగా ఉన్న ప్రభుత్వ భూములను తక్కువ ధరకు ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
- సింగరాయకొండ ప్రాంతంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు 16వ నంబర్ జాతీయ రహదారి పక్కన 136 ఎకరాలకు పైగా స్థలాన్ని కేటాయించారు. నామమాత్రపు చెల్లింపులతో ఏపీఐఐసీ దక్కించుకుంది. వీటిలో మొత్తం 110 ప్లాట్లు ఉండగా పనిచేస్తున్నది మాత్రం కేవలం పదహారేనని తెలుస్తోంది. 15 ఏళ్లు గడిచినా పట్టుమని 70 యూనిట్లు ఏర్పాటు చేయలేకపోయారు.
- అదే విధంగా గుళ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌లో అరకొరగా ఏర్పాటు చేసిన పరిశ్రమలు కూడా ఎక్కువ మందికి ఉపాధి చూపించలేకపోతున్నాయి. ఏపీఐఐసీ మొక్కుబడిగా ప్లాట్లు అందజేసి చోద్యం చూస్తోంది.
- ముఖ్యంగా బ్యాంకులు రుణాలు మంజూరు చేయడంలో విముఖత చూపుతున్నాయి. ఫలితంగా నిరుద్యోగులకు ఉపాధి అందని ద్రాక్షే అయింది.
- అయితే ఇప్పుడు కొత్త పరిశ్రమలు వస్తాయన్న ఆశతో వేలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. కొత్త ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసేలా కృషి చేయాలని యువత కోరుతోంది.