న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఒమేగా సైకీ మొబిలిటీ (ఓఎస్‌ఎం) తాజాగా ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ త్రీవీలర్ ప్లాంటును కర్ణాటకలో ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం దాదాపు 250 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,900 కోట్లు) వెచ్చించనున్నట్లు సంస్థ తెలిపింది. 250 ఎకరాల స్థలంలో 10 లక్షల యూనిట్ల వార్షిక సామర్థ్యంతో ఈ ప్లాంటును మూడు దశల్లో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ఈ మెగా ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభం కాగలదని ఒమేగా సైకీ మొబిలిటీ వ్యవస్థాపక చైర్మన్ ఉదయ్ నారంగ్ తెలిపారు.
రేజ్‌ప్లస్ ఫ్రాస్ట్, రేజ్‌ప్లస్ తదితర త్రీ వీలర్లను కొత్త ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. సంఘటిత ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల మార్కెట్ 2020–21తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో 200 శాతం వృద్ధి నమోదు చేసింది. దీంతో మొత్తం త్రిచక్ర వాహనాల అమ్మకాల్లో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల వాటా ఏకంగా 46 శాతం స్థాయికి చేరిందని నారంగ్ వివరించారు. ప్రస్తుతం తమకు 50,000 పైచిలుకు ఆర్డర్లు ఉన్నాయని చెప్పారు. ఆగ్నేయాసియా దేశాలు, ఆఫ్రికా, మధ్య ప్రాచ్య మార్కెట్ల కోసం వాహనాలను మెగా ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేయనున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment