అ‘భయ’ హస్తం
ఖమ్మం: కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పెన్షన్ విధానంతో పింఛను పెరుగుతుందని ఆశించిన అభయహస్తం పెన్షన్ దారులకు నిరాశే ఎదురైంది. ఇతర సామాజిక పెన్షన్లను పెంచుతూ శనివారం నుంచి లబ్ధిదారులకు అందజేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్న అధికారులు అభయ హస్తం పెన్షన్‌పై పెదవి విప్పడం లేదు. దీంతో తనకు పింఛను వస్తుందో రాదో... వస్తే ఎంత వస్తుందో.. ? అని స్పష్టత లేక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పెన్షన్‌తోపాటు, అభయహస్తం పెన్షన్ కూడా అందేలా చూడాలని కోరుతున్నారు.
త్రిశంకుస్వర్గంలో లబ్ధిదారులు...
మహిళలకు చేయూత నివ్వాలని, వారికి ఆర్థిక స్వావలంబన కల్పించాలనే ఆలోచనతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డ్వాక్రా మహిళలకు 2009లో అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు. అదే సంవత్సరం నవంబర్ ఒకటి నుంచి అభయహస్తం పెన్షన్ కింద అర్హులైన వారికి నెలకు రూ.500 చొప్పున చెల్లించారు.
ఇలా జిల్లాలో 18,400 మంది మహిళలు ఈ పెన్షన్ పొందేవారు. అయితే ప్రసుత్తం వితంతు, వృద్ధాప్య, ఇతర వికలాంగులు, గీత, చేనేత, బీడీ కార్మికుల పెన్షన్‌పై స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం అభయహస్తం పెన్షన్‌కు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయలేదు. దీంతో ఈ లబ్ధిదారులకు ఏ పెన్షన్ వస్తుందో.. అసలు వస్తుందో.. రాదో తెలియని పరిస్థితి నెలకొంది.
జమచేసిన డబ్బుల పరిస్థితి ఏమిటి....
అభయహస్తం పెన్షన్ కోసం ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం మహిళలు డబ్బులు జమచేశారు. ఈ పెన్షన్ పొందడానికి డ్వాక్రా మహిళ అయి ఉండాలి. 60 సంవత్సరాలు వచ్చేవరకు సంవత్సరానికి రూ. 365 చొప్పున వారు చెల్లిస్తే దానికి మరో రూ. 365 ప్రభుత్వ వాటాగా జమ చేస్తుంది. 60 సంవత్సరాలు దాటిన తర్వాత నెలకు రూ. 500 పెన్షన్ ఇస్తున్నారు.
ఇలా జిల్లాలో ఉన్న స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రతి సంవత్సరం సుమారు 2.24 లక్షల మంది మహిళలు ఒక్కొక్కరు రూ. 365 చొప్పున అంటే సుమారు రూ. 8,17,60,000 జమ చేస్తున్నట్లు సమాచారం. వీరితోపాటు గతంలో సుమారు రూ. 6.7 కోట్లకు పైగా అభయహస్తం కోసం జమచేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇలా జమ చేస్తే వృద్ధాప్యంలో తమకు అదనపు పెన్షన్ వస్తుందని పైసా పైసా కూడబెట్టుకొని అభయహస్తం వాటా ధనం చెల్లిస్తున్నారు.
అయితే ఇప్పుడు పెన్షన్‌లో ఈ విషయంపై అధికారులను అడిగితే తమకేమీ ఆదేశాలు రాలేదని, తామేమీ చేయలేమని చెప్పడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇందులో వృద్ధాప్య, వితంతు పింఛన్‌కు అర్హత ఉన్నా అభయహస్తం పెన్షన్ వస్తే వాటాధనం కూడా కలిసి వస్తుందని భావించిన మహిళలకు ఇప్పుడు ఉన్న పెన్షన్ కూడా రద్దయ్యే ప్రమాదం ఏర్పడింది. అయితే ఇందులో వృద్ధాప్య, వితంతు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మినహా మిగిలిన వారికి పెన్షన్ వస్తుందో.. రాదో.. అనే సందిగ్ధత ఏర్పడింది.