ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 26వ గవర్నర్‌గా రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాను ప్రభుత్వం నియమించింది. ఆయన పేరును కేబినెట్ నియామకాల కమిటీ ఖరారు చేసింది. బుధవారం మల్హోత్రా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన పదవీ కాలం మూడేళ్లు. ప్రస్తుత గవర్నర్ శక్తికాంతదాస్ మంగళవారం పదవీ విరమణ చేస్తారు.అపార అనుభవం... 56 సంవత్సరాల మల్హోత్రా కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) నుండి కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ పట్టభద్రుడయ్యారు. అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ పట్టా పొందారు. 1990 బ్యాచ్ రాజస్తాన్ కేడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. 33 సంవత్సరాలకు పైగా తన కెరీర్లో విద్యుత్, ఫైనాన్స్, పన్నులు, సమాచార సాంకేతికత, గనులుసహా పలు రంగాలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి (రెవెన్యూ)గా కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఇంతక్రితం ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగంలో కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వ స్థాయిలలో ఆర్థిక, పన్నుల విషయంలో ఆయనకు విస్తృత అనుభవం ఉంది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధాన రూపకల్పనలో అయన కీలక పాత్ర పోషిస్తున్నారు.సమన్వయానికి మారుపేరు... ఉర్జిత్ పటేల్ ఆకస్మిక ని్రష్కమణ తర్వాత 2018 డిసెంబర్ 12న దాస్ ఆర్బీఐ 25వ గవర్నర్‌గా నియమితులయ్యారు. మూడేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత ఆయన పదవీ కాలాన్ని మరో మూడేళ్లు కేంద్రం పొడిగించింది. ఈ పొడిగించిన పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. సెంట్రల్ బ్యాంక్ వద్ద మిగులు నిధుల బదిలీ సమస్యపై ఆర్బీఐ– ప్రభుత్వానికి మధ్య సంఘర్షణ నేపథ్యంలోనే పటేల్ ఆకస్మిక రాజీనామా చోటుచేసుకుందన్న వార్తలు అప్పట్లో వెలువడ్డాయి. ఉర్జిత్ రాజీనామా నేపథ్యంలో అనిశి్చతిని ఎదుర్కొన్న మార్కెట్‌కు తిరిగి విశ్వాసాన్ని అందించిన వ్యక్తిగా శక్తికాంతదాస్ నిలిచారు. పలు క్లిష్ట సందర్భాల్లో కేంద్రం–ఆర్బీఐ మధ్య చక్కటి సమన్వయం సాధించడంలో ఆయన విజయం సాధించారు. ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా పనిచేశారు.