ఆర్బీఐ కొత్త గవర్నర్ నియామకం
న్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్గా ఉర్జిత్ పటేల్ నియమితులయ్యారు. ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ రఘురామ రాజన్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఉర్జిత్ పటేల్ మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. వచ్చే నెల 4న రాజన్ పదవీకాలం ముగియనుంది. ఆ మరుసటి రోజు ఉర్జిత్ ఆర్బీఐ 24వ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించే అవకాశముంది.
52 ఏళ్ల ఉర్జిత్ పటేల్ ప్రస్తుతం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా పనిచేస్తున్నారు. ఉర్జిత్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి బీఏ, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ నుంచి ఎంఫిల్ చేశారు. యేల్ యూనివర్శిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నారు. ఉర్జిత్ కెన్యా పౌరసత్వంతో గతంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో విధులు నిర్వహించారు. 1991-94 మధ్యకాలంలో ఐఎంఎఫ్‌లో పనిచేశారు. 2000-04 మధ్య కేంద్రంలోని పలు కమిటీల్లో పనిచేశారు.