మూడేళ్ల తర్వాత..
నేటినుంచి జెడ్పీ సర్వసభ్య సమావేశాలు
►వరుసగా రెండు రోజులపాటు నిర్వహణ
►‘మన జిల్లా-మన ప్రణాళిక’ ఎజెండా
► మండలాల అనుసంధానానికి ప్రాధాన్యత
►కొత్త పాలకవర్గం తొలి సమావేశం
కరీంనగర్ సిటీ : తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. వరుసగా శుక్ర, శనివారాల్లో ఉదయం 11 గంటల నుంచి చైర్పర్సన్ తుల ఉమ అధ్యక్షతన ఈ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ సదానందం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన ప్రణాళిక చివరి దశ అయిన మన జిల్లా-మన ప్రణాళిక అనే అంశం ఎజెండాగా ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.
జిల్లాలో ఇప్పటికే మన ఊరు-మన ప్రణాళిక, మన మండలం-మన ప్రణాళిక సమావేశాలు పూర్తయినందున, మన జిల్లా-మన ప్రణాళిక కార్యక్రమాన్ని విధిగా నిర్వహించాల్సి వచ్చింది. దీంతో మన జిల్లా-మన ప్రణాళిక అంశంపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నారు. ముందుగా ఈ నెల 26వ తేదీన ఒక్కరోజే సమావేశం నిర్వహించాలని అధికారులు భావించినా, జిల్లా సమస్యలపై కూలంకషంగా చర్చించి, ప్రణాళికలు రూపొందించాలంటే ఒక్క రోజు సమయం సరిపోదని భావించిన జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ సమావేశాలు రెండు రోజులు నిర్వహించాలని నిర్ణయించారు.
మండలాల అనుసంధానానికి ప్రాధాన్యం
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో రెండు, అంతకన్నా ఎక్కువ మండలాలకు సంబంధించిన పనులకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ముఖ్యంగా మండలాలను అనుసంధానం చేస్తూ రోడ్ల నిర్మాణానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా గొలుసుకట్టు చెరువుల నిర్మాణానికి జిల్లా ప్రణాళికలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పచ్చదనాన్ని ప్రోత్సహించేందుకు మొక్కల పెంపకానికి ప్ర ణాళికు రూపొందించనున్నారు. మండలాల ను కలుపుతూ రోడ్ల నిర్మాణం, గొలుసుకట్టు చెరువులు, కుంటల నిర్మాణం, మొక్కల పెం పకం అనే మూడు అంశాలకు జిల్లా ప్రణాళిక లో అధిక ప్రాధాన్యతను కల్పించనున్నారు. ఈ అంశాలపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా చర్చించి జిల్లా ప్రణాళికలో పొందుపరచనున్నారు. వీటితోపాటు అవకాశాలను బట్టి ఇతర సమస్యలపై కూడా చర్చిస్తారు.
మూడు సంవత్సరాల తర్వాత..
మూడు సంవత్సరాల తర్వాత జిల్లా పరిషత్ పాలకవర్గం తెలంగాణ రాష్ట్రంలో సమావేశం కానుంది. 2011 జూలై నుంచి జిల్లా పరిషత్ పాలకవర్గం లేకపోవడంతో సమావేశాలకు అవకాశం లేకుండాపోయింది. ఇటీవల ఎన్నికై న జెడ్పీ పాలకవర్గం కొలువుతీరిన అనంతరం మూడునెలల లోపు ఎప్పుడైనా సమావేశం పె ట్టుకొనే అవకాశం ఉంటుంది. అయితే జిల్లా ప్రణాళిక రూపొందించేందుకు అత్యవసరంగా సమావేశం కావాల్సి వచ్చింది. ప్రయోగాత్మకం గా మూడున్నర సంవత్సరాల క్రితం రెండు రో జుల పాటు సమావేశాలు ఏర్పాటు చేసినా, కాంగ్రెస్, టీడీపీ సభ్యుల నడుమ గొడవతో ఆ సమావేశాలు అనుకున్న లక్ష్యం సాధించలేకపోయాయి. ఈసారి పూర్తిస్థాయి లో చర్చించి నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు.
సభ్యులు, మంత్రులు హాజరు..
జెడ్పీ సర్వసభ్య సమావేశానికి 57 మంది జెడ్పీటీసీలు, 57 మంది ఎంపీపీలు, ఇద్దరు మంత్రులు సహా 13 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉంటారు. డీసీసీబీ, డీసీఎంఎస్, డెయిరీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు ఆహ్వానితులుగా హాజరవుతారు. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ అధ్యక్షతన జరిగే ఈ సమావేశాలకు రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, కె.తారక రామారావు హాజరుకానున్నారు.