New Telugu Film Industry
-
మరో ‘చరిత్ర’కు శ్రీకారం
కొత్త దర్శకనిర్మాతలతో ‘చరిత్ర’ చిత్రానికి అంకురార్పణ * ఆంధ్రోళ్ల పొగరు కావచ్చు.. ఇంకేమైనా కావచ్చు.. తెలంగాణకు సినీ ఇండస్ట్రీ కనెక్ట్ కాలేదని రాంగోపాల్ వర్మ వ్యాఖ్య * ‘తెలుగు న్యూ ఫిల్మ్ ఇండస్ట్రీ’కి కొత్త భాష్యం * ‘సాక్షి’ చర్చాగోష్టికి అనూహ్య స్పందన సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ కరీంనగర్లో ‘న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ’కి అంకురార్పణ చేశారు. తెలంగాణలోని స్థానిక కళాకారుల ప్రతిభను గుర్తించి సొంతంగా సినిమాలు నిర్మించే దిశగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ప్రకటించారు. అందులో భాగంగా కరీంనగర్ జిల్లాలోని ఔత్సాహిక కళాకారులతో ‘చరిత్ర’ అనే సినిమాకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. మంగళవారం కరీంనగర్ సమీపంలోని చల్మెడ ఆనందరావు వైద్యకళాశాల ఆడిటోరియంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కరీంనగర్లో న్యూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ-సాధ్యాసాధ్యాలు’ అనే చర్చాగోష్టిలో రామ్‌గోపాల్‌వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘సినిమా అనేది ఒకరి సొత్తు కాదు. ఫిలిం ఇండస్ట్రీ అంటే రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోలే కాదు. పెద్ద పెద్ద భవనాలు, ల్యాబ్స్‌తో పనిలేదు. అవి కేవలం నిర్మాతలను ఉత్పత్తి చేసుకోవడానికి పనికొచ్చే సాధనాలు. అక్కడ.. ఇక్కడ అనే తేడా లేకుండా రెండు, మూడు కెమెరాలతో ఎక్కడైనా సినిమాలు తీయవచ్చు. చివరకు సెల్‌ఫోన్‌తో కూడా సినిమా తీయవచ్చు’’ అన్నారు. వాస్తవానికి సినిమాలు చూసే ప్రతి ప్రేక్షకుడికీ సినిమా రంగంపై ఆసక్తి, అవగాహన ఉంటుందన్నారు. తాను కూడా సినిమా చూసి, నేర్చుకొని దర్శకుడినయ్యానని తెలిపారు. తెలంగాణ నుంచి సినిమా తీస్తున్న వారికి తన సంపూర్ణ సహకారం అందిస్తానని ఆర్జీవీ హామీ ఇచ్చారు. వాస్తవానికి 30 యేళ్ల క్రితం చెన్నై నుంచి హైదరాబాద్‌కు ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఈ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం లేదని, ప్రస్తుత డిజిటల్ యుగంలో సెల్ఫోన్లో సినిమా తీసుకునే అవకాశముందని అన్నారు. సినిమా ఇండస్ట్రీ ఫలానా చోటనే ఉండాలనే వాదనను కూడా వర్మ కొట్టిపారేశారు. ‘‘టెక్నాలజీ పెరిగాక ఇండస్ట్రీఒక చోట పరిమితం కాదు. సినిమా రంగంలో ఉన్న ఆంధ్రోళ్ల పొగరు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు.. హైదరాబాద్‌లో ఉండి ఆంధ్రా వైపు మాత్రమే చూడడం వల్ల కరీంనగర్‌కు కనెక్ట్ కాలేకపోయాం. ఆంధ్రోళ్లకు సినీ ఇండస్ట్రీకి ఉన్న సంబంధాలవల్ల ప్రతిభ లేనోళ్లు కూడా కళాకారులయ్యారు’’అని వ్యాఖ్యానించారు. కనెక్షన్, కరప్షన్ లేని కరీంనగర్ న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏర్పాటుకు సంబంధించి కరీంనగర్ జిల్లాను మాత్రమే ఎంపిక చేయడానికి గల కారణాలను వర్మ వివరించారు. ‘‘సినిమా ఇండస్ట్రీకి, కరీంనగర్‌కు కనెక్షన్ లేదు. కాబట్టి కరప్షన్ లేకుండా అసలు సిసలైన కళాకారులు బయటకు వస్తారనే ఉద్దేశంతోనే న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇక్కడి నుంచే శ్రీకారం చుడుతున్నా’’ అని వ్యాఖ్యానించారు. గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని కేవలం రూ.5 లక్షల బడ్జెట్‌తో అతి తక్కువ సమయంలో సినిమా తీసే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా సాధారణ కెమెరాలు, సెల్‌ఫోన్ సాయంతో ఒకే ఒక్క కంప్యూటర్ను ఉపయోగించి అతి తక్కువ ఖర్చుతో తీసిన ఓ సినిమా ప్రివ్యూను 15 నిమిషాలపాటు వేదికపైనే ప్రదర్శించారు. అనంతరం మాట్లాడుతూ ‘కరీంనగర్లో ఫిల్మ్ ఇండస్ట్రీ కొందరికే సాధ్యమనే విషయాన్ని ఇకపై మర్చిపోండి. జిల్లాలో ఫిల్మ్ ఇండస్ట్రీ పెడితే స్థానిక కళాకారులకే ఎక్కువగా అవకాశం దక్కుతుంది. అందరూ భాగస్వాములై ఇక్కడి యదార్థ కథలను తక్కువ ఖర్చుతో తెరకెక్కించండి. తద్వారా ప్రాంతీయత కూడా కళ్లకు కట్టినట్లు కనబడుతుంది. సంస్కృతీ సంప్రదాయాలు వెల్లివిరుస్తాయి. నాది, నావూరు అని ఫీల్ అయి మీ ఊళ్లోనే సినిమా మొదలు పెట్టండి. సినిమా తీసిన తర్వాత ఆడకపోతే మళ్లీ మళ్లీ ప్రయత్నించండి. ఆరోగ్యకరమైన పోటీతత్వంతో ముందుకెళ్లండి. మంచి ఐడియాతో సినిమా తీస్తే ప్రపంచం మొత్తం చూస్తుం ది. ఇండస్ట్రీ నిర్మాణం అనేది ఒకరు చేసేది కాదు. మన మైండ్‌సెట్‌ను బట్టే ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంటుం ది. మన కోసం మనమే నెలకొల్పేదే ఫిల్మ్ ఇండస్ట్రీ’ అని అన్నారు. కార్యక్రమానికి హాజరైన కళాకారుల జోష్‌ను గమనించిన వర్మ ప్రతిభ ఉన్న వారికి ప్రోత్సాహం అందిస్తానని, ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రసంగం అనంతరం అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు వేదిక పైనుంచే తనదైన శైలిలో సమాధానాలిస్తూ నూతనోత్సాహం నింపారు. ఈ కార్యక్రమాన్ని నేడు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్య ‘సాక్షి టీవీ’ ‘బ్రేక్‌ఫాస్ట్ షో’లో వీక్షించవచ్చు -
కరీంనగర్లో రాంగోపాల్ వర్మ సినీ ఇండస్ట్రీ!
కరీంనగర్ : సినిమా రంగానికి కరీంనగర్ వేదిక కాబోతుందా...? జిల్లాలో 'న్యూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ' స్థాపనకు బీజాలు పడబోతున్నాయా...? సంచలనాలకు మారుపేరుగా నిలిచిన ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలు నిజమేనని చెబుతున్నాయి. ప్రపంచమే కుగ్రామంగా మారిన ఆధునిక యుగంలో హైదరాబాద్, ముంబయి, చెన్నైలాంటి మహానగరాల్లోనే కాకుండా ఎక్కడైనా సినిమాను నిర్మించవచ్చని వర్మ చెబుతున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలో న్యూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ' ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న వర్మ మంగళవారం కరీంనగర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా 'సాక్షి' ఆధ్వర్యంలో చల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాల ఆడిటోరియం వేదికగా 'కరీంనగర్లో ఫిలిం ఇండస్ట్రీ-సాధ్యాసాధ్యాలు' అనే అంశంపై చర్చాగోష్టి చేపట్టారు. సినీరంగానికి సంబంధించి 24 అంశాలపై వర్మ సూచనలు ఇవ్వనున్నారు. ప్రశ్నలుఎన్నైనా వర్మ ఒక్కరే సమాధానం ఇవ్వనున్నారు. -
కరీంనగర్లో ఫిలిం ఇండస్ట్రీ
* సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ ప్రకటన * తెలంగాణ ఉద్యమ పురిటి గడ్డకు 18న రాక * ఔత్సాహికులను ప్రోత్సహించే దిశగా అడుగులు * ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఎస్సారార్కళాశాల వేదికగా చర్చాగోష్టి శాతవాహన యూనివర్సిటీ : సినిమా రంగమంటేనే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది హైదరాబాద్, ముంబయి, చెన్నై. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా ఏర్పడ్డాక కూడా సినీ పెద్దల చూపు విజయవాడ, వైజాగ్లవైపే పడుతోంది. అందరికీ భిన్నంగా ఆలోచిస్తూ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ మాత్రం కరీంనగర్లో సినీ పరిశ్రమను ఏర్పాటుపై దృష్టి సారించారు. సాంకేతిక రంగంలో శరవేగంగా దూసుకుపోతున్న నేటికాలంలో ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్‌గా మారిన తరుణంలో చిత్ర పరిశ్రమ ఇంకా హైదారాబాద్, ముంబయి మీదే ఆధారపడాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ ఉద్యమ పురిటగడ్డ కరీంనగర్లో ‘న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ’ని ఏర్పాటు చేయాలని వర్మ భావిస్తున్నారు. ఒక ప్రాంతంలో ఎలాంటి సంబంధాలు, పరిచయాలు లేకపోయినా సినిమా నిర్మాణం చేసి దానిని ఎలా రిలీజ్ చేయవచ్చో వివరించేందుకు ఆయన సిద్ధమయ్యారు. అందుకు జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలను వేదికగా చేసుకున్నారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో కళాశాల వేదికగా ‘కరీంనగర్లో ఫిలిం ఇండస్ట్రీ-సాధ్యాసాధ్యాలు’ అనే అంశంపై ఈ నెల 18న ఉదయం 11 గంటలకు చర్చాగోష్టి నిర్వహించనున్నారు. సినిమా రంగంలో రాణించాలనే ఆసక్తి గలవారు ఈ సందర్భంగా రాంగోపాల్‌వర్మను కలిసే అవకాశాన్ని పొందవచ్చు. సినీ రంగంపై ఆసక్తి, అనుభవం, సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు, గతంలో షార్ట్‌ఫిల్మ్ చేసినవారు, సినిమా గేయాలు, రచనలు చేసినవారు, ఆసక్తి ఉండి అవకాశం కోసం ఎదురుచూసే ఔత్సాహికులెవరైనా తమ బయోడేటాను ‘సాక్షి’ జిల్లా కార్యాలయానికి పంపవచ్చు. పూర్తి వివరాలకు 92480 20207, 90100 31916, 85238 61961 నంబర్లలో సంప్రదించవచ్చు.