మరో ‘చరిత్ర’కు శ్రీకారం | ram gopalvarma Initiated to New Telugu Film Industry | Sakshi
Sakshi News home page

మరో ‘చరిత్ర’కు శ్రీకారం

Published Wed, Nov 19 2014 1:47 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

మరో ‘చరిత్ర’కు శ్రీకారం - Sakshi

మరో ‘చరిత్ర’కు శ్రీకారం

కొత్త దర్శకనిర్మాతలతో ‘చరిత్ర’ చిత్రానికి అంకురార్పణ

* ఆంధ్రోళ్ల పొగరు కావచ్చు.. ఇంకేమైనా కావచ్చు.. తెలంగాణకు సినీ ఇండస్ట్రీ కనెక్ట్ కాలేదని రాంగోపాల్ వర్మ వ్యాఖ్య
* ‘తెలుగు న్యూ ఫిల్మ్ ఇండస్ట్రీ’కి కొత్త భాష్యం
* ‘సాక్షి’ చర్చాగోష్టికి అనూహ్య స్పందన

 
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ కరీంనగర్‌లో ‘న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ’కి అంకురార్పణ చేశారు. తెలంగాణలోని స్థానిక కళాకారుల ప్రతిభను గుర్తించి సొంతంగా సినిమాలు నిర్మించే దిశగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ప్రకటించారు. అందులో భాగంగా కరీంనగర్ జిల్లాలోని ఔత్సాహిక కళాకారులతో ‘చరిత్ర’ అనే సినిమాకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. మంగళవారం కరీంనగర్ సమీపంలోని చల్మెడ ఆనందరావు వైద్యకళాశాల ఆడిటోరియంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కరీంనగర్‌లో న్యూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ-సాధ్యాసాధ్యాలు’ అనే చర్చాగోష్టిలో రామ్‌గోపాల్‌వర్మ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘సినిమా అనేది ఒకరి సొత్తు కాదు. ఫిలిం ఇండస్ట్రీ అంటే రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోలే కాదు. పెద్ద పెద్ద భవనాలు, ల్యాబ్స్‌తో పనిలేదు. అవి కేవలం నిర్మాతలను ఉత్పత్తి చేసుకోవడానికి పనికొచ్చే సాధనాలు. అక్కడ.. ఇక్కడ అనే తేడా లేకుండా రెండు, మూడు కెమెరాలతో ఎక్కడైనా సినిమాలు తీయవచ్చు. చివరకు సెల్‌ఫోన్‌తో కూడా సినిమా తీయవచ్చు’’ అన్నారు. వాస్తవానికి సినిమాలు చూసే ప్రతి ప్రేక్షకుడికీ సినిమా రంగంపై ఆసక్తి, అవగాహన ఉంటుందన్నారు.

తాను కూడా సినిమా చూసి, నేర్చుకొని దర్శకుడినయ్యానని తెలిపారు. తెలంగాణ నుంచి సినిమా తీస్తున్న వారికి తన సంపూర్ణ సహకారం అందిస్తానని ఆర్జీవీ హామీ ఇచ్చారు. వాస్తవానికి 30 యేళ్ల క్రితం చెన్నై నుంచి హైదరాబాద్‌కు ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఈ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం లేదని, ప్రస్తుత డిజిటల్ యుగంలో సెల్‌ఫోన్‌లో సినిమా తీసుకునే అవకాశముందని అన్నారు. సినిమా ఇండస్ట్రీ ఫలానా చోటనే ఉండాలనే వాదనను కూడా వర్మ కొట్టిపారేశారు. ‘‘టెక్నాలజీ పెరిగాక ఇండస్ట్రీఒక చోట పరిమితం కాదు. సినిమా రంగంలో ఉన్న ఆంధ్రోళ్ల పొగరు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు.. హైదరాబాద్‌లో ఉండి ఆంధ్రా వైపు మాత్రమే చూడడం వల్ల కరీంనగర్‌కు కనెక్ట్ కాలేకపోయాం. ఆంధ్రోళ్లకు సినీ ఇండస్ట్రీకి ఉన్న సంబంధాలవల్ల ప్రతిభ లేనోళ్లు కూడా కళాకారులయ్యారు’’అని వ్యాఖ్యానించారు.

కనెక్షన్, కరప్షన్ లేని కరీంనగర్
న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏర్పాటుకు సంబంధించి కరీంనగర్ జిల్లాను మాత్రమే ఎంపిక చేయడానికి గల కారణాలను వర్మ వివరించారు. ‘‘సినిమా ఇండస్ట్రీకి, కరీంనగర్‌కు కనెక్షన్ లేదు. కాబట్టి కరప్షన్ లేకుండా అసలు సిసలైన కళాకారులు బయటకు వస్తారనే ఉద్దేశంతోనే న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇక్కడి నుంచే శ్రీకారం చుడుతున్నా’’ అని వ్యాఖ్యానించారు. గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని కేవలం రూ.5 లక్షల బడ్జెట్‌తో అతి తక్కువ సమయంలో సినిమా తీసే అవకాశం ఉందన్నారు.

ఈ సందర్భంగా సాధారణ కెమెరాలు, సెల్‌ఫోన్ సాయంతో ఒకే ఒక్క కంప్యూటర్‌ను ఉపయోగించి అతి తక్కువ ఖర్చుతో తీసిన ఓ సినిమా ప్రివ్యూను 15 నిమిషాలపాటు వేదికపైనే ప్రదర్శించారు. అనంతరం మాట్లాడుతూ ‘కరీంనగర్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీ కొందరికే సాధ్యమనే విషయాన్ని ఇకపై మర్చిపోండి. జిల్లాలో ఫిల్మ్ ఇండస్ట్రీ పెడితే స్థానిక కళాకారులకే ఎక్కువగా అవకాశం దక్కుతుంది. అందరూ భాగస్వాములై ఇక్కడి  యదార్థ కథలను తక్కువ ఖర్చుతో తెరకెక్కించండి. తద్వారా ప్రాంతీయత కూడా కళ్లకు కట్టినట్లు కనబడుతుంది. సంస్కృతీ సంప్రదాయాలు వెల్లివిరుస్తాయి. నాది, నావూరు అని ఫీల్ అయి మీ ఊళ్లోనే సినిమా మొదలు పెట్టండి. సినిమా తీసిన తర్వాత ఆడకపోతే మళ్లీ మళ్లీ ప్రయత్నించండి. ఆరోగ్యకరమైన పోటీతత్వంతో ముందుకెళ్లండి.

మంచి ఐడియాతో సినిమా తీస్తే ప్రపంచం మొత్తం చూస్తుం ది. ఇండస్ట్రీ నిర్మాణం అనేది ఒకరు చేసేది కాదు. మన మైండ్‌సెట్‌ను బట్టే ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంటుం ది. మన కోసం మనమే నెలకొల్పేదే ఫిల్మ్ ఇండస్ట్రీ’ అని అన్నారు. కార్యక్రమానికి హాజరైన కళాకారుల జోష్‌ను గమనించిన వర్మ ప్రతిభ ఉన్న వారికి ప్రోత్సాహం అందిస్తానని, ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రసంగం అనంతరం అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు వేదిక పైనుంచే తనదైన శైలిలో సమాధానాలిస్తూ నూతనోత్సాహం నింపారు.
 
ఈ కార్యక్రమాన్ని నేడు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్య ‘సాక్షి టీవీ’ ‘బ్రేక్‌ఫాస్ట్ షో’లో వీక్షించవచ్చు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement