ram gopalvarma
-
'వర్మ సార్‌తో పనిచేయడం నా అదృష్టం'
చెన్నై: బీరువా సినిమా డెబ్యూ హీరోయిన్ 'సురభి'... దర్శకుడు రామ్ గోపాల్ వర్మను పొగడ్తలతో ముంచెత్తుతోంది. రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం ఎటాక్ లో హీరోయిన్ గా నటిస్తున్న ఆమె .. వర్మ సార్ తో పనిచేయడం తన అదృష్టమంటూ తెగ సంబరపడిపోతోంది. బీరువా సినిమాలో్ తన నటన చూసి ఇంప్రెస్ అయ్యి..తనకు ఈ అవకాశం ఇచ్చారని ఆమె పొంగిపోతోంది. అంతేకాదు..."ఇప్పటిదాకా అందమైన, అమాయకమైన పక్కింటి అమ్మాయి పాత్ర ల్లో చూసిన తనను ఇకముందు డిఫరెంటు గెటప్స్ లో చూస్తారు.. నాలో ఇంకో కోణాన్ని చూస్తారంటూ ఊరిస్తోంది. ఎటాక్ చిత్రంలో తన క్యారెక్టర్ గురించి చెబుతూ కార్లను రిపేర్ చేసే మెకానిక్ పాత్రలో రౌడీలాగా వెరైటీగా కనిస్తానంటోంది'' సురభి. జగపతిబాబు, మంచు మనోజ్ లాంటి సీనియర్ నటులతో నటించడం చాలా సంతోషంగా ఉందంటోంది. గ్లామరస్ పాత్రల్లో హీరోయిన్లను దోచుకుంటాడన్న ఆరోపణలను ఖండిస్తోంది ఈ యువనటి. రాంగోపాల్ వర్మ హీరోయన్లను ఎంత సెక్సీగా చూపిస్తాడో అంత అందంగానూ ప్రొజెక్ట్ చేస్తారంటోంది. ఆయన ఆడవాళ్ళను ప్రేమిస్తారు, హీరోయిన్లను ఒక పెయింటింగ్ లాగా చూసుకుంటారని చెప్పుకొచ్చింది. రంగీలా సినిమా అప్పటినుంచి తాను వర్మ అభిమానినని వెల్లడించింది ఈ బీరువా భామ. ఆయనతో చేసిన ఫోటో షూట్ ను చాలా ఎంజాయ్ చేశానని.. తెరమీద తను ఎంత అందంగా ఉన్నానో చూడాలని ఆరాటంగా ఉందంటూ మురిసిపోతోంది. హీరోయిన్లను తెరమీద అందంగా ఎలా చూపించాలో ఆయనకు బాగా తెలుసంటూ తెగ కితాబులిస్తోంది. ప్రస్తుతం సురభి ఒక తమిళ సినిమాలో కూడా చేస్తోంది. -
మరో ‘చరిత్ర’కు శ్రీకారం
కొత్త దర్శకనిర్మాతలతో ‘చరిత్ర’ చిత్రానికి అంకురార్పణ * ఆంధ్రోళ్ల పొగరు కావచ్చు.. ఇంకేమైనా కావచ్చు.. తెలంగాణకు సినీ ఇండస్ట్రీ కనెక్ట్ కాలేదని రాంగోపాల్ వర్మ వ్యాఖ్య * ‘తెలుగు న్యూ ఫిల్మ్ ఇండస్ట్రీ’కి కొత్త భాష్యం * ‘సాక్షి’ చర్చాగోష్టికి అనూహ్య స్పందన సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ కరీంనగర్లో ‘న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ’కి అంకురార్పణ చేశారు. తెలంగాణలోని స్థానిక కళాకారుల ప్రతిభను గుర్తించి సొంతంగా సినిమాలు నిర్మించే దిశగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ప్రకటించారు. అందులో భాగంగా కరీంనగర్ జిల్లాలోని ఔత్సాహిక కళాకారులతో ‘చరిత్ర’ అనే సినిమాకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. మంగళవారం కరీంనగర్ సమీపంలోని చల్మెడ ఆనందరావు వైద్యకళాశాల ఆడిటోరియంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కరీంనగర్లో న్యూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ-సాధ్యాసాధ్యాలు’ అనే చర్చాగోష్టిలో రామ్‌గోపాల్‌వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘సినిమా అనేది ఒకరి సొత్తు కాదు. ఫిలిం ఇండస్ట్రీ అంటే రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోలే కాదు. పెద్ద పెద్ద భవనాలు, ల్యాబ్స్‌తో పనిలేదు. అవి కేవలం నిర్మాతలను ఉత్పత్తి చేసుకోవడానికి పనికొచ్చే సాధనాలు. అక్కడ.. ఇక్కడ అనే తేడా లేకుండా రెండు, మూడు కెమెరాలతో ఎక్కడైనా సినిమాలు తీయవచ్చు. చివరకు సెల్‌ఫోన్‌తో కూడా సినిమా తీయవచ్చు’’ అన్నారు. వాస్తవానికి సినిమాలు చూసే ప్రతి ప్రేక్షకుడికీ సినిమా రంగంపై ఆసక్తి, అవగాహన ఉంటుందన్నారు. తాను కూడా సినిమా చూసి, నేర్చుకొని దర్శకుడినయ్యానని తెలిపారు. తెలంగాణ నుంచి సినిమా తీస్తున్న వారికి తన సంపూర్ణ సహకారం అందిస్తానని ఆర్జీవీ హామీ ఇచ్చారు. వాస్తవానికి 30 యేళ్ల క్రితం చెన్నై నుంచి హైదరాబాద్‌కు ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఈ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం లేదని, ప్రస్తుత డిజిటల్ యుగంలో సెల్ఫోన్లో సినిమా తీసుకునే అవకాశముందని అన్నారు. సినిమా ఇండస్ట్రీ ఫలానా చోటనే ఉండాలనే వాదనను కూడా వర్మ కొట్టిపారేశారు. ‘‘టెక్నాలజీ పెరిగాక ఇండస్ట్రీఒక చోట పరిమితం కాదు. సినిమా రంగంలో ఉన్న ఆంధ్రోళ్ల పొగరు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు.. హైదరాబాద్‌లో ఉండి ఆంధ్రా వైపు మాత్రమే చూడడం వల్ల కరీంనగర్‌కు కనెక్ట్ కాలేకపోయాం. ఆంధ్రోళ్లకు సినీ ఇండస్ట్రీకి ఉన్న సంబంధాలవల్ల ప్రతిభ లేనోళ్లు కూడా కళాకారులయ్యారు’’అని వ్యాఖ్యానించారు. కనెక్షన్, కరప్షన్ లేని కరీంనగర్ న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏర్పాటుకు సంబంధించి కరీంనగర్ జిల్లాను మాత్రమే ఎంపిక చేయడానికి గల కారణాలను వర్మ వివరించారు. ‘‘సినిమా ఇండస్ట్రీకి, కరీంనగర్‌కు కనెక్షన్ లేదు. కాబట్టి కరప్షన్ లేకుండా అసలు సిసలైన కళాకారులు బయటకు వస్తారనే ఉద్దేశంతోనే న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇక్కడి నుంచే శ్రీకారం చుడుతున్నా’’ అని వ్యాఖ్యానించారు. గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని కేవలం రూ.5 లక్షల బడ్జెట్‌తో అతి తక్కువ సమయంలో సినిమా తీసే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా సాధారణ కెమెరాలు, సెల్‌ఫోన్ సాయంతో ఒకే ఒక్క కంప్యూటర్ను ఉపయోగించి అతి తక్కువ ఖర్చుతో తీసిన ఓ సినిమా ప్రివ్యూను 15 నిమిషాలపాటు వేదికపైనే ప్రదర్శించారు. అనంతరం మాట్లాడుతూ ‘కరీంనగర్లో ఫిల్మ్ ఇండస్ట్రీ కొందరికే సాధ్యమనే విషయాన్ని ఇకపై మర్చిపోండి. జిల్లాలో ఫిల్మ్ ఇండస్ట్రీ పెడితే స్థానిక కళాకారులకే ఎక్కువగా అవకాశం దక్కుతుంది. అందరూ భాగస్వాములై ఇక్కడి యదార్థ కథలను తక్కువ ఖర్చుతో తెరకెక్కించండి. తద్వారా ప్రాంతీయత కూడా కళ్లకు కట్టినట్లు కనబడుతుంది. సంస్కృతీ సంప్రదాయాలు వెల్లివిరుస్తాయి. నాది, నావూరు అని ఫీల్ అయి మీ ఊళ్లోనే సినిమా మొదలు పెట్టండి. సినిమా తీసిన తర్వాత ఆడకపోతే మళ్లీ మళ్లీ ప్రయత్నించండి. ఆరోగ్యకరమైన పోటీతత్వంతో ముందుకెళ్లండి. మంచి ఐడియాతో సినిమా తీస్తే ప్రపంచం మొత్తం చూస్తుం ది. ఇండస్ట్రీ నిర్మాణం అనేది ఒకరు చేసేది కాదు. మన మైండ్‌సెట్‌ను బట్టే ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంటుం ది. మన కోసం మనమే నెలకొల్పేదే ఫిల్మ్ ఇండస్ట్రీ’ అని అన్నారు. కార్యక్రమానికి హాజరైన కళాకారుల జోష్‌ను గమనించిన వర్మ ప్రతిభ ఉన్న వారికి ప్రోత్సాహం అందిస్తానని, ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రసంగం అనంతరం అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు వేదిక పైనుంచే తనదైన శైలిలో సమాధానాలిస్తూ నూతనోత్సాహం నింపారు. ఈ కార్యక్రమాన్ని నేడు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్య ‘సాక్షి టీవీ’ ‘బ్రేక్‌ఫాస్ట్ షో’లో వీక్షించవచ్చు -
క్లాప్ కొట్టినా చప్పుడు రాలేదు..!
‘చిరు’ ఖాతాలో ఏడు సినిమాలు మైనస్ చాలా ఏళ్ల పాటు నంబర్‌వన్‌గా వెలుగొందిన చిరంజీవి కెరీర్లో ఏడు ఆగిపోయిన సినిమాలు ఉన్నాయంటే కొంచెం షాకింగ్‌గానే అనిపిస్తుంది. కెరీర్ తొలినాళ్లలో ఆయన చేసిన మూడు సినిమాలు బాక్సుల్లోనే ఉండిపోయాయి. మెగాస్టార్‌గా విరాజిల్లుతున్న సమయంలో కూడా నాలుగు సినిమాలు అర్ధంతరంగా ఆగిపోవడం ఆశ్చర్యకరం. 1979లో యు.వి.బాబు దర్శకత్వంలో వచ్చిన ‘శాంతి నివాస్’లో చిరంజీవి విలన్‌గా యాక్ట్ చేశారు. సెన్సార్ కూడా పూర్తయిన ఈ సినిమా దాదాపు ల్యాబ్‌లోనే మగ్గిపోయింది. తర్వాత ప్రింట్ కూడా మాయమైపోయింది. ‘ఖైదీ’ విడుదల కాకముందు చిరంజీవి హీరోగా చేసిన ‘పెద్దపులి - చిన్నపులి’, ‘వడ్డీకాసుల వాడు’ చిత్రాల పరిస్థితి కూడా అంతే. బాక్సులకే పరిమితం. చిత్రమేమిటంటే - ఎప్పుడూ లేనిది శ్రీదేవి నిర్మాతగా 1987లో ‘వజ్రాల దొంగ’ అనే సినిమా మొదలెట్టారు. అందులో చిరంజీవి హీరో. ఎ. కోదండరామిరెడ్డి దర్శకుడు. చిరంజీవి, శ్రీదేవిపై ఒకే ఒక్క పాట తీశారు. ఆ తర్వాత మళ్లీ వజ్రాల దొంగ కనబడనే కనబడలేదు. ఒక మూమెంట్లో రామ్‌గోపాల్‌వర్మ అంటే యమా క్రేజ్. వర్మతో సినిమా చేయాలని అనుకోని హీరోనే లేడు. చిరంజీవి కూడా అలానే అనుకున్నారు. వీళ్లిద్దర్నీ అశ్వనీదత్ కలిపారు. చిరంజీవి, ఊర్మిళపై ఓ పాట, చాలా సీన్లు తీశారు. ఆ సినిమా పేరు ‘చీకటి’. ఎవరి అహం దెబ్బతిందో కానీ, ఆ సినిమా చీకట్లో కలిసిపోయింది. సింగీతం దర్శకత్వంలో మొదలైన ‘భూలోకవీరుడు’ చివరి వరకూ వీరత్వం చూపలేకపోయింది. చిరంజీవి, టబుపై ఓ పాట, కొన్ని సీన్లు తీశారంతే. 1999లో చిరంజీవికి ఓ హాలీవుడ్ చాన్సు వచ్చింది. ‘ది రిటర్న్స్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్’ పేరుతో మొదలుపెట్టిన సినిమా ఓ షెడ్యూల్‌తోనే ఆగిపోయింది. బాలయ్యకు మూడు బ్యాడ్ మెమరీస్ ఓ జానపదం... ఓ పౌరాణికం... ఓ త్రీడీ. బాలకృష్ణ కెరీర్లో అవి మైలురాళ్లుగా నిలిచిపోతాయనుకుంటే, శంకుస్థాపన రాళ్లలాగా మిగిలిపోయాయి. 1989 ప్రాంతంలో ‘శపథం’ అనే త్రీడీ సినిమా మొదలైనట్టే మొదలై ఆగిపోయింది. బాలకృష్ణ-కోడి రామకృష్ణ కాంబినేషన్లో మంగమ్మగారి మనవడు, ముద్దుల మావయ్యలాంటి బ్లాక్ బస్టర్స్ తీసిన భార్గవ్ ఆర్ట్స్ గోపాల్‌రెడ్డి 2001లో భారీ ఎత్తున ‘విజయ ప్రతాప్’ అనే జానపద సినిమా మొదలుపెట్టారు. పూజా భాత్రా, అంజలా జవేరి, రోజా కథానాయికలు. ఒక పాట, కొన్ని సీన్లు తీశారు. తర్వాత వైజాగ్‌లో ప్రాచీన నగరం సెట్ వేసి ఓ షెడ్యూలు చేశారు. ఆ తర్వాత హఠాత్తుగా సినిమా ఆగిపోయింది. బాలకృష్ణ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌లాగా మొదలుపెట్టిన ‘నర్తనశాల’ పరిస్థితీ అంతే. బాలకృష్ణ ఫస్ట్ టైమ్ డెరైక్షన్. కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారు. ద్రౌపది పాత్ర చేస్తున్న సౌందర్య అకాల మృతి చెందడం, ఇతర కారణాల కారణంగా ‘నర్తనశాల’కు అక్కడితో శుభం కార్డు పడిపోయింది. మళ్లీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని ఆ మధ్య వార్తలొచ్చాయి కానీ, ఆ కదలికే లేదు. ల్యాబ్‌లో ఉండిపోయిన కృష్ణ సినిమా ‘సూపర్‌స్టార్’ పేరుతో కృష్ణ ఓ సినిమా చేశారు. అయితే అది విడుదలకు నోచుకోలేదు. ఆదుర్తి సుబ్బారావు శిష్యుడు కాసుల గురుదేవప్రసాద్ ‘సూపర్‌స్టార్’ పేరుతో ఓ బాలల సినిమా చేశారు. అందులో హీరో కృష్ణతో ఓ గెస్ట్ కేరెక్టర్ చేయించారు. 1990 ఏప్రిల్‌లో షూటింగ్ మొదలు పెట్టారు. ‘శ్రుతిలయలు’ ఫేమ్ షణ్ముఖ శ్రీనివాస్ అందులో మెయిన్‌రోల్. విజయశాంతి కూడా ఓ సన్నివేశంలో అతిథిగా చేశారు. ఆడియో కూడా విడుదలైంది. అయితే సినిమా విడుదలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇప్పటికీ ప్రసాద్ ల్యాబ్‌లో నెగిటివ్ భద్రంగా ఉంది.