క్లాప్ కొట్టినా చప్పుడు రాలేదు..! | cinema shooting started but not released | Sakshi
Sakshi News home page

క్లాప్ కొట్టినా చప్పుడు రాలేదు..!

Published Sun, Jan 19 2014 2:49 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

క్లాప్ కొట్టినా చప్పుడు రాలేదు..! - Sakshi

క్లాప్ కొట్టినా చప్పుడు రాలేదు..!

 ‘చిరు’ ఖాతాలో ఏడు సినిమాలు మైనస్
 చాలా ఏళ్ల పాటు నంబర్‌వన్‌గా వెలుగొందిన చిరంజీవి కెరీర్‌లో ఏడు ఆగిపోయిన సినిమాలు ఉన్నాయంటే కొంచెం షాకింగ్‌గానే అనిపిస్తుంది. కెరీర్ తొలినాళ్లలో ఆయన చేసిన మూడు సినిమాలు బాక్సుల్లోనే ఉండిపోయాయి. మెగాస్టార్‌గా విరాజిల్లుతున్న సమయంలో కూడా నాలుగు సినిమాలు అర్ధంతరంగా ఆగిపోవడం ఆశ్చర్యకరం.

1979లో యు.వి.బాబు దర్శకత్వంలో వచ్చిన ‘శాంతి నివాస్’లో చిరంజీవి విలన్‌గా యాక్ట్ చేశారు. సెన్సార్ కూడా పూర్తయిన ఈ సినిమా దాదాపు ల్యాబ్‌లోనే మగ్గిపోయింది. తర్వాత ప్రింట్ కూడా మాయమైపోయింది. ‘ఖైదీ’ విడుదల కాకముందు చిరంజీవి హీరోగా చేసిన ‘పెద్దపులి - చిన్నపులి’, ‘వడ్డీకాసుల వాడు’ చిత్రాల పరిస్థితి కూడా అంతే. బాక్సులకే పరిమితం. చిత్రమేమిటంటే - ఎప్పుడూ లేనిది శ్రీదేవి నిర్మాతగా 1987లో ‘వజ్రాల దొంగ’ అనే సినిమా మొదలెట్టారు.

 అందులో చిరంజీవి హీరో. ఎ. కోదండరామిరెడ్డి దర్శకుడు.  చిరంజీవి, శ్రీదేవిపై ఒకే ఒక్క పాట తీశారు. ఆ తర్వాత మళ్లీ వజ్రాల దొంగ కనబడనే కనబడలేదు. ఒక మూమెంట్లో రామ్‌గోపాల్‌వర్మ అంటే యమా క్రేజ్. వర్మతో సినిమా చేయాలని అనుకోని హీరోనే లేడు. చిరంజీవి కూడా అలానే అనుకున్నారు. వీళ్లిద్దర్నీ అశ్వనీదత్ కలిపారు. చిరంజీవి, ఊర్మిళపై ఓ పాట, చాలా సీన్లు తీశారు. ఆ సినిమా పేరు ‘చీకటి’. ఎవరి అహం దెబ్బతిందో కానీ, ఆ సినిమా చీకట్లో కలిసిపోయింది.

 సింగీతం దర్శకత్వంలో మొదలైన ‘భూలోకవీరుడు’ చివరి వరకూ వీరత్వం చూపలేకపోయింది. చిరంజీవి, టబుపై ఓ పాట, కొన్ని సీన్లు తీశారంతే. 1999లో చిరంజీవికి ఓ హాలీవుడ్ చాన్సు వచ్చింది. ‘ది రిటర్న్స్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్’ పేరుతో మొదలుపెట్టిన సినిమా ఓ షెడ్యూల్‌తోనే ఆగిపోయింది.

 బాలయ్యకు మూడు బ్యాడ్ మెమరీస్
 ఓ జానపదం... ఓ పౌరాణికం... ఓ త్రీడీ. బాలకృష్ణ కెరీర్‌లో అవి మైలురాళ్లుగా నిలిచిపోతాయనుకుంటే, శంకుస్థాపన రాళ్లలాగా మిగిలిపోయాయి. 1989 ప్రాంతంలో ‘శపథం’ అనే త్రీడీ సినిమా మొదలైనట్టే మొదలై ఆగిపోయింది. బాలకృష్ణ-కోడి రామకృష్ణ కాంబినేషన్‌లో మంగమ్మగారి మనవడు, ముద్దుల మావయ్యలాంటి బ్లాక్ బస్టర్స్ తీసిన భార్గవ్ ఆర్ట్స్ గోపాల్‌రెడ్డి 2001లో భారీ ఎత్తున ‘విజయ ప్రతాప్’ అనే జానపద సినిమా మొదలుపెట్టారు.

 పూజా భాత్రా, అంజలా జవేరి, రోజా కథానాయికలు. ఒక పాట, కొన్ని సీన్లు తీశారు. తర్వాత వైజాగ్‌లో ప్రాచీన నగరం సెట్ వేసి ఓ షెడ్యూలు చేశారు. ఆ తర్వాత హఠాత్తుగా సినిమా ఆగిపోయింది. బాలకృష్ణ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌లాగా మొదలుపెట్టిన  ‘నర్తనశాల’ పరిస్థితీ అంతే.

 బాలకృష్ణ ఫస్ట్ టైమ్ డెరైక్షన్. కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారు. ద్రౌపది పాత్ర చేస్తున్న సౌందర్య అకాల మృతి చెందడం, ఇతర కారణాల కారణంగా ‘నర్తనశాల’కు అక్కడితో శుభం కార్డు పడిపోయింది. మళ్లీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని ఆ మధ్య వార్తలొచ్చాయి కానీ, ఆ కదలికే లేదు.

 ల్యాబ్‌లో ఉండిపోయిన కృష్ణ సినిమా ‘సూపర్‌స్టార్’ పేరుతో కృష్ణ ఓ సినిమా చేశారు. అయితే అది విడుదలకు నోచుకోలేదు. ఆదుర్తి సుబ్బారావు శిష్యుడు కాసుల గురుదేవప్రసాద్ ‘సూపర్‌స్టార్’ పేరుతో ఓ బాలల సినిమా చేశారు. అందులో హీరో కృష్ణతో ఓ గెస్ట్ కేరెక్టర్ చేయించారు. 1990 ఏప్రిల్‌లో షూటింగ్ మొదలు పెట్టారు. ‘శ్రుతిలయలు’ ఫేమ్ షణ్ముఖ శ్రీనివాస్ అందులో మెయిన్‌రోల్. విజయశాంతి కూడా ఓ సన్నివేశంలో అతిథిగా చేశారు. ఆడియో కూడా విడుదలైంది. అయితే సినిమా విడుదలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇప్పటికీ ప్రసాద్ ల్యాబ్‌లో నెగిటివ్ భద్రంగా ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement