'చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు'
వింజమూరు (శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు): స్వార్థం కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని ఉపేక్షించబోమని నెల్లూరు జిల్లా కలెక్టర్ జానకి స్పష్టం చేశారు. బుధవారం ఉదయం ఆమె జిల్లాలోని వింజమూరు సమీపంలో ఉన్న న్యూట్రస్ స్పెషాలిటీస్ అనే ఔషధ ఫ్యాక్టరీని సందర్శించారు. ఇటీవల గ్రామస్తుల దాడిలో కర్మాగారానికి కలిగిన నష్టాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాలతో ప్రజలకు ఎలాంటి నష్టం లేదని చెప్పారు.
గామస్తుల విన్నపం మేరకు నెల క్రితం కర్మాగారం విడుదల చేసే వ్యర్థాలపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందిందని ఈ సందర్భంగా తెలిపారు. తమ అనారోగ్యానికి ఫ్యాక్టరీ వ్యర్థాలే కారణమంటూ గ్రామస్తులు ఫ్యాక్టరీపై ఇటీవల దాడికి దిగటం దురదృష్టకరమన్నారు. గ్రామానికి చెందిన కొందరు నాయకులు స్వార్థం కోసం ప్రజలను రెచ్చగొట్టి దాడికి పురిగొల్పారని చెప్పారు. దాడి కేసులో ఇప్పటికే 10 మంది అరెస్టు.. 70 మందిపై కేసులు నమోదయ్యాయన్నారు. అనంతరం గ్రామంలోని వారికి రేషన్, పింఛన్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించామని, అయితే వాటిని పునరుద్ధరించే విషయాన్ని పరిశీలించనున్నట్లు గ్రామస్తులకు కలెక్టర్ జానకి హామీ ఇచ్చారు.