ఓ ఫర్ ఓరియో వచ్చేసింది...కానీ..
సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న తన నూతన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఓ (O) 8.0 ను విడుదల చేసింది. అందరూ ఊహించినట్టుగా ఈ కొత్త ఓఎస్‌కు ఓరియో (Oreo) అని గూగుల్ పేరు పెట్టింది. అయితే ఈ కొత్త ఆండ్రాయిడ్ ఓ (O) 8.0 ముందుగా నెక్సస్ , పిక్సెల్ డివైస్‌లలో మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఓఎస్ 5ఎక్స్, నెక్సస్ 6పి, నెకసస్ ప్లేయర్, పిక్సెల్ సి, పిక్సెల్, పిక్సెల్ ఎక్స్ఎల్ డివైస్‌లలో ఓటీఏ (ఓవర్ ది ఎయిర్) రూపంలో అందుబాటులో ఉంటుందని గూగుల్ వెల్లడించింది.
ఎసెన్షియల్, హువాయ్, హెచ్‌టిసి, క్యోసెరా, మోటరోలా, హెచ్ఎమ్డి గ్లోబల్ హోమ్ ఆఫ్ నోకియా ఫోన్లు, శాంసంగ్, షార్ప్, సోనీ ఆండ్రాయిడ్ ఒరియో అప్‌గ్రేడ్ ఉంటుందని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ (ఇంజనీరింగ్) డేవ్ బుర్కే లాంచింగ్ సందర్భంగా ప్రకటించారు.
ఓ ఫర్ ఓరియో అంటూ కొత్త ఆపరేటింగ్ సిస్టంను గూగుల్ ప్రకటించింది. తమకొత్త ఆండ్రాయిడ్ 8.0 ఓఎస్ స్మార్టర్, ఫాస్టర్, మోర్ పవర్ఫుల్, అండ్ స్వీటర్ దేన్ ఎవర్ అని పేర్కొంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే పిక్చర్-ఇన్-పిక్చర్, నోటిఫికేషన్ డాట్స్, ఆటోఫిల్, ఇంటిగ్రేటెడ్ ఇన్స్టెంట్ యాప్స్ , గూగుల్ ప్లే ప్రొటెక్ట్, వేగవంతమైన బూట్ టైమ్ లాంటి ఫీచర్లను ఇందులో జోడించింది.
ఆండ్రాయిడ్ ఓరియో 8.0 ఫీచర్లు
డివైస్ బ్యాటరీ లైఫ్ ఇంకా ఎక్కువగా వచ్చేలా, బ్యాటరీ ఉపయోగాన్ని నియంత్రించేలా ఆండ్రాయిడ్ 8.0ను తీర్చిదిద్దారు. దీంతో డివైస్‌లలో బ్యాటరీ లైఫ్ మరింత పెరుగుతుంది. నోటిఫికేషన్ కంట్రోల్ కోసం కొత్తగా నోటిఫికేషన్ చానల్స్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాదు ఒకే యాప్ నుంచి వచ్చే మెసేజ్‌లు కొత్త లుక్‌లో, ఒకే గ్రూప్‌లో కనిపిస్తాయి. డివైస్‌లో ఉండే ఆటోఫిల్ సదుపాయాన్ని మరింత సులభంగా వాడుకునేలా తీర్చిదిద్దారు. యూజర్ తన ఫోన్ నంబర్లు, కార్డు నంబర్లు, చిరునామా, పాస్వర్డ్లు ఎంటర్ చేసే సమయంలో వాటిని స్టోర్ చేసుకోవాలా, వద్దా అనే ఆప్షన్‌ను ఆటో ఫిల్ ఇస్తుంది. దీంతో ఆటో ఫిల్‌ను ఎంచుకుంటే సదరు సమాచారం సేవ్ అవుతుంది. దాన్ని కావాలనుకున్నప్పుడు వేరే యాప్‌లో, సైట్లలో వాడుకోవచ్చు. ఫాంలో ఆటోఫిల్‌ను సెలెక్ట్ చేసుకుంటే చాలు, ఆటోమేటిక్‌గా ఫిల్ అవుతాయి.
ఆండ్రాయిడ్ 8.0లో కొత్తగా పిక్చర్ ఇన్ పిక్చర్ (పీఐపీ) ఫీచర్ ద్వారా ఫొటోలు, వీడియోలు చూస్తూ కూడా కాల్స్ ఆన్సర్ చేయవచ్చు, చాటింగ్ చేసుకోవచ్చు. భిన్నమైన ఫొటో సాఫ్ట్వేర్లను ఉపయోగించి ఎడిట్ చేసిన వివిధ రకాల ఫొటో ఫార్మాట్లలో ఉన్న ఇమేజ్‌లను కూడా వేగంగా ఓపెన్ చేసుకునేలా ఆండ్రాయిడ్ 8.0ను తీర్చిదిద్దారు. డాటా ఈజీ పెయిరింగ్ సౌలభ్యం కూడా ఉంది. డివైస్‌లో బ్రౌజర్‌ను ఓపెన్ చేసి సైట్లను దర్శిస్తున్నప్పుడు డివైస్ వైరస్ల బారిన పడకుండా ఉండేలా గూగుల్ సేఫ్ బ్రౌజింగ్‌ను ఆండ్రాయిడ్ 8.0లో అందుబాటులోఉంటుంది. పాత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ల కన్నా 2 రెట్లు యాప్‌లు వేగంగా ఓపెన్ అయ్యేలా ఆండ్రాయిడ్ 8.0 ను డెవలప్ చేశారు.
కాగా ప్రస్తుతానికి పిక్సెల్, నెక్సెస్ డివైస్‌లలో అందుబాటులో ఉన్న ఈ ఓఎస్ ఇతర డివైస్‌లలో అందుబాటులోకి వచ్చేంతవరకు మిగిలిన యూజర్లు వెయిట్ చేయక తప్పదు మరి.