NGT Chairman
-
జస్టిస్ స్వతంత్ర కుమార్ పదవీ విరమణ
న్యూఢిల్లీ: జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చైర్‌పర్సన్‌గా ఐదేళ్లు సేవలందించిన జస్టిస్ స్వతంత్ర కుమార్ మంగళవారం పదవీ విరమణ చేశారు. ఆయన తర్వాత ఈ పదవికి ఇంకా ఎవరినీ నియమించలేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ కుమార్ 2012 డిసెంబరు 20న ఎన్జీటీ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. అనంతరం అనేక కీలక తీర్పులను వెలువరించి పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడ్డారు. ఢిల్లీలో 10 ఏళ్లు దాటిన డీజిల్, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలను నిషేధించడం, గంగ, యమున నదుల ప్రక్షాళన చేపట్టడం, హిమాచల్ ప్రదేశ్‌లో అక్రమంగా నిర్మించిన హోటళ్లను కూల్చేయడం తదితరాలన్నీ ఈయన తీర్పుల వల్ల జరిగినవే. జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణోదేవీ ఆలయానికి రోజుకు 50 వేల కంటే ఎక్కువ మంది భక్తులు వెళ్లడానికి వీల్లేదనీ, అమర్నాథ్ వద్ద ప్రజలు గట్టిగా అరుస్తూ శివనామ స్మరణ చేయకూడదని కూడా జస్టిస్ స్వతంత్ర కుమార్ ఆదేశించారు. -
శ్రీవారిని దర్శించుకున్న ఎన్జీటీ చైర్మన్ జస్టిస్ స్వతంతర్‌కుమార్
సాక్షి, తిరుమల : తిరుమల ప్రశాంతమైన ఆధ్యాత్మిక క్షేత్రమని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చైర్మన్ జస్టిస్ స్వతంతర్‌కుమార్ అన్నారు. గురువారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారి తిరుప్పావై సేవలో పాల్గొన్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. జస్టిస్ స్వతంతర్కుమార్కు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు ప్రత్యేక దర్శనం కల్పించి, శ్రీవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల జస్టిస్ స్వతంతర్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. శ్రీవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు ఆధ్యాత్మిక భావనతో వస్తున్నారని, అదే వాతావరణం తిరుమలలో ఉండటం సంతోషంగా ఉందన్నారు. టీటీడీ అధికార యంత్రాంగం బాగా పనిచేస్తోందని, అందువల్లే ఈ క్షేత్రం పరిశుభ్రత, ప్రశాంత వాతావరణంతో ఉందని కితాబిచ్చారు. -
గుర్తింపు వేరు.. శాస్త్రీయ నిర్ధారణ వేరు
అమరావతిలో వరద ముంపు ప్రాంతాలపై ఎన్జీటీ సాక్షి, న్యూఢిల్లీ: వరద ముంపు ప్రాంతాలను గుర్తించడం వేరు... శాస్త్రీయ నిర్ధారణ వేరు అని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) పేర్కొంది. రాష్ట్ర రాజధాని అమరావతికి పర్యావరణ అనుమతులు ఇచ్చిన వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌పై ఎన్జీటీలో సోమవారం విచారణ జరిగింది. వరద ముంపు ప్రాంతాలపై నివేదిక ఇవ్వాలని గత విచారణ సందర్భంగా ఎన్జీటీ ఆదేశించగా సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ వరద ముంపు ప్రాంతాలతో కూడిన పటాన్ని నివేదించారు. అయితే, తాను సంబంధిత పటాన్ని చూడలేదని, పైగా ప్రతివాది తరపు న్యాయవాది ఈ పటం కేవలం ఏపీ గుర్తించిన ప్రాంతాలేనని చెబుతున్నారని, వరద ముంపు ప్రాంతాలుగా నిర్ధారించినట్లుగా చెప్పడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది సంజయ్ పారిఖ్ ఎన్జీటీ దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్జీటీ చైర్మన్ స్వతంత్రకుమార్ జోక్యం చేసుకుంటూ.. వరద ముప్పు ప్రాంతాలను గుర్తించడం, వాటిని శాస్త్రీయంగా నిర్ధారించడం వేర్వేరని పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుత పటాన్ని పిటిషనర్ తరపు న్యాయవాదికి అందజేయాలని సూచిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.