అమరావతిలో వరద ముంపు ప్రాంతాలపై ఎన్జీటీ
సాక్షి, న్యూఢిల్లీ: వరద ముంపు ప్రాంతాలను గుర్తించడం వేరు... శాస్త్రీయ నిర్ధారణ వేరు అని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) పేర్కొంది. రాష్ట్ర రాజధాని అమరావతికి పర్యావరణ అనుమతులు ఇచ్చిన వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌పై ఎన్జీటీలో సోమవారం విచారణ జరిగింది. వరద ముంపు ప్రాంతాలపై నివేదిక ఇవ్వాలని గత విచారణ సందర్భంగా ఎన్జీటీ ఆదేశించగా సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ వరద ముంపు ప్రాంతాలతో కూడిన పటాన్ని నివేదించారు.
అయితే, తాను సంబంధిత పటాన్ని చూడలేదని, పైగా ప్రతివాది తరపు న్యాయవాది ఈ పటం కేవలం ఏపీ గుర్తించిన ప్రాంతాలేనని చెబుతున్నారని, వరద ముంపు ప్రాంతాలుగా నిర్ధారించినట్లుగా చెప్పడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది సంజయ్ పారిఖ్ ఎన్జీటీ దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్జీటీ చైర్మన్ స్వతంత్రకుమార్ జోక్యం చేసుకుంటూ.. వరద ముప్పు ప్రాంతాలను గుర్తించడం, వాటిని శాస్త్రీయంగా నిర్ధారించడం వేర్వేరని పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుత పటాన్ని పిటిషనర్ తరపు న్యాయవాదికి అందజేయాలని సూచిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
గుర్తింపు వేరు.. శాస్త్రీయ నిర్ధారణ వేరు
Published Tue, Apr 5 2016 1:42 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 PM
Advertisement