దర్జాగా కబ్జా
చించినాడ (యలమంచిలి), న్యూస్‌లైన్ : చించినాడ నుంచి పాలకొల్లు-నరసాపురం వరకు 214 జాతీయ రహదారిని ఇరువైపులా కొందరు అక్రమార్కులు కబ్జా చేస్తున్నా సంబంధిత అధికారులు కళ్లు మూసుకుని వ్యవహరిస్తున్నారు. చించినాడ-కలగంపూడి గ్రామాల మధ్య జిట్స్ కళాశాలకు సమీపంలో దాదాపు 100 మీటర్ల మేర జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని నాలుగు నెలల కాలంలో పథకం ప్రకారం కబ్జా చేసేశారు. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించి ‘సాక్షి’ కథనాలు ప్రచురించినా అధికారులు చర్యలు తీసుకుంటామని ప్రకటించడమే తప్ప పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు ఆ స్థలంలో రాటలు పాతి కంచె నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు.
జాతీయ రహదారి పక్కన ఉన్న ఈ స్థలంలో ఉన్న చెట్లకు అక్రమార్కులు తొలుత నిప్పు పెట్టారు. చెట్లకు నిప్పు పెట్టిన విషయంపై ఆగష్టు 19న ‘ఎవరిదీ పాపం’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. ఈ కథనానికి స్పందించిన ఎన్‌హెచ్ 214 ఏఈ జీవీ నరసింహరాజు నిప్పు పెట్టిన చెట్లను పరిశీలించి సంబంధితులపై కఠిన చర్య లు తీసుకుంటామని, ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని, అటవీ శాఖ అధికారులతో మాట్లాడి తిరిగి మొక్కలు నాటిస్తామని ప్రకటించి చేతులు దులుపుకున్నారు. అక్రమార్కులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో అక్టోబర్‌లో నిప్పు పెట్టిన చెట్లను నరికి దర్జాగా కలప ఎత్తుకెళ్లారు. కలప నరికిన సమయంలో కూడా ‘నాడు నిప్పు పెట్టారు..నేడు నరికేశారు ’ శీర్షికన అక్టోబర్ 29న ‘సాక్షి’ మరో కథనం ప్రచురిం చింది. అయినా అధికారులు నిద్ర నుంచి మేల్కోపోవడంతో అక్రమార్కు లు మరింత రెచ్చిపోయి ఆ ప్రాంతాన్ని చదును చేసి రోడ్డు వరకు మైలు రాళ్లు సైతం పాతేశారు. త్వరలో ఫెన్సింగ్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
జాతీయ రహదారికు చేర్చి ఉన్న భూమి ని పట్ట పగలు కళ్లెదుటే చదును చేసి రాటలు వేస్తున్నా అధికారులకు కనిపిం చలేదంటే ఈ వ్యవహారంలో వారి పాత్ర పై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కన పేదలు ఉపా ధి కోసం చిన్న బడ్డీ కొట్టు పెడితేనే నానా హడావుడి చేసే హైవే, రెవెన్యూ అధికారులు చెట్లకు నిప్పు పెట్టి, నరికి, దర్జాగా ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తుంటే పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా కాజ పడమర పంచాయతీ గొంది సెంటర్ వద్ద కూడా చెట్టును నరికివేశారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందిం చి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.