ఆయనతో ఎవరూ మ్యాచ్ కాలేరు!
ఎదుటి వ్యక్తి మనస్తత్వం తెలుసుకోవడం చాలా కష్టం. అయితే వాళ్ల మాట తీరు, చూపులు, శారీరక భాషని పరిశీలిస్తే ఆ వ్యక్తి ‘ఇలాంటివాడు’ అని కొంతవరకూ అర్థమవుతుంది. ఇప్పుడు అనుష్కను తీసుకుందాం. ఆమెని చూడగానే మంచి అందగత్తె అనిపిస్తుంది. మాటలు కలిపితే ‘నైస్ పర్సన్’ అనుకోకుండా ఉండలేం. మరి.. ఎదుటి వ్యక్తిని అనుష్క ఎలా ఎనలైజ్ చేస్తారు? అనే విషయానికొస్తే.. కళ్లను పరిశీలిస్తారట.
ఎలాంటి మగవాళ్లను ఇష్టపడతారు? అనే ప్రశ్న అనుష్క ముందుంచితే - ‘‘కళ్లల్లో నిజాయతీ కనిపించాలి. అలాంటి మగాళ్లంటే ఇష్టం. అందుకే సన్ గ్లాసెస్ పెట్టుకున్న మగాళ్లతో మాట్లాడటం నాకిష్టం ఉండదు. మన కళ్లు మనం ఎలాంటి వ్యక్తో చెప్పేస్తాయ్. అలాగే, నవ్వు కూడా చెప్పేస్తుంది. స్వచ్ఛంగా నవ్వే అబ్బాయిలంటే ఇష్టం. జార్జ్ క్లూనీ (హాలీవుడ్ నటుడు) కళ్లల్లో నిజాయితీ కనిపిస్తుంది (నవ్వుతూ).
నాకు సింపుల్‌గా ఉండటం ఇష్టం. నా చుట్టూ ఉన్నవాళ్లు అలానే ఉండాలనీ, నిజాయతీగా ఉండాలనీ కోరుకుంటాను. లక్కీగా నా సర్కిల్లో అందరూ అలాంటివాళ్లే ఉన్నారు’’ అన్నారు. ‘‘పర్ఫెక్ట్ మ్యాన్‌కి నిదర్శనం మా నాన్నగారు. ఆయన్ను మ్యాచ్ కావడం ఏ అబ్బాయి వల్లా కాదు’’ అని తండ్రి పట్ల తనకున్న ప్రేమ, నమ్మకాన్ని వ్యక్తపరిచారు అనుష్క.