నిడదవోలు రైల్వే గేటు నుంచి రాకపోకలు నిషేధం
పశ్చిమగోదావరి, నిడదవోలు : నిడదవోలు పట్టణంలో రైల్వేగేటు నుండి వాహనాల రాకపోకలను మంగళవారం రాత్రి నుంచి పోలీసులు నిలిపివేశారు. మండలంలో శెట్టిపేట గ్రామ శివారున ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి లోపలకు ఎర్రకాలువ వరద నీరు ప్రవేశించడంతో ఇటు తాడేపల్లిగూడెం నుంచి నిడదవోలు వైపునకు, నిడదవోలు నుంచి తాడేపల్లిగూడెం వైపునకు గురువారం సాయంత్రం వరకు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశామని నిడదవోలు సీఐ ఎం. బాలకృష్ణ తెలిపారు. ఎర్రకాలువ వరద ఉద్ధృతికి వాహనాలు మునిగిపోయే లోతులో అండర్ రైల్వే బ్రిడ్జిలోకి భారీగా వరద నీరు చేరింది. అండర్ బ్రిడ్జితో పాటు ప్రధాన రహదారిని కూడా వరదనీరు ముంచెత్తింది. అండర్ బ్రిడ్జి ప్రక్కనే మరో మార్గం గుండా కేవలం ద్విచక్ర వాహనాల రాకపోకలను అనుమతించారు. వీరి రాకపోకల సమయంలో శెట్టిపేటకు చెందిన యువత ప్రయాణికులకు సహాయపడుతూ వరదలోంచి ద్విచక్ర వాహనాలను పైకి తీసుకువస్తున్నారు.
దారి మళ్లింపు ఇలా ..
ఎర్రకాలువ వరద కారణంగా శెట్టిపేట గ్రామ శివారున ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి లోపలకు వరద నీరు ప్రవేశించడంతో పట్టణం రైల్వే గేటు వద్ద నుంచి ఎటువంటి వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు. ముందు జాగ్రత్తగా వరద నీటిలో వాహనాలు చిక్కుకోకుండా పోలీస్ అధికారులు చర్యలు చేపట్టారు. నిడదవోలు పట్టణంలో పాటి మీద సెంటర్, మండలంలో సమిశ్రగూడెం వంతెన నుంచి నిడదవోలు వైపు నుండి తాడేపల్లిగూడెం వైపునకు వెళ్లే వాహనాలను పంపుతున్నారు. సమిశ్రగూడెం వంతెన నుండి కానూరు, ఉండ్రాజవరం మీదుగా తణకు వైపునకు దారి మళ్లిస్తున్నారు. తాడేపల్లిగూడెం నుంచి నిడదవోలు వైపునకు వచ్చే వాహనాలను శెట్టిపేట వద్ద ఆపి వెనక్కు పంపించేస్తున్నారు. తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో నుండి నిడదవోలుకు మూడు సర్వీసులను నడుపుతున్నారు. తాడేపల్లిగూడెం నుండి తిరుగుతున్న సర్వీసులను శెట్టిపేట అండర్ రైల్వే బ్రిడ్జి వద్ద ప్రయాణికులను దింపివేసి తిరిగి ప్రయాణికులతో తాడేపల్లిగూడెం వెళుతున్నాయి.