కొనసాగుతున్న పడవ వెలికితీత పనులు
నిడదవోలు : విజ్జేశ్వరం వద్ద గోదావరి స్కవర్‡ స్లూయిజ్ గేటులో చిక్కుకుపోయిన పాత ఇనుప పడవ వెలికితీసేందుకు ఆదివారం కూడా శ్రమించారు. అయినప్పటికీ ఫలితం లేదు. ఏటా గోదావరి వరదల సమయంలో పేరుకుపోయిన మట్టి, పూడికను తొలగించేందుకు ధవళేశ్వరం హెడ్ వర్క్స్ అధికారులు ఈ నెల 4న స్కవర్ ఆపరేషన్‌లో భాగంగా స్కవర్ స్లూయిజ్ నాలుగు గేట్లను ఎత్తారు. ఈ సమయంలో గోదావరిలో నీరు సముద్రం వైపునకు వదులుతారు. ఆ ప్రవాహనికి బ్యారేజీ వెనుక వైపు మట్టిలో కూరుకుపోయిన పాత ఇనుప పడవ ఒకటి కొట్టుకొచ్చి ఒక గేటులో చిక్కుకుపోయింది. ఇనుప పడవ కావడంతో గేటుకు కొక్కానికి పడవ పట్టేసింది. దీంతో ఎంత నీటి ప్రవాహం ఉన్నా అది కొట్టుకురాకుండా ఉండిపోయింది. దీంతో దానిని తీయడానికి అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ధవళేశ్వరం హెడ్‌వర్క్స్ ఎస్ఈ బి.రాంబాబు, ఈఈ ఎన్.కృష్ణారావులు దగ్గరుండి పడవ తీసే పనిలో నిమగ్నమయ్యారు. ముందుగా స్టాప్‌లాగ్ గేట్లును మూసివేసి నీటి ప్రవాహాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే స్టాప్‌లాగ్ గేట్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో అవి తుప్పుపట్టి కిందకు దిగడం లేదు. స్టాప్‌లాగ్ గేట్లను కిందకు దించితే తప్ప నీటి ప్రవాహం అడ్డుకట్ట వేయలేరు. పడవ తీసేందుకు మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.