మాజీ సైనికుడి అఘాయిత్యం
భూవివాదం నేపథ్యంలో ఫైరింగ్
సొంత చిన్నాన్న, తమ్ముడిపైనే చిన్నాన మృతి
దొడ్డబళ్లాపురం : భూ వివాదం నేపథ్యంలో ఓ మాజీ సైనికుడు చెలరేగిపోయాడు. సొంత చిన్నాన్న, తమ్ముడిపై ఫైరింగ్ చేయడంతో చిన్నాన్న వృుతిచెందాడు. వివరాల్లోకి వెళితే... దేవనహళ్లి తాలూకా మల్లేనహళ్లికి చెందిన నీలకంఠాచారి కుమారుడు మంజునాథ్ బీఎస్ఎఫ్లో జవాన్‌గా పనిచేసి, ఇటీవల ఉద్యోగ విరమణ పొందాడు. నీలకంఠాచారికి ఆయన సోదరుడు నాగరాజాచారి(62)కి మధ్య రెండు ఎకరాల భూమికి సంబంధించి వివాదం ఉంది. ఇందుకు సంబంధించి నీలకంఠాచారి, మంజునాథ్‌కు నాగరాజాచారి కోర్టు నోటీసులు పంపించాడు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేస్తూ శుక్రవారం రాత్రి 9 గంటలకు నాగరాజాచారి ఇంటికి వెళ్లి మంజునాథ్ గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో సహనం కోల్పోయిన మంజునాథ్ తన లెసైన్‌సడ్ రివాల్వర్‌తో చిన్నాన్నపై కాల్పులు జరిపాడు.
ఓ బులెట్ నేరుగా నాగరాజాచారి ఎడమకన్నులో దూసుకెళ్లింది. అప్పుడే అక్కడకు చేరుకున్న నాగరాజాచారి కుమారుడు రవి(30) అడ్డుకునేందుక ప్రయత్నించగా అతనిపై కూడా మంజునాథ్ కాల్పులు జరిపి తప్పించుకున్నాడు. ఘటనలో గాయపడిన ఇద్దరిని హుటాహుటినా హొసకోటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా నాగరాజాచారి మార్గమధ్యలో మరణించాడు. రవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలాన్ని డీవైఎస్పీ కోనప్ప రెడ్డి పరిశీలించారు. నిందితుడు మంజునాథ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు కేసు దర్యాప్తు చేస్తున్న చెన్నరాయపట్టణ పోలీసులు తెలిపారు.