nimma Venkata Rao
-
ఎన్ఈపీ అమలులో అగ్రస్థానంలో ఏపీ
విశాఖ విద్య: జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) అమలులో ఆంధ్రప్రదేశ్.. దేశంలోనే అగ్రస్థానంలో ఉందని కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ టీవీ కట్టిమని అన్నారు. విశాఖపట్నంలో బుధవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ(శ్రీకాకుళం) వీసీ నిమ్మ వెంకటరావు, జేఎన్టీయూ(విజయనగరం) వీసీ బి.వెంకట సుబ్బయ్య, ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ వి.కృష్ణమోహన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ డైరెక్టర్ శాలివాహన్, ఐఐఎం ప్రతినిధి ఆచార్య షమీమ్ జావేద్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జాతీయ స్థాయిలో పాలసీలు తీసుకువచ్చేది కేంద్ర ప్రభుత్వమే అయినప్పటికీ.. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని వాటిని విజయవంతంగా అమలు చేసేది రాష్ట్ర ప్రభుత్వాలే అని చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ దిశగా ముందుకు అడుగులు వేస్తోందన్నారు.జాతీయ విద్యా విధానం వల్ల విద్యార్థులు తమ అభిరుచి మేరకు కోర్సులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లభించిందన్నారు. యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేలా చదువులు సాగుతున్నాయని వివరించారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానిక యువతకు కేటాయించడం, విద్యాలయాలను పరిశ్రమలకు అనుసంధానం చేయడం వంటి చర్యలు విద్యార్థులకు భరోసాగా నిలుస్తున్నాయని చెప్పారు. ఉన్నత విద్యకు పాఠశాల స్థాయిలోనే పటిష్ట పునాది వేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు. ఉద్యోగ అవకాశాలు లక్ష్యంగా బోధన సాగుతోందన్నారు. గిరిజన యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం 561 ఎకరాల భూమి కేటాయించిందని.. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా నిర్మాణాలు పూర్తి చేసిన అనంతరం నూతన క్యాంపస్‌కు వెళ్తామని వీసీ కట్టిమని తెలిపారు. అనంతరం జాతీయ విద్యావిధానం ప్రయోజనాలపై గిరిజన వర్సిటీ రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. -
ఎడ్‌సెట్ కౌన్సెలింగ్‌కు 1,331 మంది హాజరు
హైదరాబాద్: ఎడ్‌సెట్ మలివిడత వెబ్‌కౌన్సెలింగ్ శని, ఆదివారాల్లో జరిగింది. ఈ రెండురోజుల్లో గణితం, భౌతికశాస్త్రం, ఆంగ్లం, జీవశాస్త్రం మెథడాలజీలకు సంబంధించి ఒకటినుంచి చివరి ర్యాంకు వరకు అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలంచారు. ఆదివారం సాయంత్రం ఆరుగంటల వరకు కొనసాగిన ఈ పరిశీలనకు 1,331 మంది హాజరయ్యారు. సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి జీవశాస్త్రం, సాంఘికశాస్త్రం అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఎడ్‌సెట్ తొలివిడత కౌన్సెలింగ్ పూర్తికావడంతో ఆయా కాలేజీల్లో సీట్లు కేటాయించిన విద్యార్థులకు ఆంధ్రా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజు స్క్రాచ్‌కార్డులు, అకనాలెడ్జిమెంటు లెటర్లు అందించారు. ఆదివారం ఆయన వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న ఎడ్‌సెట్ ఆఫీసును సందర్శించి ఈ లెటర్లు ఇచ్చారు. ఎడ్‌సెట్‌ను ప్రశాంతంగా, ఒడిదుడుకులు లేకుండా పూర్తి చేస్తున్నందుకు కన్వీనర్ ప్రొఫెసర్ నిమ్మవెంకటరావు, ఇతర అధికారులు, సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.