nippon steel and sumitomo metal
-
ఆర్సెలర్ నిప్పన్ చేతికి ఎస్సార్ ఆస్తులు
న్యూఢిల్లీ: సొంత(వినియోగ) పోర్టులు, విద్యుత్ మౌలిక ఆస్తుల విక్రయాన్ని పూర్తి చేసినట్లు రూయాల కుటుంబ సంస్థ ఎస్సార్ గ్రూప్ తాజాగా వెల్లడించింది. గుజరాత్‌లోని హజీరా, ఒడిషాలోని పారదీప్‌వద్ద గల ఈ ఆస్తులను ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా(ఏఎంఎన్ఎస్)కు అమ్మివేసినట్లు తెలియజేసింది. వెరసి ఎస్సార్ పోర్ట్స్ అండ్ టెర్మినల్స్(ఈపీటీఎల్), ఎస్సార్ పవర్ లిమిటెడ్(ఈపీఎల్)ను 2.05 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 16,500 కోట్లు) విక్రయించింది. దీంతో రుణరహితంగా మారే బాటలో ఆస్తుల మానిటైజేషన్‌ను పూర్తయినట్లు కంపెనీ పేర్కొంది. డీల్‌లో భాగంగా 270 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు, 25 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంగల హజీరా(గుజరాత్) పోర్టు, 12 ఎంటీ వార్షిక సామర్థ్యంగల పారదీప్(ఒడిషా) పోర్టు ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ సొంతమయ్యాయి. కాగా.. ఆస్తుల మానిటైజేషన్‌తో 25 బిలియన్ డాలర్ల(రూ. 2 లక్షల కోట్లు) రుణ చెల్లింపులను పూర్తి చేయడం ద్వారా గ్రూప్ రుణరహితంగా నిలిచినట్లు ఎస్సార్ క్యాపిటల్ డైరెక్టర్ ప్రశాంత్ రూయా పేర్కొన్నారు. చదవండి: ఊహించని షాక్.. ఒకప్పుడు ఈ కారుకి ఫుల్ డిమాండ్, ఇప్పుడేమో ఒక్కరూ కొనట్లేదు! -
ఎస్సార్ స్టీల్‌కు ఆర్సెలర్ మిట్టల్ తాజా బిడ్
న్యూఢిల్లీ: భారీ రుణాల్లో కూరుకుపోయిన ఎస్సార్ స్టీల్ కొనుగోలుకు ఆర్సెలర్ మిట్టల్ సోమవారం ఉదయం తాజా బిడ్ దాఖలు చేసింది. జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్ అండ్ సుమిటోమో మెటల్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో ఈ బిడ్ దాఖలు చేసినట్లు తెలిసింది. బిడ్ విలువ ఎంతన్నది అధికారికంగా తెలియనప్పటికీ, ఈ మొత్తం రూ.42,000 కోట్లు ఉండవచ్చని వినిపిస్తోంది. ఎస్సార్ స్టీల్ రుణ దాతలకు తిరిగి చెల్లింపులు చేయటానికి ఆర్సెలర్ మిట్టల్ ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎస్సార్ స్టీల్ ఇండియా లిమిటెడ్ (ఈఎస్‌ఐఎల్) క్రెడిటార్స్ కమిటీకి ఈ మేరకు సవరించిన బిడ్‌ను సమర్పించినట్లు ఆర్సెలర్ మిట్టల్ తెలియజేసింది. గత అనుబంధ సంస్థలు... ఉత్తమ్ గాల్వా, కేఎస్ఎస్ పెట్రోన్ల రూ.7,000 కోట్ల బకాయిల చెల్లింపులకు కూడా తాజా ఆర్సెలర్ మిట్టల్ బిడ్ ఆఫర్ ప్రతిపాదనలో ఉన్నట్లు సమాచారం. సంబంధిత రూ. 7,000 కోట్ల రుణబాకీలను సెప్టెంబర్ 11లోగా చెల్లించేస్తే ఆర్సెలర్ మిట్టల్ బిడ్‌కు పరిశీలనార్హత ఉంటుందని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. బకాయిలు రూ.49,000 కోట్లు... సుమారు రూ. 49,000 కోట్ల మొండిబాకీలను రాబట్టుకునేందుకు ఎస్సార్ స్టీల్‌ను బ్యాంకులు వేలం వేస్తున్నాయి. తొలి రౌండులో రష్యా సంస్థ న్యూమెటల్, ఆర్సెలర్‌మిట్టల్ బిడ్లు వేసినప్పటికీ.. డిఫాల్ట్ అయిన సంస్థలతో వాటి ప్రమోటర్లకు లావాదేవీలున్నాయన్న కారణంతో సీవోసీ సదరు బిడ్లను తిరస్కరించింది. న్యూమెటల్‌లో ఎస్సార్ స్టీల్ ప్రమోటరు రవి రుయా కుమారుడు రేవంత్ రుయాకు వాటాలున్నాయన్న కారణంతో ఆ సంస్థ బిడ్‌ను తిరస్కరించింది. బ్యాంకులకు బాకీ పడ్డ ఉత్తమ్ గాల్వా, కేఎస్ఎస్ పెట్రోన్‌లలో వాటాలు ఉన్నందున ఆర్సెలర్ మిట్టల్ బిడ్ తిరస్కరణకు గురైంది. దీంతో సీవోసీ రెండో విడత బిడ్లను ఆహ్వానించింది. వేదాంత కూడా మూడవ బిడ్డర్‌గా ఉంది. -
నిప్పన్ స్టీల్‌తో ఆర్సెలర్ మిట్టల్ జట్టు
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎస్సార్ స్టీల్‌ను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో భాగంగా జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్ అండ్ సుమిటోమో మెటల్ కార్పొరేషన్‌తో (ఎన్‌ఎస్‌ఎస్‌ఎంసీ) ఆర్సెలర్ మిట్టల్ చేతులు కలిపింది. నిప్పన్‌తో జాయింట్ వెంచర్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఈ కంపెనీ వెల్లడించింది. భారీ మొండిబాకీలతో దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటున్న 12 కంపెనీల్లో ఎస్సార్ స్టీల్ ఒకటి. దీన్ని కొనుగోలు చేస్తే భారత మార్కెట్లో కీలకంగా ఎదగొచ్చనే ఉద్దేశంతో ఎస్సార్ స్టీల్ కోసం ఆర్సెలర్‌మిట్టల్ బరిలో నిలిచింది. కంపెనీని గాడిలో పెట్టేందుకు ప్రత్యేక ప్రణాళికను ఆర్సెలర్ మిట్టల్ ఇండియా (ఏఎంఐపీఎల్) ఫిబ్రవరి 12న అందజేసింది కూడా. తమ ప్రణాళికకు గానీ ఎన్సీఎల్టీ ఆమోద ముద్ర వేస్తే నిప్పన్‌తో కలసి ఎస్సార్ స్టీల్‌ను కొనుగోలు చేస్తామని, సంయుక్తంగా సంస్థ నిర్వహణ చేపడతామని ఆర్సెలర్ మిట్టల్ చైర్మన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. 1987 నుంచి ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ కలసి అమెరికాలోని ఇండియానాలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇటీవలే అమెరికాలోని అలబామాలో కాల్వర్ట్ ఉక్కు ప్లాంటును కూడా కొనుగోలు చేశాయి. ఆర్సెలర్ మిట్టల్‌కి 60 పైగా దేశాల్లో కార్యకలాపాలున్నాయి. -
ఆర్సెలర్ మిట్టల్ చేతికి థిసెన్‌క్రప్ ‘అమెరికా స్టీల్ ప్లాంట్’
న్యూయార్క్: ఉక్కు దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ తాజాగా అమెరికాలో మరో ఉక్కు ప్లాంటును కొనుగోలు చేస్తోంది. జర్మన్ సంస్థ థిసెన్క్రప్కి అమెరికాలో ఉన్న ప్లాంటును మరో కంపెనీ నిప్పన్ స్టీల్ అండ్ సుమిటోమో మెటల్‌తో కలిసి కొంటోంది. ఈ డీల్ విలువ సుమారు 1.55 బిలియన్ డాలర్లు. ఈ ఒప్పందానికి అంగీకారం తెలిపినట్లు ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ వెల్లడించాయి. అలబామా రాష్ట్రంలోని సదరు ప్లాంటులో ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం 5.3 మిలియన్ టన్నులు. ప్రధానంగా ఆటోమొబైల్, నిర్మాణ రంగాలకు అవసరమైన ఉక్కు ఉత్పత్తులు ఇక్కడ తయారవుతాయి.