బదిలీ వెనుక...కారణాలెన్నో..!
తీవ్ర మనస్తాపానికి గురైన నిర్మల
బాధ్యతల నుంచి వెంటనే రిలీవ్
సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నిర్మల బదిలీ వ్యవహారంపై అధికార వర్గాల్లో జోరుగా చర్చజరుగుతోంది. ఈమె బదిలీ వెనుక అనేక కారణాలున్నట్లు ఊహాగానాలు వినవస్తున్నాయి. కారణాలు ఏమైనా బదిలీ చేసిన తీరు, పోస్టింగ్ ఇవ్వకపోవటంపై ఆమె మనస్తానికి లోనయ్యారు. గురువారం రాత్రి వరకు తన చాంబర్లో అధికారులతో ప్రభుత్వ భూముల వేలం విషయమై ప్రభుత్వానికి అందించాల్సిన నివేదికపై చర్చిస్తున్నారు. అంతలోనే ఉన్నతాధికారి ఒకరు ఆమెకు ఫోన్ చేసి బదిలీపై సమాచారం అందించారు. దీంతో నిరాశకులోనైన ఆమె ఫైళ్లను అక్కడే వదిలేసి నేరుగా క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయినట్లు సమాచారం. సాధారణంగా ప్రతి రోజు ఇంటికి వెళ్లే సమయంలో పెండింగ్ ఫైళ్లను తన వెంట తీసుకెళ్లే వారని, గురువారం సిబ్బంది ఫైళ్లు తెచ్చి ఇచ్చినా..వద్దని వారించారు. ఈ తర్వాత తనకు సన్నిహితులైన ఒకరిద్దరు అధికారులకు బదిలీ విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది.
శుక్రవారం ఉదయం జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ను క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని, ఇన్చార్జి బాధ్యతలు అప్పగించి రిలీవ్ అయ్యారు. ఇదిలా ఉండగా ... జిల్లాలో పరిపాలన గాడినపడుతున్న తరుణంలో కలెక్టర్‌ను బదిలీ చేయటం సరికాదని అధికార వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటన సందర్భంగా ఒక ప్రాంతంలో జరిగిన ్ర కార్యక్ర మంలో కలెక్టర్ పాల్గొనకపోవటంపై ఉన్నతాధికారులతో సహా సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఉన్నతాధికారులతో సత్సంబంధాలను కొనసాగించక పోవటం, జిల్లా స్థాయిలోనూ ఆమె వైఖరి పలువురికి మింగుడుపడకపోవడమే బదిలీకి కారణాలుగా పేర్కొంటున్నారు. అంతేగాకుండా మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా హైదరాబాద్‌కు రావాలని పట్టుదలతో ఉండటం కూడా ఆమె బదిలీకి బలమైన కారణంగా చెప్పుకుంటున్నారు.