నిఠారీ కేసు: కోలీకి 12న ఉరిశిక్ష అమలు
నిఠారీ సీరియల్ హంతకుడు సురీందర్ కోలీని ఈ నెల 12న ఉరి తీయనున్నారు. 14 ఏళ్ల అమ్మాయిని దారుణంగా హతమార్చిన కేసులో కోలీకి ఉరిశిక్ష పడిన విషయం తెలిసిందే. మీరట్ జైల్లో అతడిని 12వ తేదీన ఉరి తీయనున్నట్లు జైలు సూపరింటెండెంట్ రిజ్వీ తెలిపారు. నియమ నిబబంధనలన్నింటినీ తాము పాటిస్తున్నామని, ఆరోజే ఉరి తీస్తామని ఆయన చెప్పారు.
న్యాయపరంగా ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవడంతో, 42 ఏళ్ల కోలీని చనిపోయేవరకు ఉరి తీయాలంటూ ఘజియాబాద్ అదనపు సెషన్స్ జడ్జి అతుల్ కుమార్ గుప్తా బుధవారం వారంటు జారీ చేశారు. ప్రస్తుతం ఘజియాబాద్ జైల్లో ఉన్న కోలీకి రింపా హల్దర్, మరో నలుగురిని చంపిన కేసులో ఉరిశిక్ష పడింది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేస్తున్న మొదటి ఉరిశిక్ష ఇదే అవుతుంది.
కోలీ పెట్టుకున్న క్షమాభిక్ష విజ్ఞప్తిని తిరస్కరించాలని కేంద్ర హోం మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నెల రోజులకే రాజ్నాథ్ సింగ్ రాష్ట్రపతికి సిఫార్సు చేశారు. దాంతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూలై 27న క్షమాభిక్షను తిరస్కరించారు. కోలీపై మొత్తం 16 హత్యకేసులు ఉన్నాయి. ఆడపిల్లలపై వరుసపెట్టి అత్యాచారాలు చేయడం, వాళ్లను చంపేయడం సురీందర్ కోలీకి అలవాటని, ఇలా మొత్తం 16 కేసులు అతడిపై ఉన్నాయని సీబీఐ తన ఛార్జిషీటులో పేర్కొంది. 2006లో తొలిసారిగా ఒక హత్య వెలుగులోకి వచ్చింది. తర్వాత దర్యాప్తు మొదలుపెట్టగా.. వరుసపెట్టి అన్నీ తెలిసి దేశం యావత్తు విస్తుపోయింది. నోయిడాలోని నిఠారీ కాలనీలో కోలి పనిమనిషిగా పనిచేసేవాడు.