Nithin Sathya
-
బిగ్‌బాస్ బ్యూటీతో నితిన్ సత్య రీఎంట్రీ
తమిళ సినిమా: ద్వారకా ప్రొడక్షన్స్ పతాకంపై బ్లేస్ కన్నన్, శ్రీలతా బ్లెస్ కన్నన్ నిర్మిస్తున్న చిత్రం కొడువా. ఈ చిత్రం ద్వారా నటుడు నితిన్ సత్య హీరోగా రీఎంట్రీ ఇస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ సంయుక్త కథానాయకగా నటిస్తున్న ఇందులో మురుగదాస్, సంతాన భారతి, వినోద్ సాగర్, సుభద్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బ్యాచిలర్ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేసిన సురేష్ సాతయ్య ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కాగా ఈ చిత్రం సోమవారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ... కొడువా రామనాథపురం నేపథ్యంలో సాగే చిత్రమని చెప్పారు. ఆ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని ఆవిష్కరించేలా ఉంటుందన్నారు. ఆ ప్రాంతానికి చెందిన ఒక యువకుడి జీవితంలో జరిగే అనూహ్య సంఘటనలు, వాటి పర్యావసానాలు ఎలా ఉంటాయన్న ఆసక్తికరమైన విషయాలను ఆవిష్కరించే చిత్రంగా ఇది ఉంటుందన్నారు. దీనికి ధరన్ కుమార్ సంగీతాన్ని, కార్తీక్ నల్లమత్తు ఛాయాగ్రహణంను అందిస్తున్నారని తెలిపారు. కాగా ఈ చిత్ర ప్రారంభోత్సవానికి దర్శకుడు వెంకట్ ప్రభు, నిర్మాత ఐన్గరన్ కరుణా మూర్తి, సుందర్, దర్శకుడు రాజేష్ ఎం.సెల్వా, నటుడు వైభవ్, పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. -
మరో హారర్ చిత్రంగా పాండియోడ గలాటా తాంగలా
కోలీవుడ్‌లో దెయ్యం కథా చిత్రాల హవా అప్రహతంగా సాగుతోంది. తాజాగా ఆ కోవలో రూపొందుతున్న చిత్రం పాండియోడ గలాటా తాంగలా. నితిన్ సత్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో రక్షరాజ్ నాయకిగా నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింగమ్పులి, మయిల్సామి, ఇమాన్ అన్నాచ్చి నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్టీ.గుణశేఖరన్ దర్శకత్వం వహిస్తున్నారు. మణికంఠన్ నిర్మాత.చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ముగ్గురు స్నేహితులు ఒక మ్యాన్షన్‌లోని పైభాగంలో చిన్న గదిలో అద్దెకు ఉంటారన్నారు. అయితే ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే ఆ ముగ్గురు అద్దె చెల్లించలేక పోతారు. వారి నుంచి ఎలాగైనా అద్దె వసూలు చేయాలని పలు రకాల ప్రయత్నాలు చేసి విఫలమైన మ్యాన్షన్ యజమాని చివరికి ఆ బాధ్యతను పోలీసుకు అప్పగిస్తాడన్నారు. అయితే ఆ పోలీసును మచ్చిక చేసుకోవడానికి ముగ్గురు స్నేహితులు మందు పార్టీ ఇస్తారన్నారు.అయితే మద్యంమత్తులో పోలీస్ పైనుంచి కిందికి పడి మరణిస్తాడన్నారు. ఆ తరువాత దెయ్యంగా వచ్చి తను చనిపోవడానికి కారణం అయిన వారిపై ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తాడని తెలిపారు. ఆ తరువాత ఏంజరిగిందన్నదే చిత్ర క్లైమాక్స్ అని దర్శకుడు అన్నారు. -
ప్రేమించాలంటూ వెంటబడ్డారు!
తనను ప్రేమించాలంటూ ఎంతో మంది వెంటబడ్డారని నటి మాళవిక వేల్స్ తెలిపారు. కేరళ త్రిచూర్ నుంచి కోలీవుడ్‌కు కొత్తగా వచ్చిన ఈమె ఇంకా చాలా చెప్పారు. ‘‘నాకు భరతనాట్యం, కూచిపూడి, మోహినీయాట్టం తెలుసు. 2009లో మిస్ కేరళ పోటీలో ‘బ్యూటిఫుల్ ఐస్’ అవార్డు అందుకున్నాను. ఆ కార్యక్రమంలో నన్ను చూసిన వినీత్ శ్రీనివాసన్ ‘మలర్వాడి ఆర్ట్స్ క్లబ్’ అనే చిత్రంలో నన్ను పరిచయం చేశారు. ఆ తర్వాత కన్నడ చిత్ర అవకాశం వచ్చింది. ఆ తర్వాత తమిళంలో ‘అళగు మగన్’ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నాను. తర్వాత ‘ఎన్న సత్తం ఇంద నేరం’ చిత్రంలో అవకాశం లభించింది. ఒకే ప్రసవంలో జన్మించిన అక్షితి, ఆప్తి, ఆకృతి, అతిథి అనే నలుగురు చిన్నారులతో నటించే అవకాశం లభించింది. చిత్రం ఈ నలుగురిపైనే కేంద్రీకృతమైంది. దర్శకుడు జయం రాజా, కాదల్‌మన్నన్ మా ను, నితిన్ సత్యాతో కలిసి నటించాను’’ అన్నారు మాళవిక వేల్స్. ఎంతో మంది మాళవికలు ఉన్నారుగా? తెలుసు. వాళమీను మాళవిక, అణ్ణి మాళవిక, మాళవికా నాయర్, మాళవికా మేనన్ అంటూ కొందరున్నారు. నాకిది తల్లిదండ్రులు పెట్టిన పేరు. అందుచేత దీనిని మార్చేది లేదు. ఒక్కొక్కరికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నాకు మాళవిక వేల్స్ అని ఉందిగా! గ్లామర్‌గా నటిస్తారా? కచ్చితంగా లేదు. త్రిచూర్‌లో భావన ఇంటి పక్కనే వుంది మా ఇల్లు. ఆమె నేను ఫ్రెండ్స్. ఇంతవరకు ఆమె గ్లామర్‌గా నటించలేదు. నాకు అదే ఉద్దేశం ఉంది. ఫ్యామిలీ ఇమేజ్ మాత్రమే కావాలి. ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే విధంగా నటించాలని ఆశపడుతున్నాను. డ్రీమ్ రోల్? పది చిత్రాల్లో నటించాను. ఈలోపున డ్రీమ్ రోల్ గురించి ఎలా చెప్పగలను. అలా దేనికీ ఫిక్స్ అవకూడదు. ఏ రోల్లో ప్రతిభను నిరూపించుకోగలమనే విశ్వాసం ఉందో, అందులో వంద శాతం నటన ప్రదర్శిస్తా. డ్యాన్స్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తాను. కేరళలో జరిగే ఉత్సవాల్లో నా భరతనాట్య ప్రదర్శనకు స్థానం ఉంటుంది. లవ్ చేశారా? ప్లస్ టూలో కొందరు వెంటబడ్డారు. వారిని అమ్మా, నాన్నల వద్దకు తీసుకువెళ్లి నిలబెట్టాను. తల్లిదండ్రులు వారికి ‘ఈ వయసులో ప్రేమేంటి? బుద్ధిగా చదువుకుని ముందుకు సాగండి!’ అంటూ సూచించారు. ఆ తర్వాత వారు నన్ను డిస్టర్బ్ చేయలేదు. మలయాళం, తమిళ్, తెలుగులో అవకాశాలు వస్తున్నాయి. -
నా హృదయంలో నిదురించే చెలి
నితిన్ సత్య, దిశాపాండే జంటగా ఎస్.టి.వెందన్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ఓ చిత్రం ‘నా హృదయంలో నిదురించే చెలి’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఎ.వి.రావు, పోతిరెడ్డి శ్రీనివాసరావు ఈ చిత్రానికి నిర్మాతలు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ -‘‘లవ్, యాక్షన్, కామెడీ, హారర్ సమపాళ్లలో మేళవించిన సినిమా ఇది. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన అంశాలన్నీ ఉన్నాయి. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసి నవంబర్ మూడో వారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. గంజా కర్ఫు, రేఖ, సురేష్, రేష్మా తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ఎం.వి.ఉదయ్‌శంకర్, సంగీతం: కణ్ణన్, సమర్పణ: ఏ.బేబీరావు.