పోలీసు ఇమేజీ పెంచేలా శిక్షణ
సాక్షి, హైదరాబాద్: పోలీసులు ముఖ్యంగా ఐపీఎస్ అధికారులు మెరుగైన ప్రవర్తనతో ప్రజల్లో వారి ప్రతిష్ట పెంచే విధంగా శిక్షణాంశాలపై దృష్టి పెడుతున్నట్టు సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (ఎన్పీఏ) డైరెక్టర్ అతుల్ కర్వాల్ తెలిపారు. మారుతున్న పరిస్థితులు, అవసరాలకు తగ్గట్టుగా కార్యక్రమాలు రూపొందిస్తున్నామన్నారు. ప్రజల పట్ల, వారు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల పోలీసు అధికారుల్లో మరింత సానుభూతి, సానుకూల వైఖరి పెరిగేందుకు అవసరమైన అంశాలు శిక్షణ కార్యక్రమాల్లో చేర్చుతున్నామన్నారు. ఎన్పీఏలో 72వ బ్యాచ్ ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారుల శిక్షణ ముగింపు సందర్భంగా శుక్రవారం నిర్వహించనున్న దీక్షాంత్ పరేడ్ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. 2019 బ్యాచ్‌లోని మొత్తం 178 మంది ట్రైనీ ఐపీఎస్ అధికారులు ఈ పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొంటారని చెప్పారు. బుధవారం ఎన్పీఏ జాయింట్ డైరెక్టర్లు అమిత్ గార్గ్, ఎన్.మధుసూదనరెడ్డి, అసిస్టెంట్ డైర్టెకర్ సి.వంశీకృష్ణలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో సైబర్ నేరాల విస్తృతి పెరిగే అవకాశం ఉన్నందున, ఈ నేరాల దర్యాప్తులో మెళకువలకు సంబంధించిన అంశాలను ట్రైనింగ్‌లో చేర్చినట్టు కర్వాల్ చెప్పారు.
తెలంగాణ కేడర్‌కు నలుగురు
తెలంగాణ, ఏపీ కేడర్లకు నలుగురు చొప్పున మొత్తం ఎనిమిది మందిని కేటాయించినట్టు తెలిపారు. తెలంగాణకు అక్షాన్ యాదవ్, అశోక్ కుమార్, రష్మి పెరుమాళ్, కేకన్ సుధీర్ రామనాథ్‌లను, ఏపీకి కొమ్మి ప్రతాప్ శివకిషోర్, అదిరాజ్ సింగ్ రానా, ప్రేరణా కుమార్, మహేశ్వర రెడ్డి (వైఎస్సార్ జిల్లా)లను కేటాయించినట్టు చెప్పారు.
మహిళలు పోలీస్ ఫోర్స్‌ను ఎంచుకోవాలి: రష్మీ పెరుమాళ్
మహిళలు పోలీస్ ఫోర్స్‌ను ఎంచుకోవాలి. ఐపీఎస్‌లుగా అయితే మరింత బాగా పనిచేసే, సేవ చేసే అవకాశం లభిస్తుంది. హైదరాబాద్‌లో స్థిరపడిన నన్ను తెలంగాణకు కేటాయించడం సంతోషంగా ఉంది. నా తండ్రి ఆర్మీ అధికారి కావడంతో ఆయన నుంచి స్ఫూర్తి పొంది ఐపీఎస్‌ను ఎంచుకున్నా.
తొలిసారిగా మహిళకు ఆల్‌రౌండ్ ట్రోఫీ
మహిళా అధికారులు పురుషులతో పోటీపడుతూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని కర్వాల్ తెలిపారు. గత 72 ఏళ్లుగా పురుష ప్రొబేషనరీ అధికారులు ఔట్‌డోర్ ఆల్‌రౌండ్ ట్రోఫీ గెలుస్తుండగా.. ఈ ఏడాది హరియాణకు చెందిన రంజీత శర్మ (రాజస్థాన్ కేడర్) ప్రతిష్టాత్మక ట్రోఫీని గెలుచుకున్నారని తెలిపారు. రెండో స్థానంలోనూ శ్రేయాగుప్త (తమిళనాడు కేడర్) అనే మరో అధికారి నిలవడం గొప్ప విషయమన్నారు. రంజీత శర్మ ప్రధానమంత్రి బేటన్ హోం మంత్రిత్వ శాఖ రివాల్వర్ అవార్డు, ఇతర ట్రోఫీలు అందుకోనున్నారు. ‘బెస్ట్ ఔట్‌డోర్ ప్రొబేషనర్’గా ఐపీఎస్ అసోసియేషన్ స్వోర్డ్ ఆఫ్ హానర్’లభించనుంది. శ్రేయ గుప్తా శ్రీ బుబానంద మిశ్రా స్మారక ట్రోఫీ అందుకోనున్నారు.
నాన్నే నాకు ప్రేరణ: రంజీత శర్మ
సివిల్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఐపీఎస్ కావడం. శిక్షణలో భాగంగా వివిధ అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ, ప్రదర్శనకు నాన్న సతీష్‌కుమారే ప్రేరణ. ఆరోప్రయత్నంలో ఐపీఎస్ సాధించాను. నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోకుండా కృషి చేస్తే అసాధ్యమనేది ఏదీ లేదనేది నిజమైంది.