కూటమికి ఓటేస్తే అంధకారమే: ఎంపీ కవిత
సాక్షి, డిచ్పల్లి/మోపాల్: ప్రజా కూటమి పేరుతో వచ్చే అభ్యర్థులకు ఓటు వేస్తే రాష్ట్రాన్ని మరోసారి అంధకారంలోకి నెడతారని నిజామాబాద్ ఎంపీ కవిత పేర్కొన్నారు. మహా కూటమి కాదు.. మాయల కూటమి అని దుయ్యబట్టారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ ఎన్నికల్లో ఏం పని అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు మద్దతుగా ఎంపీ కవిత సోమవారం డిచ్పల్లి, మోపాల్ మండలాల్లోని మిట్టాపల్లి, సారంగపూర్‌లలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీడీపీ, కాంగ్రెస్ పొత్తు అనైతికమని విమర్శించారు. తెలంగాణపై అధికారం చెలాయించడానికి చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏర్పడితే మళ్లీ అధికారం ఆంధ్రోళ్ల చేతుల్లోకి వెళ్తుందన్నారు. ఇప్పటికే ఉమ్మడి పాలనలో అరవై ఏండ్లు గోస పడ్డాం. మళ్లీ ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు.
తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి పక్క రాష్ట్రమైన మహారాష్ట్రకు చెందిన ధర్మాబాద్ తదితర 40 గ్రామాల సర్పంచులు తమ గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని గతంలో బాజిరెడ్డి గోవర్ధన్‌ను కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి రూరల్‌లో ఎమ్మెల్యేగా బాజిరెడ్డి గోవర్ధన్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని, సొంత స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకునే వారికి రూ.5లక్షలు ఇస్తామని తెలిపారు. ప్రజలు సంతోషంగా ఉండటం చూసి ఓర్వలేని కాంగ్రెస్, టీడీపీ నాయకులు కూటమి కట్టి టీఆర్ఎస్ అమలు చేస్తున్న అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
ప్రజలు విజ్ఞతతో ఆలోచించి అభివృద్దిని చూసి ఆశీర్వదించాలని కోరారు. అనంతరం గొల్లకుర్మలు ఎంపీ కవిత, ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు గొర్రె పిల్లలను కానుకగా అందజేశారు. మాజీ జెడ్పీటీసీ దినేశ్‌కుమార్, ఎంపీపీ దాసరి ఇందిర, ఎంపీటీసీ సవిత, టీఆర్ఎస్ మం డల అధ్యక్ష, కార్యదర్శులు శక్కరికొండ కృష్ణ, ఒడ్డెం నర్సయ్య, లక్ష్మీనర్సయ్య, నేతలు రాజు, బాల గంగాధర్, గోపు వెంకన్న, గంగరత్నం, సాయిలు, సత్యనారాయణ, గోపు రవీందర్, శ్రీనివాస్‌గౌడ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.