Nizams Institute of Medical Sciences
-
‘వణికి’స్తోంది
సాక్షి, హైదరాబాద్: పార్కిన్సన్స్ (వణుకుడు రోగం) వ్యాధికి కేంద్ర బిందువుగా భారత్ మారుతోందని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూరాలజీ విభాగం వైద్య బృందం తెలిపింది. ప్రస్తుతం దేశంలో ప్రతి లక్ష మందిలో 120 మంది ఈ వ్యాధిగ్రస్తులు ఉన్నారని.. మొత్తంగా 5.8 లక్షల మంది పార్కిన్సన్స్తో బాధపడుతున్నారని చెప్పింది. 2030 నాటికి ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు తాము చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయని నిమ్స్ ఆస్పత్రి వైద్య బృందం చెప్పింది. ఆదివారం నిమ్స్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్‌లో పార్కిన్సన్స్ వ్యాధిపై వైజ్ఞానిక సదస్సు జరిగింది. పార్కిన్సన్స్ అధునాతన చికిత్సలో వాడే డి–మైన్ పంపులు, ఇంజక్షన్లను లండన్‌లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్‌కు చెందిన మూవ్మెంట్ డిజార్డర్స్, పార్కిన్సన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డైరెక్టర్ డాక్టర్ వినోద్ మెట్టా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. పార్కిన్సన్స్ చికిత్సలో భాగంగా అపోమోర్ఫిన్ థెరపీ విధానంలో మందులు తీసుకునేప్పుడు ఉపశమనం ఉంటుంది కానీ కొద్దిరోజుల తర్వాత అవి సరిగా పని చేయట్లేదని చెప్పారు. ఫలితంగా రోగుల్లో వణుకు, పటుత్వం కోల్పోవడం, ఆందోళన చెందడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. ప్రస్తుతం అధునాతన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. యువ జనాభాలోనూ సమస్య నిమ్స్ హాస్పిటల్లో డి–మైన్ పంపులు, సిరంజ్ లు ఉపయోగించి చేసే అపోమోర్ఫిన్ చికిత్సా విధానాన్ని అందుబాటులోకి తెచ్చామని నిమ్స్ న్యూరాలజీ హెచ్‌వోడీ ప్రొఫెసర్ రూపమ్ బొర్గొహెయిన్ తెలిపారు. ఐరోపాలో బాగా వాడే ఈ థర్డ్ జనరేషన్ అపోమోర్ఫిన్–డెలివరీ పరికరాలు నిమ్స్‌తో పాటు నగరంలోని అన్ని ప్రఖ్యాత ఆస్పత్రుల్లో రోగులకు అందుబాటు లోకి వచ్చాయన్నారు. రోగుల్లో ఎక్కువ మంది 50 ఏళ్లు పైబడిన వారే ఉన్నా యువ జనాభాలో నూ సమస్య పెరుగు తోందని అన్నారు. భవిష్యత్‌లో దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై పార్కిన్సన్స్ ప్రభావం చూపొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 30 మంది న్యూరాలజిస్ట్లు, మూవ్ మెంట్ డిజార్డర్స్ స్పెషలిస్టులు ఈ కొత్త తరహా డ్రగ్ డెలివరీ పరికరం వాడకంపై సందేహాలను నివృత్తి చేసుకున్నారని సెలెరా న్యూరో సైన్సెస్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ బాబూ నారాయణన్ చెప్పారు. -
యువతి శరీరంలో బుల్లెట్
-
యువతి శరీరంలో మూడేళ్లుగా బుల్లెట్!
సాక్షి, హైదరాబాద్ : వెన్నునొప్పి చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన ఓ యువతి శరీరంలో బుల్లెట్ బయటపడటం నిమ్స్ ఆస్పత్రిలో కలకలం రేపింది. వివరాలు.. ఫలక్‌నుమా జహ్నుమా ప్రాంతంలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి కుమార్తె(18) స్థానికంగా కుట్టుమిషన్ పనిచేస్తోంది. 3 నెలలుగా వెన్నునొప్పితో బాధపడుతుండటంతో చికిత్స కోసం ఆమె నిమ్స్‌లో చేరింది. వైద్యులు ఎక్స్‌రేతోపాటు పలు వైద్య పరీక్షలు నిర్వహించి వెన్నుపూస, ఉదర కోశం భాగంలో గాయమున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో సదరు యువతికి శస్త్రచికిత్స నిర్వహించగా బుల్లెట్ బయటపడింది. దీంతో కంగుతిన్న వైద్యులు బుల్లెట్ ఎక్కడ నుంచి వచ్చిందని యువతి కుటుంబ సభ్యులను ప్రశ్నించగా వారు తెలియదని సమాధానం ఇచ్చారు. యువతి శరీరంలో బుల్లెట్ రెండు, మూడేళ్ల క్రితం నుంచి ఉన్నట్లుగా వైద్యులు భావిస్తున్నారు. దీనిపై నిమ్స్ ఉన్నతాధికారులు పంజగుట్ట పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ మేరకు ఫలక్‌నుమా పోలీసులకు సమాచారం ఇచ్చారు. గతంలో వీరు ఎక్కడ నివాసం ఉన్నారు..? ఆ ప్రాంతంలో ఏదైనా ఫైరింగ్ పాయింట్ ఉందా? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
మూలకణ చికిత్సకు నిమ్స్‌లో ప్రత్యేక విభాగం
రూ. 25 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్: రాష్ట్రంలో మొదటిసారిగా ప్రభుత్వరంగంలో కేన్సర్, కీళ్ల నొప్పులు వంటి మొండి జబ్బులను నయం చేసే మూలకణ చికిత్స నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(నిమ్స్)లో అందుబాటులోకి రానుంది. దీనికోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు కానుంది. మూల కణాలను సేకరించడం, సంబంధిత బంధువులకుగాని, ఇతర రోగులకుగాని ఇచ్చి చికిత్స నిర్వహించడం ఈ విభాగం పని. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక విభాగం ఏర్పాటుకు రూ.25 కోట్లు మంజూరు చేసిందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. మూల కణాల సేకరణ, భద్రత కోసం సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) సహకారం తీసుకోనున్నారు. ఈ మేరకు ఇటీవల సీసీఎంబీతో నిమ్స్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సీసీఎంబీ శాస్త్రవేత్తలు మూలకణాలను సేకరించి భద్రపరిస్తే, వాటితో నిమ్స్ వైద్యులు రోగులకు చికిత్స నిర్వహిస్తారు. నిమ్స్‌లోని ఈ విభాగానికి అధిపతిగా డాక్టర్ నరేంద్ర వ్యవహరిస్తారు. కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో మూలకణ చికిత్సకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుండగా నిమ్స్‌లో రూ.10 లక్షలకే అందుబాటులోకి రానుంది. బోన్‌మ్యారో చికిత్సను ఆరోగ్యశ్రీ రోగులకైతే రూ. 8.7 లక్షలకే చేస్తారు. నిమ్స్‌లో మూలకణ చికిత్స విభాగం మూడు నెలల్లో అందుబాటులోకి రానుంది. ప్రత్యేక విభాగం కోసం నిమ్స్‌లో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఒక అంతస్తును కేటాయించారు. రాష్ట్రంలో రెండు కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రమే మూలకణ చికిత్స అందుబాటులో ఉంది. వివిధ రకాల క్యాన్సర్లతో వచ్చే రోగులకు మూల కణ చికిత్స అత్యంత కీలకమైందని, దీన్ని ప్రభుత్వం రంగంలో తీసుకురావడం అభినందనీయమని నిమ్స్ వర్గాలు చెబుతున్నాయి. -
శేషగిరిరావుకు క్లీన్చిట్
నిమ్స్ కార్డియాలజీ విభాగం అధిపతిని నిర్దోషిగా ప్రకటించిన సర్కారు హైదరాబాద్: నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) కార్డియాలజీ విభాగం అధిపతి డాక్టర్ డి.శేషగిరిరావుకు రాష్ట్ర ప్రభుత్వం క్లీన్చిట్ ఇచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్‌చందా ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య పరికరాల డీలర్ నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపిస్తూ అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) రెండేళ్ల క్రితం శేషగిరిరావుపై కేసు నమోదు చేసింది. ప్రముఖ వైద్యుడిగా గుర్తింపు పొందిన ఆయనను.. ఆరోపణలు సరైనవా కావా అన్నది విచారించకుండానే అరెస్టు చేసింది. 55 రోజుల పాటు బెయిల్ రాకుండా అడ్డుకుంది. అవినీతి కేసులో అరెస్టు కావడంతో2013 జనవరిలో ప్రభుత్వం ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఆ తర్వాత అదే ఏడాది సస్పెన్షన్ ఎత్తివేసింది. ఏసీబీ తనపై తప్పుడు కేసు పెట్టిందంటూ శేషగిరిరావు ప్రభుత్వాన్ని ఆశ్రయిం చగా, మరోవైపు ఆయనను ప్రాసిక్యూట్ చేయాలంటూ ఏసీబీ ప్రభుత్వాన్ని కోరింది. అయితే శేషగిరిరావు అభ్యర్థన మేరకు సర్కారు విజిలెన్స్ కమిషనర్ విచారణకు సిఫారసు చేసింది. సమగ్ర దర్యాప్తు జరిపిన విజిలెన్స్ కమిషనర్ ఆయనపై వచ్చిన ఆరోపణలు నిరూపితం కాలేదని తేల్చారు. లంచం తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. అతనిపై వచ్చిన ఆరోపణలు రుజువు కానందున ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. దీంతో శేషగిరిరావును నిర్దోషిగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పథకం ప్రకారం శేషగిరిరావుపై కుట్ర పన్ని కేసులో ఇరికించే ప్రయత్నం చేయడాన్ని ఏసీబీ పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని వైద్యవర్గాలు తప్పుపడుతున్నాయి. ఇలాంటి చర్యలు ప్రతిష్టాత్మక వ్యక్తులు, వారి కుటుంబాల్లో చీకట్లు నింపుతాయని, మానసికంగా ఇబ్బందుల పాలు చేస్తాయని వారు మండిపడుతున్నారు.