మెగా మ్యూజియం గురించి తెలుసా?
మ్యూజియం అంటే కళాఖండాలు, పురాతన వస్తువులు ఉంటాయని తెలుసు. అయితే చిన్నపిల్లల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మ్యూజియం గురించి మీకు తెలుసా? అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఇండియానా పోలిస్ అనే ప్రాంతంలో ’The Children’s Museum of Indianapolis.’ ఉంది. ప్రపంచంలో పిల్లల కోసం ఏర్పాటు చేసిన అతి పెద్ద మ్యూజియం ఇది. 1925లో మేరీ స్టీవర్ట్ కారీ అనే ఆయన దీన్ని ప్రారంభించారు. మొదట చిన్నగా మొదలైన ఈ మ్యూజియం అనంతరం విస్తరిస్తూ 1976లో అతి పెద్ద మ్యూజియంగా మారింది. 4,72,900 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ మ్యూజియంలో ఐదు అంతస్తులున్నాయి. ఇక్కడ దాదాపు 1,30,000కు పైగా రకరకాల వస్తువులు, కళాఖండాలు ఉన్నాయి. ఏటా పది లక్షలమందికి పైగా ఈ మ్యూజియాన్ని సందర్శిస్తుంటారు. వారికి సేవలందించేందుకు నాలుగు వందల మంది ఉద్యోగులు, 1500 మంది వాలంటీర్లు ఉంటారు.చిన్నారుల్లో సైన్స్ పట్ల, సామాజిక అంశాల పట్ల ఆసక్తి, అవగాహన పెంచడం ఈ మ్యూజియం ప్రధాన ఉద్దేశం. ఇందులో సైన్స్, చరిత్ర, జంతువులు, వైద్యం, సామాజిక, ఆర్థిక అంశాలను సూచించే అనేక వస్తువులున్నాయి. అవన్నీ పిల్లలకు చూపించడం ద్వారా వారిలో ఆ అంశాలపై అవగాహన పెంచుతారు. ఒక్కో ఫ్లోర్లో ఒక్కో అంశానికి సంబంధించిన వస్తువులు ఉంటాయి. డైనోసార్ల జీవితం, వాటి మరణం వంటి అంశాలను వివరించేందుకు ఇక్కడ ప్రత్యేక విభాగం ఉంది. అది చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంటుంది.కేవలం వస్తువులు చూసి వెళ్లిపోయేలా కాకుండా ఈ మ్యూజియంలో పలు క్రీడా కోర్టులు ఏర్పాటు చేశారు. చిన్నారులు అక్కడికి వెళ్లి వారికి నచ్చిన ఆటలు ఆడుకోవచ్చు. మ్యూజియంలో ‘లిల్లీ థియేటర్’ కూడా ఉంది. అక్కడ చిన్నారుల కోసం ప్రత్యేకంగా నాటకాలు, షోలు ఏర్పాటు చేస్తుంటారు.